లాభసాటిగా ఆముదం పంట
తైవాన్ కంపెనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రయోగం
ఆ దేశ ప్రతినిధులతో వ్యవసాయ మంత్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆముదం పండించే రైతులకు అధిక ఆదాయం సమకూర్చే విధానాలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ‘లెన్నిన్’ కంపెనీకి చెందిన పదిమంది ప్రతినిధుల బృందం ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తైవాన్ కంపెనీ ప్రతినిధులకు, వ్యవసాయ మంత్రికి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఆముదం పండించే రైతులకు అధిక ఆదాయం సమకూర్చే విధంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఈ పంటను పండించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రెండు వారాల్లో ప్రతిపాదనలను ఇస్తామని తైవాన్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉన్నట్లయితే ఆ కంపెనీకి కొంత భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాలుగా ప్రయోజనాలుంటే కంపెనీ ఫ్యాక్టరీని, పరిశోధనా సంస్థను రాష్ట్రంలో నెలకొల్పుతారు.
ప్రపంచంలో ఆముదానికి డిమాండ్
కాస్మొటిక్స్, లూబ్రికెంట్లు, సబ్బులు, పెయింట్స్, పెస్టిసైడ్స్ తదితర వాటిలో ఆముదంను ఉపయోగిస్తారు. అంతేకాదు భూసారాన్ని పెంచడంలో ఆముదం పిండి ఉపయోగపడుతుంది. అలాగే ఆముదం ఆకుతో వచ్చే పట్టుతో గుడ్లు తయారవుతాయి. వాటితో పట్టు కూడా వస్తుంది. ఈ రకంగా ఆముదానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఉత్పత్తి తక్కువ.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తైవాన్ కంపెనీ దక్షిణాఫ్రికాలో వేలాది ఎకరాల్లో ఆముదం పంటను సాగు చేస్తోంది.