చెడుగుడు విజేత చినగంజాం
ముగిసిన రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
పెడన రూరల్ : క్రీడలతో యువతలో మనోవికాసం పెంపొందుతుందని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని లంకలకలవగుంట గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సర్వయువజన అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ప్రకాశం జిల్లా చినగంజం నరేష్, లంకలకలవగుంట పల్లాలమ్మ ఏర్పులు-1 జట్ల మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చినగంజం నరేష్ జట్టు టోర్నమెంట్ విజేతగా నిలిచింది.
పల్లాలమ్మ ఏర్పులు-1 జట్టు ద్వితీయ బహుమతి గెలుచుకుంది. లంకలకలవగుంట పల్లాలమ్మ ఏర్పులు-2, కైకలూరు మండలం నుచ్చుమిల్లి జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఎమ్మెల్యే కాగిత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పల రాంప్రసాద్ సోదరులు ఉప్పాల నెహ్రు ముఖ్యఅతిథులుగా హజరై టోర్నమెంట్లో గెలుపోందిన విజేతలకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ విజేతలకు 11 వేలు, 9వేలు, 7వేలు, 5వేల రూపాయల ప్రోత్సాహక బహుమతులతో పాటు షీల్డ్‌లను బహూకరించారు.
దీంతో పాటు విజేతలకు నెహ్రు యువకేంద్ర వారి ధృవీకరణ పత్రాలను అందజేశారు. చెడుగుడు పోటీల టోర్నమెంట్‌కు రీఫరీలుగా వ్యవహరించిన మేకా వెంకట సుబ్బారావు, రమేష్ నాయుడు, ఫ్రాన్సిస్, కాగిత సత్యప్రసాద్, కట్టా సూర్యచంద్రరావుకు సర్వ యువజన అభివృద్ధి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల వెంకటస్వామి (ఏసుబాబు) సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. చెడుగుడు పోటీల ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాపోటీలు జరిగే ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. సర్పంచులు గరికిపాటి వీర వెంకట్రావు, కట్టా అంజమ్మ, చెన్నూరు పీఏసీఎస్ అధ్యక్షుడు యర్రంశేట్టి చంద్రశేఖర్, బీసీ నాయకులు బొర్రా నటేష్ పాల్గొన్నారు.