బొగ్గు ఉత్పత్తి పెంచాలి
తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చాలి
ఆర్జీ–1 సీజీఎం వెంకటేశ్వర్రావు
గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రతీ సింగరేణీయుడు చేయిచేయి కలిపి బొగ్గును ఉత్పత్తి పెంచాలని ఆర్జీ–1 సీజీఎం వెంకటేశ్వర్రావు సూచించారు. జీడీకే–2ఎ గనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఉత్పత్తి, ఉత్పాదకత విషయంలో గనిని ముందుకు తీసుకెళ్లాలని, అందుకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. వర్షాల కారణంగా సెప్టెంబర్ వరకు ఉత్పత్తి, ఉత్పాదకతలో కొంత వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించి నాణ్యతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచుకుంటూ సంస్థను లాభాల్లో నడిపించాలన్నారు. ఐఈడీ ఏజీఎం ప్రసాదరావు, పర్సనల్ డీజీఎం బి.హనుమంతరావు, ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్‌రావు, క్వాలిటీ భైరయ్య, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేవీ.రావు సాధించాల్సిన ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలు, కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్లు, రక్షణ పరమైన చర్యలు, సంక్షేమ కార్యక్రమాలు, అందరి బాధ్యత తదితర విషయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ప్రొజెక్టర్ ద్వారా ఉద్యోగులకు తెలిపారు. అనంతరం టీబీజీకేఎస్ గని ఫిట్ సెక్రటరీ దాసరి మొగిళి మాట్లాడుతూ ఉత్పత్తి పెంచేందుకు రెండు కొత్త ఎస్డీఎల్ యంత్రాలను ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇసుక రవాణా కూడా స్పష్టమైన విధానం ఉండాలని, బంకర్ల నుంచి కోల్ట్రాన్స్పోర్ట్ కోసం తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని, గనిలో ఎస్డీఎల్ నడిచే ప్రదేశంలో బురదగా ఉండకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, జీడీకే–1వ గని గ్రూప్ ఏజెంట్ సాంబయ్య, ఈఅండ్ఎం ఏజీఎం సాయిరాం, ఫైనాన్స్ డీజీఎం రాజేశ్వర్‌రావు, డివైఎస్ఈ రమేశ్, గని మేనేజర్ గోపాల్‌సింగ్, అధికారులు కిరణ్‌కుమార్, నాయకులు యాదగిరి సత్తయ్య, జూపాక రాజయ్య తదితరులు పాల్గొన్నారు.