సంతకం చేస్తేనే ప్రపంచకప్ కు....
కవిండీస్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక
చెల్లింపులపై ముదిరిన సంక్షోభం
కింగ్స్టన్: దాదాపు ఏడాదిన్నర క్రితం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెల్లింపుల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా ఆరలేదు. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌కు ముందు కూడా మళ్లీ అదే కారణంతో ఇరు వర్గాల మధ్య సమస్య తీవ్రమైంది. ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది ఆటగాళ్లు కూడా బోర్డు ప్రతిపాదించిన అన్ని నిబంధనలను అంగీకరిస్తూ కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని సీఈఓ మైకేల్ ముర్హెడ్ ఆటగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు. అందుకు ఆదివారం తుది గడువుగా నిర్దేశించారు. అయితే బోర్డు చెబుతున్న మొత్తం చాలా తక్కువని, ఇది దుర్మార్గమంటూ జట్టు కెప్టెన్ స్యామీ తమ అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాయడంతో పరిస్థితి ముదిరింది. తమ వేతనాలను 80 శాతం తగ్గించారని... డబ్బులు పెంచకపోతే కుదరదని స్యామీ అంటున్నాడు. ప్రస్తుత నిబంధనల్లో ఒక్క మార్పూ చేయమని, అవసరమైతే ఈ ఆటగాళ్లను తప్పించి ద్వితీయ శ్రేణి జట్టును పంపించడానికైనా తాము సిద్ధమని ముర్హెడ్ గట్టిగా చెప్పడంతో వరల్డ్‌కప్‌కు గేల్, బ్రేవోలాంటి స్టార్లు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.