సొంతిల్లు కలే !
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. పెళ్లి సంగతేమో గానీ.. ఇల్లు కట్టాలంటే నేడు భయపడాల్సిన పరిస్థితి. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో ఇళ్ల నిర్మాణానికి చాలా మంది వెనుకాడుతున్నారు. మరీ ముఖ్యంగా పేదలు ప్రభుత్వం మంజూరు చేసే పక్కా గృహాలను సైతం పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా వారికి సొంతిల్లు కలగానే మారుతోంది.
సాక్షి, అనంతపురం : ఇటీవల గృహ నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. సిమెంటు, స్టీలు ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోంది. గడిచిన మూడు వారాల్లో సిమెంటు బస్తాపై రూ.50 చొప్పున రెండు సార్లు ధర పెరిగింది. గతంలో బస్తా ధర రూ.200-210 ఉండగా.. నేడు రూ.300-310 పలుకుతోంది. ఇంతకుముందు జిల్లాలో నెలకు 60 వేల టన్నులకు పైగా సిమెంటు అమ్మకాలు జరిగేవి. పెరిగిన ధరలతో 40 వేల టన్నులకు పడిపోయాయి.
40 వేల టన్నులంటే ఎనిమిది లక్షల బస్తాలన్న మాట. పెరిగిన ధరతో మొత్తమ్మీద నెలకు రూ.8 కోట్లు, ఏడాదికి రూ.96 కోట్ల మేర వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఇనుము ధరలు కూడా పెరిగిపోయాయి. నిన్నటి వరకు వైజాగ్ స్టీలు టన్ను రూ.40 వేలు కాగా, ప్రస్తుతం రూ.53 వేలకు చేరింది. జిల్లాలో నెలకు దాదాపు మూడు వేల టన్నుల స్టీలు అమ్మకాలు జరుగుతున్నాయి. టన్నుపై రూ.13 వేల చొప్పున ధర పెరగడంతో నెలకు రూ.3.90 కోట్ల అదనపు భారాన్ని వినియోగదారులు భరించాల్సి వస్తోంది.
ఆశలు అడియాసలే
అరకొర ఆర్థిక సాయం, సకాలంలో అందని బిల్లులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో బిల్లుల మంజూరుపై అనుమానాలు, నిర్మాణ సామగ్రి ధరల పెంపు తదితర కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. సొంతిళ్లు కట్టుకోవాలన్న వారి ఆశలు అడియాసలవుతున్నాయి. జిల్లాలో 2006 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో 4,61,472 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటిదాకా 2,86,107 పూర్తయ్యాయి. 1,13,349 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 62,016 ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటికీ మొదలుపెట్టలేదని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అంటే 1,75,365 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కొనసాగిద్దామన్నా..మొదలు పెడదామన్నా సిమెంటు, స్టీలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో బీసీ, ఓసీలకు రూ.70 వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో బీసీ, ఓసీలకు రూ.80 వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.1.05 లక్షల చొప్పున మంజూరు చేస్తోంది. పెరిగిన ధరలతో ఈ మొత్తం ఏ మూలకూ చాలడం లేదు.
ఇతర ప్రాంతాల నుంచి సిమెంటు సరఫరా
సిమెంటు కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి పంతం నెగ్గించుకున్నాయి. జూన్ మూడు నుంచి ఈ ధరలు అమలు చేయడంతో సిమెంటు బస్తాపై ఏకంగా రూ.100 పెరిగింది. జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీలు పెద్దగా లేకపోవడంతో వ్యాపారులు వైఎస్సార్ జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ఇందుకు గాను అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వైఎస్సార్ జిల్లా నుంచి దిగుమతి ఆలస్యమయ్యే పక్షంలో తెలంగాణ రాష్ర్టం నుంచి తెచ్చుకోవాలంటే రెండు శాతం పన్ను భారం పడుతుందేమోనని భయపడుతున్నారు. స్టీలు తగినంత సరఫరా కాకపోవడంతో ధరలు పెరిగిపోయాయి.