చంద్రబాబు దళిత ద్రోహి
దళితవాడలపై విద్యుత్ చార్జీల భారం మోపొద్దు
ధర్నాలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇంత వరకు దళితవాడల్లో విద్యుత్ చార్జీలు లేవని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుణ్యమా అని తినడానికి తిండి లేని దళితులు విద్యుత్ చార్జీలు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.
దళితవాడలపై విద్యుత్ చార్జీల భారం మోపొద్దంటూ స్థానిక డీఈ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం నియోజకవర్గంలోని దళితవాడల ప్రజలతో కలిసి ఆయన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని విమర్శించారు. ప్రభుత్వం దళితవాడల్లో మీటర్లు బిగించుకోవాలని ఒత్తిడి చేస్తోందన్నారు. ఒక్క మారు మీటరు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్‌గా ప్రతి నెల వారు బిల్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం దళితవాడలపై సీలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, అమృతేశ్వర ఆలయ కమిటీ కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్లు జయశంకర్, రాందాసు, రాజుపాళెం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు విజయభాస్కర్, తదితరులు ప్రసగించారు. అనంతరం డీఈ విజయన్‌కు వినతి పత్రం సమర్పించారు.