పోలీసులు, ఆర్మీ అధికారుల తీరుతో అభ్యర్థుల అవస్థలు
ఆరో రోజు 805 మంది అభ్యర్థుల ఎంపిక
అర్హత ఉన్నా అడ్డుకుంటున్న వైనం
పీఎన్కాలనీ : పోలీసులు, సైనిక అధికారుల తీరుతో ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీలో పాల్గొంటున్న అభ్యర్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అర్హత ఉన్నా అడ్డుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిరామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాలలో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, యానాం ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్స్ విభాగంలో ఎంపికలు నిర్వహించారు. వీరికి పరుగు పందెం నిర్వహించగా 805 మంది అర్హత సాధించారు. అనంతరం విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల అభ్యర్థులకు 3,500 టోకెన్లు అందజేశారు.
వీరిలో 1100 మందికి మాత్రమే గురువారం పరుగుపందెం నిర్వహించనున్నట్టు రిక్రూట్మెంట్ డెరైక్టర్ కల్నల్ ఏకే సింగ్ తెలిపారు. కాగా ఎంపికల్లో భాగంగా పరుగుపందెంలో పాల్గొంటున్న అభ్యర్థులను సమయం పూర్తికాకముందే ఆర్మీ అధికారులు, పోలీసులు పక్కకు నెట్టేయడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎంపికల్లో భాగంగా నాలుగు రౌండ్లు పూర్తి చేయాల్సి ఉండగా రెండు రౌండ్లలోనే వెనుకబడిన వారిని పక్కకు నెట్టేస్తున్న వైనం బుధవారం కనిపించింది.