ఏడు రంగుల వేడుకలో ఎన్ని కోణాలో..!
కుల మత బేధాలు లేకుండా సోదర భావంతో ప్రజలంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పర్వదినం హోలీ. ఈ పండుగనాడు ఎద ఎదలో హోలీ కేరింతలు అంబరాన్ని అంటుతుంటే ఏడురంగులను ఎదపై చల్లుకొని తడిసి ముద్దయి పుడమితల్లి పులకించిపోతుంది. ఫాల్గుణ శుక్ల పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు. ఇంచుమించు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు. గతంలో ఈ పండుగకు ఉత్తరభారతదేశంలో ఉన్నంత ప్రాముఖ్యత దక్షిణభారతదేశంలో లేదు. అయితే, మారుతున్న జీవనవిధానం, ప్రాంతాల మధ్య పరస్పర అవగాహన తదితర కారణాల వల్ల హోలీ పండుగను నేడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో కూడా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు.
- డి. కృష్ణ కార్తీక
ఈ పండుగను కామదేవోత్సవమని, హోలికోత్సవమని, డోలికోత్సవమని, వసంతోత్సవమని మనదేశంలో నాలుగువిధాలుగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను వసంతోత్సవం పేరుతో విదేశాలైన అమెరికా, జర్మనీ, పర్షియా ఈజిప్టు, గ్రీసు మొదలైన దేశాల్లో కూడా జరుపుకుంటారు.
ఈ కాలం నాటిది కాదీ పండుగ: హోలీ పండుగ కృతయుగంలోనే పుట్టింది. పూర్వం రఘునాథుడనే రాజు జనరంజకంగా ప్రజలను పాలించేవాడు. కొంతకాలానికి అతని రాజ్యంలోని పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని, దాని బారి నుంచి తమను రక్షించవలసిందిగా ప్రజలు రాజుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు సభలో ఉన్న నారద మహాముని ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజిస్తే పసిపిల్లలకు ఏ బాధలూ ఉండవని చెప్పాడు. దాంతో రాజు పై విధంగా పూజలు జరపమని ఆజ్ఞాపించడంతో ఆనాటి నుంచి ఈ ఉత్సవం జరుపుకుంటున్నారని ప్రతీతి. ఆ కాలంలో ఈ పండుగ రోజు రాత్రి సమయంలో పసిపిల్లలను ఇంట్లో దాచి ఉంచేవారని తెలుస్తుంది.
హోలిక గురించి మరో కథ కూడా ఉంది. హోలిక హిరణ్యకశిపుని సోదరి. అగ్ని ఆమెను దహించదని వరం. ఆ వరాన్ని ఉపయోగించి, ప్రహ్లాదుని సంహరించ దలచాడు హిరణ్యకశిపుడు. అన్నగారి ఆజ్ఞమేరకు హోలిక ఆ పసివాణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశించింది. అయితే ఆ మంటల్లో హోలికయే అగ్నికి ఆహుతి కాగా, ప్రహ్లాదుదు మాత్రం చిరునవ్వుతో వెలుపలికి వచ్చాడు. అప్పుడు ప్రజలందరూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగు నీళ్లు జల్లుకున్నారని కథనం.
కామదేవోత్సవం: దక్షయజ్ఞం సమయంలో అవమానానికి గురైన సతీదేవి ప్రాణత్యాగం చేయడంతో శివుడు విరాగియై హిమవత్ పర్వతాన తపస్సు చేయసాగాడు. లోక కల్యాణం కోసం పార్వతియై పుట్టిన సతీదేవిపై శంకరునికి ప్రేమ కలిగించేందుకు ఇంద్రాది దేవతలు ఆలోచించి మన్మథుని పిలిచి విషయం వివరించారు. వెంటనే మన్మధుడు తన భార్య రతీదేవి, మిత్రుడు వసంతునితో కలిసి హిమవత్పర్వతాన్ని చేరాడు. పార్వతీదేవి ఈశ్వరునికి సపర్యలు చేస్తున్న సమయంలో శివునిపై మన్మథుడు తన పుష్పబాణాలు ఉపయోగించి ఆయన మనస్సును వికలం చేశాడు. దాంతో శివుడు కోపించి, మూడోకన్ను తెరిచి అతన్ని మసి చేశాడు. ఈ విధంగా మన్మథుణ్ణి శివుడు దహించి వేయడాన్ని ‘కాముని దహనం’ గా కాముని పున్నంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణమి రోజు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు.
డోలికోత్సవం: వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. కొన్నిప్రాంతాల్లో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొంటారు. దీనినే ‘దులండి’ అని కూడా అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజున పొరుగిళ్లలో దూరి పాలు, పెరుగు, వంటపదార్థాలను దొంగిలించే ఆచారాన్ని పాటిస్తారు. రాత్రి పూట కాముని విగ్రహాన్ని కట్టెల ద్వారా కాల్చివేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను ‘కాముని పున్నమని’ ‘కామ దహనమని’ వ్యవహరిస్తారు.
వసంతకాలానికి మన్మథుని విజృంభణ సమయమని పేరు. మన్మథ తాపానికి గురికాకుండా ఉండేందుకు హోలీకి ముందు గ్రామాల్లో ప్రజలు ఇల్లిల్లు తిరిగి పాటలు పాడుకుంటూ ధాన్యాన్ని సేకరించి ఆనందోత్సాహాల మధ్య కామదహనం జరుపుకుంటారు. యువతీ యువకులు వసంతోత్సవం జరుపుకుంటారు. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా కామదహనాన్ని, వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తారు.