Buddhist association
-
బౌద్ధ వర్ధనుడు
వైశాఖ పున్నమి రోజున పుట్టిన సిద్ధార్థుడు తన పదహారో ఏట యశోధరను వివాహమాడాడు. ఆయనకు 29వ ఏట సంతానం కలిగింది. రాహులుడు పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే ధర్మమార్గాన్ని, దుఃఖ నివారణ మార్గాన్నీ వెతుక్కుంటూ, తల్లిదండ్రులని, భార్యాబిడ్డల్నీ, మిత్రుల్నీ, అన్నదమ్ముల్నీ, ఆస్తిపాస్తుల్నీ రాజ్యాధికారాన్నీ వదిలి వనాలకు వెళ్లిపోయాడు. ఆరేళ్లు అనేక చోట్ల తిరిగి, అనేకమందితో చర్చించి చివరికి వైశాఖ పున్నమి నాడే బోధగయలోని రావి చెట్టుకింద జ్ఞానోదయం పొందాడు. దుఃఖ నివారణ మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆ తర్వాత సారనాథ్‌లో తొలిసారిగా ఐదుమంది అనుయాయులతో బౌద్ధ సంఘాన్ని స్థాపించాడు. కొద్ది నెలల్లోనే ఆ సంఘం మహా సంఘంగా విస్తరించింది. ఎందరో వేలాదిమంది ఆ సంఘంలో చేరారు. ఎవరో తాత్వికులు కాదు. గృహస్థులు కూడా. రాచకుటుంబాలకు చెందినవారు, వ్యాపారులు, పనీపాటలు చేసే కూలినాలీ జనం, అంటరాని కులాలవారు– అందరూ సంఘంలో చేరారు. నదులు సముద్రంలో కలిసి తమ ఉనికిని కోల్పోయినట్లు సంఘంలో చేరిన వారంతా తమ తమ కులం, గోత్రం, నామం, ప్రాంతీయతలు అన్నింటినీ కోల్పోయారు. బౌద్ధ సంఘంలో అందరూ సమానులే! అందరూ భిక్షాటన మీదే బతకాలి. అందరూ కాషాయ చీవరాలే ధరించాలి. నేలమీదే నిద్రించాలి.ఈ నిరాడంబర జీవితానికి, సంఘంలో చేరి బంధువులుగా గడపడానికీ బుద్ధుడు చెప్పిన ధర్మవ్యక్తికి తమ వంతు కర్తవ్యాన్ని జోడించడానికి అందరిలాగే .. బుద్ధుని కుటుంబ సభ్యులు, శాక్యరాజ్యం వంశీకులు దాదాపుగా అందరూ ముందుకొచ్చారు. వారిలో మొదటివాడు ఆయన తండ్రి శుద్ధోదనుడే!శాక్యరాజవంశంలో ప్రముఖులు ఐదుగురు. వారు శుద్ధోదనుడు, అతని నలుగురు సోదరులు శుక్లోదనుడు, శాక్యోదరుడు, ధోతోదనుడు, అమితోదనుడు. వారికి ఒక చెల్లి, అమితాదని. ఐదుగురు అన్నదమ్ములకూ ఎనిమిది మంది సంతానం. సిద్ధార్థుడు, నందుడు, ఆనందుడు, మహానాముడు, అనిరుద్ధుడు, భద్దియడు, భాడవుడు, కింబిలుడు.అమితాదనికి ముగ్గురు సంతానం. తిష్యుడు, దేవదత్తుడు, యశోధర.వీరిలో తొలుత బుద్ధోపదేశం విని బౌద్ధాభిమానిగా మారిన తొలి వ్యక్తి శుద్ధోదనుడే!సిద్ధార్థుడు జ్ఞానం పొంది బుద్ధుడయ్యాక శుద్ధోదనుడు తమ నగరం కపిలవస్తుకు రమ్మని బుద్ధుని బాల్యమిత్రుడు కాలు ఉదాయితో కబురు పెడతాడు.బుద్ధుడు కపిలవస్తు నగరం వదిలిన తర్వాత ఏడేళ్లకు తిరిగి అక్కడికి వెళ్తాడు.అనారోగ్యంతో మంచి పట్టిన తండ్రికి ధర్మోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశంతో ఆయనలో అంతకుముందు ఉన్న దుఃఖం తీరిపోతుంది. తననూ బౌద్ధునిగా అనుమతించమని వేడుకుని నమస్కరిస్తాడు తండ్రి. అలా శుద్ధోదనుడు శాక్యవంశ తొలి బౌద్ధ ఉపాసకుడయ్యాడు. ఆ తర్వాత యశోధర తన ఏడేళ్ల బిడ్డను బుద్ధుని దగ్గరకు పంపుతుంది. ‘వారే నీ తండ్రిగారు. నీకు రావలసిన ఆస్తి, అధికారానికి సంబంధించిన హక్కుల్ని అడిగి తెచ్చుకో’ అని రాహులుణ్ణి బుద్ధుని దగ్గరకు పంపుతుంది యశోధర.‘‘నాయనా! నాకున్న ఆస్తి ఇదే’ అని ఏడేళ్ల కొడుకు చేతిలో భిక్షాపాత్ర పెడతాడు బుద్ధుడు. ‘‘నాకుంది ధర్మాధికారమే. అది నీవూ గ్రహించు’’ అని బౌద్ధసంఘంలో చేర్పించుతాడు. అలా తొలి బౌద్ధ సంఘం బాలభిక్షువు రాహులుడయ్యాడు!ఆ తర్వాత బుద్ధుని మిత్రుడు కాలు ఉదాయి, అతని సోదరులు, మేనత్త బిడ్డలు దాదాపుగా కాస్త వెనకాముందుగా అందరూ బౌద్ధసంఘంలో చేరి భిక్షువులుగానే జీవితాంతం జీవించారు.తన భర్త శుద్ధోదనుడు మరణించాక సిద్ధార్థుని పెంచిన తల్లి, పిన్నమ్మ గౌతమి కూడా కపిలవస్తు నుండి రాజగృహకు కాలినడకన వెళ్లింది. తనతోపాటు కోడలు యశోధరను, మిగిలిన కోడళ్లనూ, మరికొంతమంది శాక్య స్త్రీలనూ వెంటబెట్టుకుని వెళ్లింది.‘తమకూ భిక్షుసంఘంలో అర్హత కల్పించమని అడిగింది.బుద్ధుడు అందుకు అనుమతించి తొలిగా తన తల్లినే భిక్షుణిగా మార్చాడు. భిక్షుణీ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలా బౌద్ధభిక్షువుగా మారిన తొలి మహిళా మూర్తి గౌతమే!శాక్యవనం ఆస్థాన క్షురకుడు ఉపాలీ, రథచోదకుడు చెన్నుడూ– ఎందరెందరో బౌద్ధ సంఘంలో చేరారు. ఉపాలికి ఎంత గౌరవ సంస్కారం దక్కిందంటే బుద్ధుని పరినిర్యాణం తర్వాత మూడు నెలలకి ఏర్పాటైన మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఆయనే!తానా కాకుండా తన కుటుంబాన్ని, తన శాక్యవంశాన్ని మొత్తం రాచరిక వ్యవస్థ నుండి బైటకు రప్పించి ధర్మమార్గంలో నడిపించిన ఆదర్శ దార్శనికుడు గౌతమ బుద్ధుడే!బుద్ధుని జీవితంలో గొప్ప విశేషమేమిటంటే ఆయన లుంబినీవనంలో పుట్టిందీ, బుద్ధగయలో బుద్ధత్వం పొందిందీ, చివరకు కుసీనగరంలో నిర్వాణం చెందిందీ వైశాఖ పున్నమి రోజునే! అందుకే ఈ వైశాఖ పున్నమి ఒక బుద్ధ జయంతి... ఒక బుద్ద వర్ధంతి! అంతేకాదు.. యశోధర జయంతి కూడా ఈనాడే! – డా. బొర్రా గోవర్ధన్ బుద్ధుణ్ణి సంసార చక్ర విధ్వంసకుడు అంటారు. సుఖదుఃఖాల గానుగ మరలాంటి సంసార చక్రాన్నుండి మానవాళిని బైట పడేసి, రక్షించిన ధార్మికునిగా బుద్ధుని కీర్తిస్తారు. కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యం, పదవి, అధికారం, శాసనం, యుద్ధం... ఇవన్నీ ఒకే ఒరలో దాగిన రకరకాల కత్తులు. వీటివల్ల హింస, ఉన్మాదం కలిగి చివరికి దుఃఖ సాగరంలో మునిగిపోతుంది మానవ జీవితం. ఈ దుఃఖ మహాసాగరాన్నుండి బైటకు వచ్చి, యోగం, ధ్యానం, సమాధి, ఇలాంటి స్థితుల్ని సాధించి ముక్తి, కైవల్యం లేదా నిర్వాణ మార్గాన సాగితే శాశ్వతంగా దుఃఖం నుండి మనిషి విముక్తుడవుతాడని భారతదేశంలో పుట్టిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు చెప్పాయి. వాటిలో బౌద్ధం కూడా ఒకటి. దుఃఖ నివారణ మార్గంలో నిర్వాణాన్ని అది చెప్పింది. సంసారాన్ని త్యజించి భిక్షువులుగా, సంసారంలోనే ఉంటూ, ఉపాసకులుగానూ ఈ నిర్వాణ స్థితుల్ని పొందవచ్చునని బుద్ధుడు చెప్పాడు. దుఃఖ నివారణ మార్గాన్ని అనుసరించే వారందరికీ ఒక సంఘాన్ని స్థాపించాడు. అదే బౌద్ధ సంఘం. ఆ సంఘంలో చేరి ధర్మాచరణ ద్వారా, ధర్మాన్ని ప్రచారం చేసే వారే భిక్షువులు. వీరికి కుటుంబం ఉండదు. ఆస్తిపాస్తులుండవు. వ్యక్తిగత వస్తువులు ఉండవు. అన్నీ సంఘానివే. అన్నీ ఉమ్మడివే! నియమ నిబంధనల రూపకల్పనలో కూడా ఉమ్మడి నిర్ణయమే తుది నిర్ణయం. -
మిత్రుడి ఒడి – తల్లి ఒడి
బౌద్ధసంఘంలో అగ్రభిక్షువుల్లో సారిపుత్రుడు, మౌద్గల్యాయనులు ముఖ్యులు. చిరకాలంగా మంచి మిత్రులు కూడా. వారిద్దరూ కలసిమెలసి ఉండటం చూసి, ఈర్ష్యనొందిన ఒక వ్యక్తి వారిద్దరి మధ్య తగవులు పెట్టాలనుకున్నాడు. ఒకరి మీద ఒకరికి చెప్పాడు. అలా వీలైనప్పుడల్లా చెప్తూనే ఉండేవాడు. అతని విషయం బుద్ధునికి తెలిసింది. ఒకరోజున భిక్షువులందరూ ఉన్న సమయంలో ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక సింహం, ఒక పులి ఒకే గుహలో అన్యోన్యంగా కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. వాటి దాపున ఉన్న బొరియలో ఒక నక్క కూడా ఉండేది. సింహం, పులి వేటాడి తెచ్చి, తినగా మిగిలిన మాంసాన్ని తిని జీవించేది. ఎంతో వినయం నటిస్తూ సింహానికి, పులికి సేవలు చేస్తూ ఉండేది. అలా కొన్నాళ్లకు అది దుక్కలా బలిసింది. ఒకరోజున అది ఇలా ఆలోచించింది. నేను ఎన్నో జంతువుల మాంసాల్ని రుచి చూశాను. సింహం, పులి మాంసాల్ని రుచి చూడలేదు. ఈ రెండింటికి తగవు పెట్టి, చంపుకునేలా చేసి, వీటి మాంసాన్ని తినాలి’’ అనుకుని సింహం దగ్గరకు వెళ్లి– ‘‘మహాశయా! మీకూ పులికీ మధ్య గొడవలేమైనా వచ్చాయా ఏమిటి?’’అంది. ‘‘ఎందుకలా అడిగావు?’’ అడిగింది సింహం.‘‘శరీర రంగులోనూ, బలంలోనూ, అందంలోనూ, శౌర్యంలోనూ నాలో ఒక వంతుకు కూడా సరిపోదు సింహం అని అందే ఆ పులి’’ అన్నది. ‘‘ నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పులి మిత్రుడు అలాంటి వాడు కాదు. నీవు మా మధ్య వుండ తగవు, వెంటనే వెళ్లిపో’’ అని కసిరి కొట్టింది సింహం. నక్క చెప్పిన మాటలు పులితోకూడా చెప్పలేదు సింహం. మరునాడు నక్క పులి దగ్గరకు వెళ్లి సింహానికి చెప్పినట్టే చెప్పింది. పులి కూడా నక్కను తరిమి కొట్టింది. కానీ వచ్చి– ‘‘మిత్రమా! నా గురించి ఇలా అన్నావా?’’ అని అడిగింది. అప్పుడు సింహం– పులి మిత్రమా! ఆ నక్కది దుష్టబుద్ధి. నాకూ అలాగే చెప్పింది. నీకు ఒక మాట చెప్తాను విను. మైత్రి అంటే... ఎవరెన్ని కొండీలు చెప్పినా నమ్మనిది. ఒక బిడ్డ తల్లి ఒడిలో తలపెట్టి ఎంత నిర్భీతిగా నిదురిస్తాడో, ఒక స్నేహితుని ఒడిలో తలపెట్టి మరో స్నేహితుడు అంత నిర్భీతిగా నిదురించేది. అదీ అసలైన మైత్రి’’ అని చెప్పగా– ‘‘మిత్రమా! నన్ను క్షమించు. ఇలా అన్నావా? అని వచ్చి అడగడం నా తప్పే’’ అని క్షమాపణలు కోరింది. ఈ కథ విన్న సారిపుత్రుడు, మౌద్గల్యాయనులూ ఆ వ్యక్తిని దూరం పెట్టారు. మరణించేవరకూ మిత్రులుగా జీవించారు. – డా. బొర్రా గోవర్ధన్ -
అనుకరణ... అనుసరణ
బౌద్ధసంఘంలో కొందరు భిక్షువులు తమ గురువులను, ముఖ్యంగా బుద్ధుణ్ణి అనుకరిస్తూ జీవించేవారు. ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. అలాంటి వారిలో దేవదత్తుడు ఒకడు. బుద్ధునిలా కూర్చుని, బుద్ధునిలా నడుస్తూ, బుద్ధునిలా పడుకుని, ‘నేనూ బుద్ధునిలాగే నడుచుకుంటున్నాను. బుద్ధునితో సమానమైన వాణ్ణే’ అని అంటూ ఉండేవాడు. దేవదత్తునిలాగా మరికొంతమంది భిక్షువులు తయారయ్యారు. ఒకరోజున ఒక అనుకరణ భిక్షువు బుద్ధుని కొరకు వచ్చినప్పుడు బుద్ధుడు ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక మహావృక్షం కింద ఒక ఏనుగు జీవిస్తూ ఉండేది. ఆ సమీపంలో ఒక సరోవరం ఉంది. దాని నిండా ఎర్రకలువలూ, ఎర్ర తామరలూ ఉన్నాయి. ప్రతిరోజూ సరోవరం నిండా వాటి పూలే. ఆ ఏనుగు రోజూ సరోవరంలో దిగి తామరతూడులు, దుంపలు లాగేసేది. పూలూ, తూడులు తినేది. దుంపలకు అంటిన బురదని నీటిలో జాడించి, శుభ్రం చేసుకుని తినేది. దాని బొరియల్లో ఒక గుంటనక్క జీవిస్తూ ఉండేది. అది ముద్దుగా, బొద్దుగా ఉన్న ఏనుగుని చూసి ‘నేనూ ఇలా బలంగా తయారవ్వాలి’ అనుకుంది. ‘ఏనుగు తామర తూడులు, దుంపలు తినడం చూసి నేనూ ఇక వీటినే తినాలి. ఏనుగులా బలాన్ని తెచ్చుకోవాలి’ అనుకుని సరస్సులో దిగి తామరతూడుల్ని పీకి దుంపల్ని బురదతో సహా తినడం మొదలు పెట్టింది. కొన్ని రోజులు అలా తినేసరికి, దాని పేగుల్లో మట్టి పేరుకుని పోయి, జబ్బు చేసి, చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. బుద్ధుడు చెప్పిన ఈ కథ విన్న భిక్షువుకి ‘మనిషికి ఆచరణ స్వాభావికం కావాలి కానీ, ఎవరినో అనుకరించి, మనది కాని స్వభావాన్ని మనం తెచ్చిపెట్టుకోకూడదు. తెచ్చిపెట్టుకున్నది నటనే అవుతుంది కానీ నిజం కాదు’ అని అర్థమై తన నడవడిక మార్చుకుని, ఆచరణను సరిదిద్దుకున్నాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
బుద్ధుడు పలికిన రోజు
బౌద్ధంలో ఆషాఢ పున్నమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ధర్మ ప్రచారానికి తొలి అడుగు వేసిన రోజు అది. బౌద్ధ సంఘం పుట్టిన రోజు. ధర్మం అడవుల్ని వదిలి ప్రజల్లోకి నడక సారించిన రోజు. అది రుషి పట్టణంలోని లేళ్ళ వనం.వనమంతా పచ్చదనం పరచుకుని ఉంది. ఆ రోజు ఆషాఢ పున్నమి.వనం మౌనముద్రలో ఉన్న మునిలా ఉంది. నిశ్శబ్ద పరీమళాలు వెదజల్లుతోంది.వనం మధ్య మట్టి దిబ్బ మీద కూర్చొని దూరంగా తమ వైపుకే వస్తున్న వ్యక్తికేసి కన్నార్పకుండా చూస్తున్నారు ఓ ఐదుగురు తపోధనులు. ఆ వచ్చే వ్యక్తిని అల్లంత దూరాన్నుండే ఆనవాలు పట్టారు. వెంటనే వారి ముఖాల్లో కొద్దిపాటి అయిష్టత తొంగి చూసింది. కానీ... ఆ వ్యక్తి ప్రశాంత గంభీరగమనం వారికి విజ్ఞాన వసంతాగమనంలా అనిపించింది. అతని నిర్మల వదనం ఓ అహింసా సదనంలా తోచింది. జ్ఞాన పుంజాలు వెదజల్లే అతని రూపం దివ్యతేజం విరజిమ్మే ధర్మదీపంలా కనిపించింది. వారి కోసం ఆయన రెండు నెలల నుండి నడచుకొంటూ, వారి కోసమే వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎంతో కాలంగా అనేక మార్గాల్లో సాధన చేసి, చివరికి తనదైన ధ్యాన మార్గంలో జ్ఞానాన్ని సాధించిన ఆ జ్ఞాన స్వరూపుడు... తాను కనుగొన్న జ్ఞానాన్ని తన పాత మిత్రులైన ఈ ఐదుగురికి చెప్పాలని బుద్ధ గయ నుండి వస్తున్నాడు. ఒకప్పుడు జ్ఞానసాధనలో ఈ ఆరుగురు కలసి గయకు సమీపంలోని నిరంజనా నదీ తీరంలో హఠయోగ సాధన చేశారు. ఆ సాధనలో క్రమేపీ ఆహారం మానిన ఆయన చిక్కిశల్యమైపోయాడు. చివరికి చావుకు దగ్గరయ్యాడు. శరీరాన్ని ఇలా ఎండ కట్టుకోవడం వల్ల రోగం దుఃఖం తప్ప జ్ఞానం రాదని గ్రహించాడు. ఆ కఠోర తపస్సు విరమించాడు. తిరిగి మితంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. దాన్ని చూసిన మిగిలిన ఐదుగురు ‘ఇతను యోగ భ్రష్టుడయ్యాడు’ అని నిర్ణయించుకొని, అతణ్ణి వదిలిపెట్టి, ఇదిగో ఈ కాశీ సమీపంలోని, సారస పక్షుల నివాసమైన సారనాథ్‌లోని ఈ జింకలవనంలో ఉంటున్నారు. తపోసాధన సాగిస్తున్నారు. ఈ ఐదుగురు తనను వదలివచ్చాక ఆయన గయకు చేరాడు. బోధి వృక్షం క్రింద కూర్చొని ‘ధ్యానం’ అనే తన విధానాన్ని కనుగొన్నాడు. చివరికి గత వైశాఖి పౌర్ణమి రోజున దుఃఖ నివారణా మార్గాన్ని కనుగొన్నాడు. జ్ఞానోదయం పొందాడు. అనాత్మ, అనిత్యం అనే తన తత్త్వాల్ని దర్శించాడు. దుఃఖం పోవాలంటే ఆచరించాల్సిన మార్గాన్ని తెలుసుకున్నాడు. జ్ఞానం, శీలం, ధ్యానంతో కూడిన ఎనిమిది అంగాల్ని పాటిస్తే దుఃఖ విముక్తి కలుగుతుందని కనుగొన్నాడు. తాను కనుగొన్న ఆ మార్గాన్ని ప్రబోధించడానికి ఇలా కాలినడకన రెండు నెలలు నడచి నడచి చివరికు వారి దగ్గరకు వచ్చాడు. ఆ వచ్చిన మహాజ్ఞాని ఎవరో కాదు. భగవాన్ బుద్ధుడే! అయితే, తాము వచ్చేశాక సాగిన బుద్ధుని సాధన, పొందిన జ్ఞానోదయం ఇవేవీ ఆ అయిదుగురికి తెలియదు.అందుకే ఇప్పటికీ ‘యోగభ్రష్టుని’గానే భావించారు. అందుకే వారి ముఖాల్లో అయిష్టత పొడచూపింది. ‘గౌరవించకూడడు’ అనుకొన్నారు. కానీ... ఆయన ఒక్కొక్క అడుగు వారికి దగ్గరగా వచ్చే కొద్దీ... ఆయన పరిపూర్ణ జ్ఞాన స్వరూపం సాక్షాత్కారం అయ్యే కొద్దీ... వారి ఆలోచనలు మారిపోయాయి. వారికి తెలియకుండానే లేచి నిలబడ్డారు. వినయంగా నమస్కరించారు. గౌరవంగా ఆహ్వానం పలికారు. సముచితమైన ఆసనం చూపించారు. అయినా పాత మిత్రునిలాగానే భావించి ‘‘ఓ! గౌతమా’’ అని సంబోధించారు. ‘‘మిత్రులారా! దుఃఖ నివారణా మార్గం కనుగొన్నాను. ధ్యాన సాధనతో జ్ఞానోదయం పొందాను. బుద్ధుని పొందాను. సంబుద్ధుణ్ణయ్యాను’’ అని తాను కనుగొన్న విషయాల్ని ప్రబోధించాడు బుద్ధుడు. బుద్ధుడు ప్రపంచ మానవాళి దుఃఖ నివారణ కోసం, సరైన మార్గం కనుగొన్నాడని ముందుగా ఆ ఐదుగురిలో పెద్దవాడైన కౌండిన్యుడు గ్రహించాడు. వెంటనే ఆయన అంజలి ఘటించి ... ‘‘గౌతమా’’ అని ఒక మిత్రుణ్ణి సంబోధించినట్లు సంబోధించకుండా.. ‘‘భగవాన్! నన్ను మీ అనుయాయిగా స్వీకరించండి. మీ మార్గంలో నడవనీయండి’’ అని వినమ్రంగా అడిగాడు. అందుకు బుద్ధుడు అంగీకరించి, మొదటిగా కౌండిన్యుణ్ణి తన అనుయాయిగా స్వీకరించాడు. ఆ తర్వాత వరుసగా బప్ప (కశ్యపుడు), బద్దియుడు (భద్రియుడు), అస్సజి (అశ్వజిత్తు), మహానాములు బుద్ధుని ప్రబోథీల్ని అర్ధం చేకున్నారు. వారంతా ఆయన అనుయాయులుగా మారారు. ‘‘భగవాన్! మహా శాస్తా!’’ అంటూ ప్రణమిల్లారు. (భగవా అంటే భగ్నకరోతి దు:ఖం ఇతి భగవా అని. దీనికి దుఃఖాన్ని భగ్నం చేసేవాడా అని అర్ధం. ‘శాస్తా’ అంటే ‘మహాగురువు’ అని). ఆయన వారికి తాను కనుగొన్న అష్టాంగ మార్గం (ధర్మచక్ర ప్రవర్తన సూత్రం), అనాత్మవాదం (అనాత్మ లక్షణ సూత్రం) ప్రబోధించాడు. ఇదే ... బుద్ధుని తొలి ప్రవచనం. అప్పటి వరకూ ఉన్న సంప్రదాయం ప్రకారం ఋషులు, ప్రబోధకులు అడవుల్లో ఆశ్రమాల్లో జీవిస్తూ, బోధిస్తూ ఉండేవారు. ఈ సంప్రదాయాన్ని బుద్ధుడు మార్చివేశాడు. ‘ప్రజల వద్దకే దార్శికులు. ప్రజల కోసమే వారి ప్రబోధాలు’ అనే నిర్ణయాన్ని తీసుకొన్నాడు. ధర్మాన్ని, దుఃఖ నివారణా మార్గాన్ని ప్రజలందరికీ అందించాలి అని నిర్ణయించుకొని ‘బహుజన హితాయ - బహుజన సుఖాయ’ అనే నినాదం అందుకొన్నాడు. అందుకోసం ‘‘బౌద్ధ సంఘం’’ స్ధాపించాడు. తన ధర్మాన్ని అవలంబించి, ప్రచారం చేస్తూ, కాలినడకన తిరుగుతూ, భిక్ష మీద జీవించే వారితో ఆ సంఘం ఉంటుంది. వారే భిక్షువులు. వారే ధర్మాన్ని నిరంతరం కదిలే చక్రంలా అన్ని దిశలకూ నడిపిస్తారు. ధర్మచక్ర ప్రవర్తనం చేస్తారు. అలా ఆ మొదటి ఐదుగురితో బౌద్ధ సంఘం సారనాథ్‌లో ఏర్పడింది. ధర్మచక్రం నడక ప్రారంభించింది. బౌద్ధంలో ఆషాఢ పున్నమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ధర్మ ప్రచారానికి తొలి అడుగు ఈ రోజు. ఇది బౌద్ధ సంఘం పుట్టిన రోజు. ధర్మం అడవుల్ని వదిలి ప్రజల్లోకి నడక సారించిన రోజు. అందుకే ... అశోకుడు మహాశాస్త (మహా గురువు) అయిన బుద్ధునికీ, అతని ధర్మానికీ గుర్తుగా సారనాథ్‌లో ధర్మచక్ర మహాస్తూపాన్ని నిర్మించాడు. వేల సంవత్సరాలుగా బౌద్ధులు దీన్ని ఈ ఆషాఢ పున్నమిని ‘‘ధర్మ చక్ర ప్రవర్తన దినంగా’, ‘గురు పున్నమిగా’ జరుపుకొంటున్నారు. మన జాతీయ చిహ్నంలోని అశోక ధర్మ చక్రం సారనాథ్‌లోని ఈ ధర్మచక్రమే. ఈ ఆషాఢ పున్నమి అవనిపై ధమ్మ పరీమళాలు విరజిమ్మిన పున్నమే! - బొర్రా గోవర్ధన్ (రేపు గురుపూర్ణిమ)