కరీంనగర్ జిల్లాలో ‘బౌద్ధ బ్రహ్మ’!
అరుదైన విగ్రహాన్ని గుర్తించిన ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం
సాక్షి, హైదరాబాద్: త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు మందిరం ఉండదు.. విగ్రహమూ ఎక్కడా కనిపించదు. కానీ బౌద్ధ మతంలో నాలుగు తలలు, శరీరాలతో బ్రహ్మ అవతారంలో విగ్రహం కనిపిస్తుంది. అయితే మన దేశంలో ఈ ‘బౌద్ధ బ్రహ్మ’ విగ్రహాలు వెలుగుచూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా కోహెడ మండలం సింగరాయలొద్దిలో ఈ అరుదైన విగ్రహం వెలుగు చూసింది. పాకిస్తాన్‌లోని సింధ్‌లో లభించిన గుప్తుల కాలంనాటి కంచు విగ్రహాన్ని ఇది పోలిఉంది. 6 శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ విగ్రహం ప్రస్తుతం ఎలాంటి ఆలనాపాలనా లేకుండా మట్టికొట్టుకుపోయి ఉంది. ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు రామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు స్థానికులైన శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, పొన్నాల బాలయ్య తదితరుల సాయంతో ఈ విగ్రహాన్ని గుర్తించారు.
నాలుగు శరీరాలతో: ‘బౌద్ధ బ్రహ్మ’ ఆకారం నాలుగు తలలతో ఉంటుంది. అరుదుగా కొన్నిచోట్ల మాత్రం నాలుదిక్కులా నాలుగు శరీరాలతో కూడా కనిపించింది. సింగరాయలొద్దిలో లభించిన విగ్రహం కూడా నాలుగు శరీరాలతో ఉంది. అయితే ముందువైపు పూర్తిగా ఉండగా.. మిగతా మూడు వైపులా అంత స్పష్టంగా లేదు. ముందువైపు జటామలకాలున్న నాలుగు తలలు, రెండు చేతులు ఉన్నాయి. ఎడమ చేతిలో కమండలం ఉంది. థాయ్‌లాండ్‌లో ఈ తరహా విగ్రహాలు ఉన్నాయి.
బౌద్ధుల ఆవాసం: ఈ విగ్రహానికి ఎదురుగా 50 అడుగుల వ్యాసంలో ఇటుకల వృత్తాకార నిర్మాణాలు ఉన్నాయి. ఇటుకలు జారిపోకుండా అంచులకు రాతి కట్టడం ఉంది. కాస్త దూరంలో 20 అడుగుల వ్యాసమున్న మట్టి ఒరల బావి జాడ ఉంది. బౌద్ధ హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాల కాలంనాటి బౌద్ధ క్షేత్రంగా ఈ ప్రాంతం విలసిల్లిందని ఈ ఆనవాళ్లు తెలుపుతున్నాయని ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం సభ్యులు చెప్పారు. ఇక్కడ పరిశోధనలు జరిపితే ఎన్నో చారిత్రాక విశేషాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ విగ్రహం బయటపడిన చోటికి సమీపంలోనే మోయతుమ్మెదవాగు ఉంది. వాగు ఆవల సన్యాసుల మఠం, మునుల గుహ పేరుతో బౌద్ధుల ఆవాసం ఉంది. ప్రస్తుతం దాన్ని ఆంజనేయుడి మందిరంగా పూజిస్తున్నారు. ఇక్కడికి దగ్గరలోని నాగసముద్రం గ్రామంలో నాగార్జునాచార్యుడు ఉన్నట్టు చారిత్రాక జాడలున్నాయి. ఈ మోయతుమ్మెదవాగు మానేరుకు ఉపనది. దాని ప్రవాహమార్గంలో బౌద్ధం విలసిల్లిందని చరిత్ర చెబుతోంది.