వెంటాడి మరీ చంపేసింది..!
ఏపీలోని నెల్లూరు జిల్లాలో అడవి పంది దాడిలో వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం: పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న ముగ్గురిపై అడవి పంది దాడి చేసింది. వారిలో ఒకరిని వెంటాడి మరీ హతమార్చింది. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఆర్ఆర్కాలనీ (మఠం)లో గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ఆర్ఆర్నగర్ కాలనీకి చెందిన తీరంశెట్టి చెంచయ్య (45), అతని కుమారుడు కృష్ణయ్య, మరో వ్యక్తి అంబూరు పెంచలయ్య కూలి పనులు ముగించుకుని వస్తుండగా మార్గమధ్యలో ఓ అడవి పంది అకస్మాత్తుగా ముగ్గురిపై దాడి చేసింది. వీరిలో ఇద్దరు అక్కడి నుంచి పరుగులు తీశారు.
ముందువెళ్తున్న తీరంశెట్టి చెంచయ్య ఎదురు రొమ్ముపై తీవ్రగాయం కావడంతో పరుగులు తీస్తూ పక్కనున్న బావిలో పడ్డాడు. అడవిపంది సైతం అతనితో పాటు బావిలోకి దూకింది. చాతి భాగాన్ని చీల్చి, ముఖంపై రక్కి తీవ్రంగా గాయపర్చడంతో చెంచయ్య అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అడవిపంది దాడితో పరుగులు తీసిన మిగతా ఇద్దరు స్థానిక గ్రామస్తులకు విషయం చెప్పడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే చెంచయ్య మృతి చెందడంతో వల సహాయంతో పందిని బయటకు తీశారు. ఈ క్రమంలో ఉచ్చు బిగిసుకుని పంది సైతం మృతిచెందింది.