Cashless policy
-
పేరుకే క్యాష్‌లెస్..!
పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశం మొత్తం క్యాష్‌లెస్ జపం పఠిస్తోంది! నగదు రహిత లావాదేవీల దిశగా అడుగులు వేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా ఆన్లైన్ లావాదేవీల ప్రోత్సాహకానికి కేంద్రం పలు రాయితీలనూ ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోటాపోటీగా పలు గ్రామాలను నగదు రహిత లావాదేవీ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఆన్లైన్ లావాదేవీలే జరుగుతాయని తెలిపాయి. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని, నగదు రహితానికి ఈ గ్రామాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయని తాజా పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ బద్జిరీ (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న బద్జిరీ గ్రామాన్ని రాష్ట్రంలోనే తొలి నగదు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ మాల్యా గత వారం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని సగానికి పైగా దుకాణాల్లో పీఓఎస్ మెషీన్లు లేవు. గ్రామంలోని చాలా మంది వీటిని ఉపయోగించేందుకు ఇష్టపడట్లేదని, ఆన్లైన్ లావాదేవీలపై వారు నమ్మకం ఉంచట్లేదని మెషీన్లు ఉన్న పలువురు దుకాణదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ‘రాష్ట్రంలోనే తొలి నగదు రహిత గ్రామమని అధికారులు ప్రకటించారు కానీ... వాస్తవంగా మేమింకా క్యాష్‌లెస్ వైపు అడుగులు వేస్తున్నాం’ అని ఆ గ్రామ సర్పంచ్ శ్యామ్ శర్మ తెలిపారు. మరోవైపు నోట్ల రద్దుతో దాదాపు సగం ఆదాయం పడిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ‘ఇప్పటికే మా బిజినెస్ పడిపోయింది. కస్టమర్లను మేం పోగొట్టుకోలేము’ అని జనరల్ స్టోర్ యజమాని వినోద్ వర్మ పేర్కొన్నారు. – నాలుగు షాపుల్లో పరిశీలించగా.. రెండింటిలో మాత్రమే స్వైపింగ్ మెషీన్లు ఉన్నాయి. లనురా (జమ్మూ కశ్మీర్) శ్రీనగర్‌కు 25 కి.మీ దూరంలోని లనురా గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గత వారం ఘనంగా ప్రకటించింది. ఆన్లైన్ లావాదేవీలపై కుటుంబంలో కనీసం ఒక్కరికి శిక్షణ ఇచ్చినట్లు గొప్పగా చెప్పింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటివరకు స్థానికులెవ్వరూ ఆన్లైన్ పేమెంట్స్ చేయడం లేదు. షబిర్ అహ్మద్ లోన్ తమ దుకాణంలో తొలి ఆన్లైన్ లావాదేవీ కోసం వారం రోజులు ఆగాల్సి వచ్చింది. అది కూడా గ్రామంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన విలేకరి పేటీఎం ద్వారా చెల్లించినదే. తమ వద్ద స్మార్ట్ఫోన్లు లేవని, మొబైల్ నంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించలేదని చాలా మంది గ్రామస్తులు పేర్కొంటున్నారు. – గ్రోసరీ, టైలర్ షాప్, గ్యాస్ సిలిండర్డీలర్, ఫార్మా షాపుల్లో పరిశీలించగా అన్నింటిలోనూ నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. ఝతిపూర్ (హరియాణా) ఝతిపూర్ నగదు రహిత గ్రామం అని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆ గ్రామంలోని జగదీశ్ సింగ్ అనే రైతు వద్ద ప్రస్తావించగా... ‘అవునా.. అంటే ఏమిటి?’ అని ఆ రైతు గాబరాగా ఎదురు ప్రశ్నించడం గమనార్హం. పానిపట్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ ఖరే మాత్రం వారం రోజుల క్రితం ఝతిపూర్ నగదు రహిత గ్రామమని ప్రకటించారు. ఈ వ్యాలెట్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామం సిద్ధమని, రానున్న రోజుల్లో షాపులకు స్వైపింగ్ మెషీన్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఓ మందుల దుకాణంలో ‘నగదు మాత్రమే’ తీసుకుంటాం అని గోడపై రాసి ఉండడం గమనార్హం. చాలా మంది దుకాణాదారులు పేటీఎం ఖాతాలు తెరిచినప్పటికీ, నగదు తీసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారని సర్పంచ్ అశోక్ కుమార్ తెలిపారు. గ్రామంలో నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు రణ్‌బీర్ సింగ్ అనే దుకాణదారుడు తెలిపారు. – నాలుగు దుకాణాలు పరిశీలించగా, వేటిల్లోనూ ఆన్లైన్ లావాదేవీ సదుపాయాలు లేవు. జరియా (ఛత్తీస్‌గఢ్) రాష్ట్రంలోని జరియా (ఒడిశా సరిహద్దు గ్రామం), పల్నార్ (దంతేవాడ జిల్లా) గిరిజన గ్రామాలు నగదు రహితమంటూ వారం రోజుల క్రితం అటు స్థానిక మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ విశేష ప్రచా రం జరిగింది. జరియాలో 7 షాపులు ఉన్నాయి. వీటిల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సవాల్‌గానే మారింది. ప్రతి కుటుంబానికి ఏటీఎం కార్డులు ఉన్నాయని స్థానిక సర్పంచ్ సంజయ్ కిశోర్ లక్డా తెలిపారు. దుకాణదారులు కూడా వారి ఫోన్లలో ఈ వ్యాలెట్ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకున్నారని చెప్పారు. అయితే చాలా తక్కువ ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. వారం రోజులుగా ఈ వ్యాలెట్ ద్వారా కేవలం 23 లావాదేవీలు మాత్రమే జరిగాయని అమిత్సాగర్ అనే దుకాణదారుడు పేర్కొన్నారు. త్వరలోనే అన్ని దుకాణాలకు స్వైపింగ్ మెషీన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. – టీస్టాల్, కూరగాయల షాపు, రేషన్ షాపు, ఎరువుల దుకాణంలో పరిశీలించగా, కేవలం టీస్టాల్లో మాత్రమే ఈవ్యాలెట్ వినియోగిస్తున్నారు. ఆధారం: హిందుస్థాన్ టైమ్స్ -
త్వరలోనే నగదు రహిత తెలంగాణ
-
త్వరలోనే నగదు రహిత తెలంగాణ
► బ్యాంకు అధికారులతో భేటీలో సీఎం కేసీఆర్ ►కొద్ది రోజులుగా డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ ►నగదు రహిత విధానంపై ఆలోచన మారాలి.. ప్రజల్లో మార్పు రావాలి ►రాష్ట్రానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ►అందించేందుకు ముందుకొచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత విధానంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లిం పులను అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ ముందుకు వచ్చింది. మంగళవారం ఆ బ్యాంకు అధికా రులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి డిజిటల్ విధానాన్ని అలవరుచుకుంటుందని, నగదు రహిత లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా ప్రతిరోజు అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరుపు తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ప్రజలకు సాంకేతికత ఉపయోగించుకోవడం తెలియదని కాదని... నగదు వాడకంలో ఉండటంతో డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రాలు అలవాటు కాలేదని చెప్పారు. అందుకే ప్రజల ఆలోచనా విధా నాన్ని మార్చే దిశగా అవగాహన కల్పించా లని, అందుకు బ్యాంకులు తగిన సహకారం అందించాలని సీఎం కోరారు. తొలి దశలో ప్రభుత్వ చెల్లింపులు... అరుుతే హడావుడి, ఆగమాగం చేయవద్దని... మొదటి దశలో ప్రభుత్వంతో సంబంధమున్న ఆర్థిక లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ పేర్కొ న్నారు. రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాలు, కాం ట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగుల జీతాలు వంటివన్నీ డిజిటల్ రూపంలో జరగాలని చెప్పారు. రైతులకు ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాలను మళ్లించాలని, వారు డ్రా చేసుకునే క్రమంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల పద్ధతి క్రమంగా అలవాటవుతుం దని పేర్కొన్నారు. అయితే ప్రజలకు నగదు లావాదేవీల అవసరం కొంతమేరకు ఎల్లప్పు డూ ఉంటుందని చెప్పారు. రాబోయే కాలంలో అన్ని రకాల పన్నులు రద్దయి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మాత్రమే విధించే అవకాశాలున్నాయని.. భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా ప్రజల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంకు మేనే జర్లు, అధికారులు ప్రజలకు సహకరిం చాలని సూచించారు. బ్యాంకు అధికారులతో సమా వేశమై చర్చలు జరపాలని మంత్రి కె.తారక రామారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతా దికారులు సిద్ధార్థ మిశ్రా, వినీత్ మల్హోత్రా, అవిజిత్ షా, జితా మిత్రా, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. 14న టీఎస్ వాలెట్ ఆవిష్కరణ ఈనెల 14న జరిగే కలెక్టర్ల సదస్సులో టీఎస్ వాలెట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించ నున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిం చిన ఈ మొబైల్ యాప్‌ను కలెక్టర్ల సదస్సులో విడుదల చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రచారమే కీలకం నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మీడియా ద్వారా ప్రసారం చేయాలని మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగదు నోట్లుంటే దొంగలెత్తుకుపోయే ప్రమాదముందని.. డిజిటల్ పద్ధతిలో పూర్తి భద్రత ఉంటుందనే కోణంలో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకుల వారీగా ఎన్ని కార్డులున్నాయి, ప్రజల అవసరాలు తీరుస్తున్నాయా.. లేదా, వాడుకలో ఉన్నవెన్ని, కొత్తగా అవసరమైనవెన్ని.. వంటి అంశాలపై బ్యాంకుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సీఎంవో అధికారులకు సూచించారు. మొబైల్ అప్లికేషన్ల ద్వారా బ్యాంకు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేలా గ్రామీణ యువతకు శిక్షణనివ్వాల్సిన అవస రముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి ద్వారా గ్రామాల్లో రైతులు, కూలీలు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు.