బస్టాండ్ కాంక్రీట్ షెల్టర్ కూలి 5గురు దుర్మరణం
చెన్నై : తమిళనాడులో గురువారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని సోమనూరు బస్టాండ్ కాంక్రీట్ షెల్టర్ కుప్పకూలడంతో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా సోమనూరు బస్టాండ్ కాంక్రీట్ షెల్టర్‌ను ఏడాదిన్నర క్రితం నిర్మించారు. పనుల్లో నాణ్యత కొరవడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు షెల్టర్ బాగా నానింది. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హఠాత్తుగా ఆ కాంక్రీట్ షెల్టర్ కుప్పకూలింది.
బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికుల మీద కాంక్రీట్ పడడంతో ఆ పరిసరాల్లో కలకలం బయలుదేరింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి, తీవ్రంగా శ్రమించాయి. గాయపడ్డ వారిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, వారిని ఈశ్వరి, ధారణి, తులసిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ శివకుమార్‌తోపాటు మరో వ్యక్తి కూడా ఈ దుర్ఘటనలో మరణించాడు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పళని స్వామి సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలకు తలా రూ.నాలుగు లక్షలు సాయం ప్రకటించారు.