తాగునీటికి ఇబ్బందులు ఉండవు: బీఎంసీ
సాక్షి, ముంబై: నగరవాసులకు తాగునీటి తంటాలు ఉండవని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఈసారి సగటు వర్షపాతంకంటే తక్కువ నమోదైనా పెద్ద ఇబ్బంది ఉండదని తెలిపింది. గతంతో పోలిస్తే ఈసారి 40 శాతం అధికంగా నీటి నిల్వలు ముంబైకి సరఫరా చేసే జలాశయాల్లో ఇప్పటికే ఉన్నట్టు తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో నీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. కాగా, 2009లో వర్షాలు తక్కువపడడంతో సంవత్సరం పొడవున నీటి కోసం ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఈసారి 94 శాతం వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతవరణ శాఖ పేర్కొంటోంది. దీంతో ఈ సంవత్సరం నీటి గురించి చింతించాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ తెలిపింది. నగరానికి సరఫరా అయ్యే నీటిలో 50 శాతం నీటి సరఫరా అప్పర్ వైతర్ణా జలాశయం నుంచి అవుతోంది. ప్రస్తుతం అప్పర్ వైతర్ణా జలాశయంలో 99 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి.
భాత్సాలో 77 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నట్టు బీఎంసీ పేర్కొంది. ఈ నీటి నిల్వలు గత సంవత్సరంతో పోలిస్తే 40 శాతం అధికంగా ఉందని పేర్కొంది. దీంతో వాతావరణ శాఖ పేర్కొన్న 94 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదైన ముంబైవాసులకు నీటి కోసం ఇబ్బందులు రావని నీటి సరఫరా విభాగం ధీమా వ్యక్తం చేస్తోంది.