కెప్టెన్ హీరో కాదు.. జీరోనే!
అంతన్నాడు ఇంతన్నాడే.. గంగరాజు నట్టేట్లో ముంచేశాడే అన్నట్లుగా తయారైంది కెప్టెన్ విజయకాంత్ పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ముఖ్యమంత్రి కుర్చీ సొంతం చేసుకుంటానని చెప్పిన కెప్టెన్.. అసలు ఖాతాయే తెరవలేదు. స్వయంగా విజయకాంత్ కూడా తాను పోటీ చేసిన స్థానంలో వెనుకంజలోనే ఉన్నారు. డీఎండీకే అధినేతగా పరుష వ్యాఖ్యలు చేసి, మీడియాపై కూడా మండిపడిన విజయకాంత్, చివరకు సొంత పార్టీ నేతలపై కూడా అనుచితంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జాతీయ మీడియాలో ప్రసారమైన ఇంటర్వ్యూలో అయితే.. తాను హీరోనని, కరుణానిధి విలన్ అని, జయలలిత లేడీ విలన్ అని కూడా వ్యాఖ్యానించారు. కానీ చివరకు తాను పోటీ చేసిన ఉళుందుర్ పెట్టాయ్ నియోజకవర్గంలో మూడోస్థానంలో నిలిచారు. అక్కడ ఆధిక్యంలో అన్నాడీఎంకే ఉండగా, రెండో స్థానంలో డీఎంకే ఉంది.
ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య కూటమిని కూడా ఏర్పాటుచేశారు. రజనీకాంత్‌లా పిరికివాడిని కానని ఒక సమయంలో వ్యాఖ్యానించడంతో రజనీ అభిమానులు కెప్టెన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. తన పార్టీ అభ్యర్థులలో ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన విజయకాంత్.. చివరకు తాను కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో కెప్టెన్ తాను మునగడంతో పాటు ఓడను కూడా ముంచేశాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.