రాజ్యసభ ‘రచ్చ’
సాక్షిప్రతినిధి, నల్లగొండ: పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిన విధంగా.. జిల్లా టీడీపీలోని గుంపుల పోరును రాజ్యసభ ఎన్నికలు తీర్చేలానే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎంతో ఆశపడి, ప్రయత్నించినా చేతికి దక్కకుండా పోయిన రాజ్యసభ టికెట్ టీడీపీలో కొత్త కుంపటి రాజేస్తోంది.
ఆయన రాజ్యసభ టికెట్ కోరుతూ అధినేతకు విన్నవించుకున్నట్లు వార్తలు వచ్చిన తరువాత, ఏమాత్రం ఆలస్యం చేయకుండా భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి తనూ ఓ దరఖాస్తు పెట్టేశారు. మోత్కుపల్లి ఒకవర్గంగా, ఎమ్మెల్యేలు చందర్రావు, ఉమామాధవరెడ్డి మరోవర్గంగా జిల్లా టీడీపీ రాజకీయం రక్తి కడుతున్న విషయం విదితమే. ఒకే జిల్లా నుంచి ఇద్దరు నాయకులు పోటీలు పడి టికెట్ అడగడంతో అసలుకే ఎసరు వచ్చింది. ఎవరికీ అవకాశం రాకుండాపోయింది. ఉమా మాధవరెడ్డి బాబును కలిసి రాజ్యసభ సీటు కోరిన మరుసటి రోజే, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జ్లందరినీ తీసుకుపోయిన మోత్కుపల్లి ఒకవిధంగా అధినేత వద్ద బల ప్రదర్శన చేశారు. అయినా, పాచిక పారకపోవడంతో అలకపాన్పు ఎక్కారు.
ఇది కొత్తేం... కాదు
తాను అనుకున్నట్లు అధినేతను ఆడించేందుకు.. తన పనులు చేయించుకునేందుకు.. ఎదుటి వర్గంపై పైచేయి సాధించేందుకు అలకబూనడం మోత్కుపల్లికి కొత్తేం కాదు, ఇది మొదటిసారి కూడా కాదని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలంతా టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి నేతత్వంలో బస్సు యాత్ర చేసిన సమయంలో కూడా ఇదే తరహాలో చెట్టెక్కి కూర్చున్నారు. ఖమ్మం జిల్లా నుంచి సూర్యాపేట నియోజకవర్గంలో ప్రవేశించి, దేవరకొండ మీదుగా మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లిన ఆ బస్సు యాత్రలో ఆయన పాల్గొనలేదు.
తన అనుచరులకు నియోజకవర్గ ఇన్చార్జ్ పోస్టులు ఇప్పించుకునేందుకు ఈ ఎత్తు వేశారు. అదే మాదిరిగా, గతేడాది జనవరిలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ‘మీ కోసం’ యాత్రకు వచ్చిన సమయంలోనూ ఇదే రిపీటైంది. ఖమ్మం జిల్లా నుంచి కోదాడ నియోజకవర్గంలో బాబు యాత్ర చేరుకునే సమయంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మంతనాలు జరిపి, బాబుతో ప్రత్యేక భేటీ అయ్యాక కానీ.. ఆయన ఈ యాత్రలో పాల్గొన లేదు. ఆ తర్వాతే హుజూర్నగర్ ఇన్చార్జ్ నియామకం జరిగింది.
తన ప్రాధాన్యం తగ్గకుండా, ‘ఇలా అదను చూసి అలగడం ‘మోత్కుపల్లి’కి రివాజుగా మారిందని ఆ పార్టీ నేతలు అం టున్నారు. ఈసారి కూడా ఆయన రాజ్యసభ టికెట్ ఇవ్వలేదన్న సాకు చూపెట్టి, మరేదో పెద్ద టెండరే వేసి ఉంటారు..’ అని పార్టీ జిల్లా నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అధినేత బుజ్జగింపులతో మెట్టు దిగి పార్టీలో కొనసాగినా.. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గంతో ఈ ఎన్నికల సమయంలో నిత్య పోరాటం మాత్రం తప్పేలా లేదు. కాకుంటే, గత కొద్ది నెలలుగా జిల్లా తెలుగుదేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషిస్తే, ఇద్దరు ఎమ్మెల్యేలున్న వ్యతిరేక వర్గం కంటే ఆయన వర్గమే బలంగా ఉంది.
దీంతో ఈ ఎన్నికల్లో తన మాటే చెల్లుబాటు అయ్యేలా, తాను కోరిన వారికి టికెట్లు ఇప్పించుకునేలా చక్రం తిప్పే అవకాశం కూడా లేకపోలేదు. అయితే, అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ పరిస్థితి, ఈ గుంపుల పోరుతో మరింత దయనీయంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం తటస్థ నాయకత్వం నుంచి వస్తోంది. ఇక, మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం మేకు ఆయన పార్టీని వీడుతారా, లేదా అన్న అంశంపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. గతంలో ఓ మారు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లారు. తిరిగి, టీడీపీకి గూటికి చేరారు. ‘.. ఏమో, ఏమైనా జరగవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధినేత వ్యవ హార శైలి, ఆయన తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది..’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయ పడ్డారు. మరి , ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధినేత ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది.