మౌనసందేశం ఇచ్చే మంచి చిత్రం
నచ్చిన అమ్మాయిని ప్రేమించడం... ప్రపోజ్ చేయడం...
కాదంటే -
అడ్డంగా నరికేయడం... ఆసిడ్ పోయడం...
నలుగురిలో అవమానించడం...
ప్రేమ గుడ్డిదనడానికి ఇదో పెద్ద నిదర్శనం.
ప్రేమించడంలో ఎంత బాధ్యత ప్రదర్శించాలో...
ప్రేమించబడటంలోనూ అంతే బాధ్యత ప్రదర్శించాలి.
అప్పుడే ప్రేమ విజయవంతం అవుతుంది.
ఒక ప్రేమకథ లో జరిగిన ఊహించని మలుపే బ్రహ్మేశ్వరరావు తీసిన ‘ట్విస్ట్’
డెరైక్టర్స్ వాయిస్:
మా స్వగ్రామం చిలకలూరిపేట దగ్గర ఎడ్లపాడు. నేను కోటప్పకొండ దగ్గర ఉన్న కాలేజీలో డి.ఫార్మసీ చదివాను. మల్టీమీడియాలో యానిమేషన్ చేశాను. సినిమాకు సంబంధించిన వర్క్ నేర్చుకుంటున్నాను. డెరైక్షన్ ఫీల్డ్‌లో ఇంటరెస్ట్ ఎక్కువ. సినిమా డెరైక్షన్ చాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం పార్ట్ టైమ్‌గా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేస్తున్నాను. ఎడిటింగ్ సెన్స్ ఉంటే డెరైక్షన్ చేయడంలో మెలకువలు బాగా తెలుస్తాయి. అందుకని చేస్తున్నాను. మా తల్లిదండ్రులు నన్ను బాగానే ప్రోత్సహిస్తున్నారు. ఈ చిత్రానికి మా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది. ‘తను ప్రేమించిన మనిషి తన సొంతం కావాలనుకోవడంలో తప్పు లేదు కాని, ఏ కారణం చేతనైనా వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతను సహృదయంతో అర్థం చేసుకోవాలే కాని, పగలు ప్రతీకారాలు మంచివి కావు’ అని చెప్పడానికే ఈ చిట్టిచిత్రం తీశాను.
షార్ట్ స్టోరీ:
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని ఆ అమ్మాయి అతడి ని తిరస్కరిస్తుంది. మరో అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆమె సంతోషం తో అతడిని అంగీకరించ డం కళ్లారా చూస్తాడు. తనను తిరస్కరించి, మరొకరిని అంగీకరించినందుకు అతడికి అసూయ కలుగుతుంది. కోపంతో పిడికిలి బిగిస్తాడు. పక్కనే ఉన్న కొబ్బరిబొండాలను కొట్టే కత్తిని చేతిలోకి తీసుకుంటాడు. ఆ తరవాత ఏమవుతుందో చిట్టితెర మీద చూడాల్సిందే.
కామెంట్: మంచి అంశాన్ని ఎంచుకున్నందుకు బ్రహ్మేశ్వరరావుని అభినందించాలి. ప్రేమించేవారికి ప్రేమతో పాటు సహనం, క్షమాగుణం ఉండాలనే సందేశాన్ని ఎంతో చక్కగా చూపాడు. ఒక్క డైలాగు కూడా లేకుండా ఏడు నిముషాల పాటు నడిచిన ఈ కథ ఎక్కడా విసుగనిపించదు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌లా చాలా సినిమటిక్గా తీశాడు. సస్పెన్స్, అంతలోనే ఒక సందేశం, ఆ తరువాత చిన్న హాస్యం... చిట్టి చిత్రంలోనే... పెద్ద సినిమాఅంత కథను చూపడంలో ఎంతో నేర్పు ప్రదర్శించాడు. మంచి కథా వస్తువును తీసుకున్నాడు. మంచి చిత్రంగా తీయగలిగాడు. మంచి దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నాడు. యువతకు మంచిని బోధించిన ఈ చిత్రదర్శకుడికి అభినందనలు తెలియచేయాల్సిందే.
- డా.వైజయంతి