పేరుకే క్యాష్‌లెస్‌..! | Cashless policy not implementing in india | Sakshi
Sakshi News home page

పేరుకే క్యాష్‌లెస్‌..!

Published Mon, Dec 26 2016 1:50 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

పేరుకే క్యాష్‌లెస్‌..! - Sakshi

పేరుకే క్యాష్‌లెస్‌..!

పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశం మొత్తం క్యాష్‌లెస్‌ జపం పఠిస్తోంది! నగదు రహిత లావాదేవీల దిశగా అడుగులు వేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా ఆన్‌లైన్‌ లావాదేవీల ప్రోత్సాహకానికి కేంద్రం పలు రాయితీలనూ ప్రకటించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోటాపోటీగా పలు గ్రామాలను నగదు రహిత లావాదేవీ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ లావాదేవీలే జరుగుతాయని తెలిపాయి. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని,  నగదు రహితానికి ఈ గ్రామాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయని తాజా పరిశీలనలో వెల్లడైంది.     – సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

బద్జిరీ (మధ్యప్రదేశ్‌)
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న బద్జిరీ గ్రామాన్ని రాష్ట్రంలోనే తొలి నగదు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్‌ మాల్యా గత వారం ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు గ్రామంలోని సగానికి పైగా దుకాణాల్లో పీఓఎస్‌ మెషీన్లు లేవు. గ్రామంలోని చాలా మంది వీటిని ఉపయోగించేందుకు ఇష్టపడట్లేదని, ఆన్‌లైన్‌ లావాదేవీలపై వారు నమ్మకం ఉంచట్లేదని మెషీన్లు ఉన్న పలువురు దుకాణదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ‘రాష్ట్రంలోనే తొలి నగదు రహిత గ్రామమని అధికారులు ప్రకటించారు కానీ... వాస్తవంగా మేమింకా క్యాష్‌లెస్‌ వైపు అడుగులు వేస్తున్నాం’ అని ఆ గ్రామ సర్పంచ్‌ శ్యామ్‌ శర్మ తెలిపారు. మరోవైపు నోట్ల రద్దుతో దాదాపు సగం ఆదాయం పడిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. ‘ఇప్పటికే మా బిజినెస్‌ పడిపోయింది. కస్టమర్లను మేం పోగొట్టుకోలేము’ అని జనరల్‌ స్టోర్‌ యజమాని వినోద్‌ వర్మ పేర్కొన్నారు.  
– నాలుగు షాపుల్లో పరిశీలించగా.. రెండింటిలో మాత్రమే స్వైపింగ్‌ మెషీన్లు ఉన్నాయి.

లనురా (జమ్మూ కశ్మీర్‌)
శ్రీనగర్‌కు 25 కి.మీ దూరంలోని లనురా గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గత వారం ఘనంగా ప్రకటించింది. ఆన్‌లైన్‌ లావాదేవీలపై కుటుంబంలో కనీసం ఒక్కరికి శిక్షణ ఇచ్చినట్లు గొప్పగా చెప్పింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటివరకు స్థానికులెవ్వరూ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేయడం లేదు. షబిర్‌ అహ్మద్‌ లోన్‌ తమ దుకాణంలో తొలి ఆన్‌లైన్‌ లావాదేవీ కోసం వారం రోజులు ఆగాల్సి వచ్చింది. అది కూడా గ్రామంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన విలేకరి పేటీఎం ద్వారా చెల్లించినదే. తమ వద్ద స్మార్ట్‌ఫోన్లు లేవని, మొబైల్‌ నంబర్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానించలేదని చాలా మంది గ్రామస్తులు పేర్కొంటున్నారు.
– గ్రోసరీ, టైలర్‌ షాప్, గ్యాస్‌ సిలిండర్‌డీలర్, ఫార్మా షాపుల్లో పరిశీలించగా అన్నింటిలోనూ నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు.

ఝతిపూర్‌ (హరియాణా)
ఝతిపూర్‌ నగదు రహిత గ్రామం అని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆ గ్రామంలోని జగదీశ్‌ సింగ్‌ అనే రైతు వద్ద ప్రస్తావించగా... ‘అవునా.. అంటే ఏమిటి?’ అని ఆ రైతు గాబరాగా ఎదురు ప్రశ్నించడం గమనార్హం. పానిపట్‌ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఖరే మాత్రం వారం రోజుల క్రితం ఝతిపూర్‌ నగదు రహిత గ్రామమని ప్రకటించారు. ఈ వ్యాలెట్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామం సిద్ధమని, రానున్న రోజుల్లో షాపులకు స్వైపింగ్‌ మెషీన్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ ఓ మందుల దుకాణంలో ‘నగదు మాత్రమే’ తీసుకుంటాం అని గోడపై రాసి ఉండడం గమనార్హం. చాలా మంది దుకాణాదారులు పేటీఎం ఖాతాలు తెరిచినప్పటికీ, నగదు తీసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారని సర్పంచ్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. గ్రామంలో నగదుతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు రణ్‌బీర్‌ సింగ్‌ అనే దుకాణదారుడు తెలిపారు.
– నాలుగు దుకాణాలు పరిశీలించగా, వేటిల్లోనూ ఆన్‌లైన్‌ లావాదేవీ సదుపాయాలు లేవు.

జరియా (ఛత్తీస్‌గఢ్‌)
రాష్ట్రంలోని జరియా (ఒడిశా సరిహద్దు గ్రామం), పల్నార్‌ (దంతేవాడ జిల్లా) గిరిజన గ్రామాలు నగదు రహితమంటూ వారం రోజుల క్రితం అటు స్థానిక మీడియాలోనూ, ఇటు సోషల్‌ మీడియాలోనూ విశేష ప్రచా రం జరిగింది. జరియాలో 7 షాపులు ఉన్నాయి. వీటిల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సవాల్‌గానే మారింది. ప్రతి కుటుంబానికి ఏటీఎం కార్డులు ఉన్నాయని స్థానిక సర్పంచ్‌ సంజయ్‌ కిశోర్‌ లక్డా తెలిపారు. దుకాణదారులు కూడా వారి ఫోన్లలో ఈ వ్యాలెట్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని చెప్పారు. అయితే చాలా తక్కువ ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు. వారం రోజులుగా ఈ వ్యాలెట్‌ ద్వారా కేవలం 23 లావాదేవీలు మాత్రమే జరిగాయని అమిత్‌సాగర్‌ అనే దుకాణదారుడు పేర్కొన్నారు. త్వరలోనే అన్ని దుకాణాలకు స్వైపింగ్‌ మెషీన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.     – టీస్టాల్, కూరగాయల షాపు, రేషన్‌ షాపు, ఎరువుల దుకాణంలో పరిశీలించగా, కేవలం టీస్టాల్‌లో మాత్రమే ఈవ్యాలెట్‌ వినియోగిస్తున్నారు.
ఆధారం: హిందుస్థాన్‌ టైమ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement