విద్యార్థికి క్షమాపణలు చెప్పిన యూనివర్శిటీ
లండన్: టెర్రరిజం పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. ఉగ్రవాదంపై చేస్తున్న స్టడీలో భాగంగా దానికి సంబంధించిన పుస్తకాన్ని చదువుతున్న విద్యార్థిపై టెర్రరిస్టు ముద్రవేసిన బ్రిటన్లోని స్టాఫర్డ్షైర్ కౌంటీ యూనివర్శిటీ ఆనక నాలుక కరుచుకుంది. పొరపాటయ్యిందంటూ తప్పును ఒప్పకుంది. క్షమాపణలు చెప్పింది. ఉగ్రవాదం-అంశంపై పరిశోధన చేస్తున్న విద్యార్థిని తప్పుగా అర్థం చేసుకున్నామని సర్ది చెప్పుకుంది.
మహ్మద్ ఉమర్ ఫరూఖ్(33) స్టాఫర్డ్షైర్ కౌంటీ యూనివర్శిటీ లో టెర్రరిజం, క్రైమ్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ అనే అంశం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో యూనివర్శిటీ లైబ్రరీలో 'టెర్రరిజం స్టడీస్' అనే పుస్తకాన్ని చదువుతుండగా అతనిపై అధికారులు టెర్రరిస్టు ఆరోపణలు చేశారు. అయితే ఈ పరిణామంతో షాకైన ఫరూఖ్ న్యాయపోరాటం చేశాడు. తాను చేస్తున్న కోర్సులో భాగంగా చదువుకుంటోంటే తనపై అన్యాయంగా ఆరోపణలు చేశారంటున్నారు. దీనిపై తాను తీవ్ర పోరాటం చేసి ఉండకపోతే .. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పడివుండేవాడినంటున్నాడు.
దీంతో ఈ వివాదంపై సుమారు మూడు నెలల విచారణ జరిపిన యూనివర్శిటీ అతనిపై ఆరోపణలు నిరాధారమైనవని తేల్చి చెప్పింది. పరిస్థితిని అంచనావేయడంలో తీవ్ర పొరపాటు జరిగిందంటూ విచారం వ్యక్తం చేసింది. అతని పరిశోధన కొనసాగింపులో తమ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉగ్రవాద కార్యకలాపాల్ని నిరోధించే చర్యలను అమలు చేసే క్రమంలో భాగంగా తమ అధికారులు పొరపాటుపడ్డారని యూనివర్శిటీ ప్రకటించింది.