పౌరసేవలపై త్వరలో కాల్‌సెంటర్
ఎస్డీఎంసీ స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య
న్యూఢిల్లీ: పౌర సేవలకు సంబంధించిన సమాచారం ఇక అడిగిన వెంటనే అందనుంది. దీంతోపాటు ఫిర్యాదుచేసేందుకు కూడా ఓ అవకాశం లభించనుంది. ఇందుకు సంబంధించి త్వరలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ సుభాష్ ఆర్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్‌కు సంబంధించిన సమాచారం ఈ సెంటర్లో అందుబాటులో ఉంటుందన్నారు. దీంతోపాటు తమ సమస్యలను నగరపౌరులు ఈ సెంటర్లో నమోదు చేయవచ్చన్నారు.
అంకితభావంతో పనిచేస్తా
అధిష్టానం తనకు కీలక బాధ్యతలను అప్పగించిందని బీజేపీ నాయకుడు, ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ అయిన సుభాష్ ఆర్య పేర్కొన్నారు. అంకితభావంతో తన విధులను నిర్వర్తిస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను కొనసాగించడమే తన లక్ష్యమన్నారు. ఎస్డీఎంసీ పరిధిలో పారిశుధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాన న్నారు. అవినీతిని అంతమొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎస్‌డీఎంసీలో ఇన్స్పెక్టర్ రాజ్ లేకుండా చేస్తానని, పనితీరును మెరుగుపరుస్తానని ఆయన పేర్కొన్నారు.