ఇక ఆన్లైన్లో ఫిర్యాదులు
మున్సిపాలిటీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఇక రోజుల తరబడి తిరగాల్సిన పనిలేదు. సమస్యను, సమస్య తీవ్రతను వివరిస్తూ ఒక ఫొటో జోడించి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే చాలు.. పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే.... ఈ దిశగా రాష్ట్ర పురపాలక శాఖ కొత్త మార్గాన్ని పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు సీడీఎంఏ వెబ్సైట్లో సిటిజన్ గ్రీవెన్స్ మోనటరింగ్ సిస్టమ్ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినట్టు అదికారులు తెలిపారు.
చిలకలూరిపేట
రాష్ట్రంలోని 111 మున్సిపాలిటీల్లో ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార పద్ధతి అందుబాటు లోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆయా మున్సిపాలిటీలకు యూజర్ ఐడీలు ఏర్పాటు చేసి పాస్వర్డులు సంబంధిత కమిషనర్లకు తెలియజేశారు.
శివారు కాలనీలకు మంచినీరు అందవు. ఉన్న నీరు లీకుల ద్వారా పట్టణాల్లో నడిబొడ్డున వృథా అవుతుంటాయి. నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోరు. ఎవరైనా సమస్యను మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించరు.
మున్సిపాలిటీల పరిధిలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త నిల్వ ఉంటుంది. అంటు వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు అందోళన పడినా ఫలితం ఉండదు.
కాలువల్లో మురుగుపారదు. మురుగునీరు యథేచ్ఛగా రోడ్లపై, పరిసర ఇళ్లల్లోకి ప్రవహిస్తుంటుంది.
రోడ్లు గోతులు పడి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ఈ వ్యవస్థను రూపొందించారు.
ముందుగా పారిశుధ్యం, పైపులైన్లీకులు, మురుగునీటి పారు దల, రోడ్లకు సంబంధించిన సమస్యలను ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ఫిర్యాదు చేయటం ఇలా....
తొలుత సీడీఎంఏ.ఏపీ.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్లోకి ప్రవేశించిన అనంతరం ఎడమ భాగాన్న నూతనంగా ఏర్పాటు చేసిన సిటిజన్ గ్రీవెన్స్ మోనటరింగ్ సిస్టమ్ పై క్లిక్ చేయాలి. దీంతో నూతన విండో ఓపెన్అవుతుంది. సిటిజన్ గ్రీవెన్స్ మోనటరింగ్ స్టిస్టమ్‌లో చెత్తబుట్ట, కాలువల్లో మురుగు, పైపులైన్ లీకేజి, రోడ్డుపై గుంత ఫొటో కనిపిస్తూ ఉంటాయి.
ఫిర్యాదు చేసే అంశంపై ఏ పరిధిలోకి వస్తుందో దానిపై క్లిక్ చేయాలి. ఉదాహరణకు పైపులైన్ లీక్‌పై ఫిర్యాదు చేయదలిస్తే వెబ్సైట్లో సూచించిన విధంగా పైపులైన్ లీకేజి బొమ్మపై క్లిక్చేయాలి. ఇలా చేయగానే ఫిర్యాదు నమోదు చేయటానికి ఆరు అంశాలతో కూడిన దరఖాస్తు ప్రత్యక్షమవుతుంది.
ముందుగా ఫిర్యాదుదారుడు ఏ మున్సిపాలిటి కి చెందిన వారో తెలపాలి. యూఎల్బీ నేమ్ అన్న సూచిక ఎదురుగా క్లిక్‌చేస్తే అనేక మున్సిపాలిటిలు ప్రత్యక్షమవుతాయి. సమస్య ఏ మున్సిపాలిటీదో ఆ మున్సిపాలిటి పేరు పేర్కొనాలి. అనంతరం ఫిర్యాదుదారుని పేరు, సెల్‌నంబర్,ఈ-మెయిల్ఐడీ(ఉంటే), సమస్య ఏ ప్రాంతానికి చెందిందో తెలపాలి. తరువాత సమస్య తీవ్రత తెలియజేసే ఫొటో జత చేయా లి. వీటిని పూర్తి చేసిన తరువాత సబ్మిట్ అన్న చోట క్లిక్ చేస్తే సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు నంబర్ వస్తుంది. ఇక్కడితో ఫిర్యాదుదారుని పనిపూర్తి అవుతుంది.
ఇక అధికారుల వంతు....
ఫిర్యాదుదారుని ఫిర్యాదు సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్ సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఫొటో ఆప్‌లోడ్ చేసుకొని సంబంధిత అధికారులకు సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తారు. ఒక వేళ సమస్య పరిష్కరించకపోతే ఎందుకు కాలేదో అన్న అంశాన్ని వివరించాల్సి ఉంది.
సమస్యపై ఫిర్యాదుదారునికి సమాచారం ....
సమస్య పరిష్కరించి ఫొటో జత చేయగానే ఫిర్యాదు దారుని సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్, మెయిల్‌కు సమాచారం వస్తుంది. సమస్య పరిష్కారం అయిన తీరును సెర్చ్ గ్రీవెన్స్ స్టేటస్‌పై క్లిక్ చేసి తెలుసు కోవచ్చు.