అలాంటప్పడు తుపాకీ ఎందుకు ఇచ్చారు?
చండీగఢ్: సరిహద్దు రక్షక దళం(బీఎస్ఎఫ్)లో సైనికుల దుస్థితిని వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చిన తన భర్తపై కక్ష సాధిస్తున్నారని తేజ్ బహదూర్ యాదవ్ భార్య షర్మిల వాపోయింది. ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని తనను ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని తనతో యాదవ్ చెప్పాడని ఆమె వెల్లడించారు. బీఎస్ఎఫ్ సైనికులకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ తన భర్త వీడియో ద్వారా ప్రపంచానికి వెల్లడి చేయడాన్ని ఆమె సమర్థించారు.
కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని తన భర్త సహించడని, అందువల్లే ఉద్యోగంలో చాలాసార్లు సమస్యలు ఎదుర్కొన్నాడని తెలిపారు. తన భర్త మానసిక పరిస్థితి సరిగా లేదన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. ‘ఆయనకు మతిస్థిమితం లేదని, క్రమశిక్షణ పాటించడని అంటున్నారు. అటువంటి ఆయనకు సరిహద్దులో కీలక ప్రాంతాల్లో కాపలా కాయడానికి తుపాకీ ఎందుకు ఇచ్చార’ని షర్మిల ప్రశ్నించారు. కాగా, తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో ఇప్పటివరకు 90 లక్షల మంది వీక్షించారు. 4.4 లక్షల మంది షేర్ చేశారు.