సంస్కృతి... సమాజాల సమర్చకుడు
కొత్త పుస్తకం
జీవితంలో ఎన్నో కష్టాలు పడి పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి... ఉన్నతాధికారిగా పగ్గాలు చేతిలో ఉన్నా ప్రజల బాగు మర్చిపోని మనిషి... నమ్మి ఇచ్చిన బాధ్యతలను నిజాయితీతో, త్రికరణశుద్ధిగా నెరవేర్చిన పాలనాదక్షుడు... సాహితీ, సాంస్కృతిక రంగాలకు ప్రాణబంధువు... ఐ.ఎ.ఎస్‌గా, అంతకు మించి మంచి మనిషిగా మన్ననలందుకున్న అందరివాడు - రమణాచారి. ఆ కళా హృదయుడి జీవన తరంగాల నుంచి కొన్ని స్మృతి వీచికలు.
రమణ బాల్యంలో వారిది ఉమ్మడి కుటుంబం. పూటకు పదిహేను విస్తళ్లు లేవాలి. ఇంటి యజమాని (నాన్నగారి) ఆదాయం మాత్రం నెలకు పాతిక రూపాయలు! ఆ ఇల్లాలు పద్మావతమ్మ అటు అత్తమామలు, మరుదులు, ఇటు తన సంతానం అయిదుగురులో ఎవరికీ ఏదీ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. పెద్ద కొడుకు రమణ పొద్దున్నే బాబాయిలతో కలిసి వెళ్లి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తాగడానికి నీళ్లు తెచ్చేవారు. తర్వాత అందరి స్నానాలకు బావి నీళ్ల తోడి కాచేవారు. చెల్లెళ్లు అమ్మకు ఇంటి పనిలో సాయం చేసేశారు.
రాత్రి ఏడు గంటలకు భోజనాలు అయిపోయేవి. పిల్లలందరూ ఒకే గొంగళి కప్పుకొని నిద్రపోయేవారు. నాలుగున్నరకి నిద్ర లేపేవారు. రోజూ రెండు గంటలు తప్పని సరిగా పాఠాలు చదివేవారు. చిన్నతనంలో వచ్చిన ఆ అలవాటు రమణని ఇప్పటికీ అంటి పెట్టుకునే ఉంది. అప్పట్లో రమణ కాళ్లకు చెప్పులుండేవి కావు. చిన్నాన్నలు వాడేసిన దుస్తులే వేసుకోవాల్సి వచ్చేది. అయితేనేం మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉండేది. క్లిష్టమైన పాఠ్యాంశాన్నైనా అవగతం చేసుకోగల నేర్పు ఉండేది.
1975లో వరంగల్లులో కెమిస్ట్రీ లెక్చరరుగా ఉంటోన్న కాలంలో ఓ రోజు రమణ, మరో నలుగురు లెక్చరర్లతో పాటు కలెక్టరేట్‌కి వెళ్లారు. అక్కడ రేషన్‌కార్డు కోసం వెళ్ళినప్పుడు లెక్చరర్లని కూడా చూడకుండా ఓ గుమస్తా వాళ్లను అవమానించాడు. అంతే! ‘నేను కలెక్టర్‌ని కావాలి! లేదా పరిపాలనా రంగంలో ఉన్నత ఉద్యోగిగా ఉండాలి. సామాన్య ప్రజలకు న్యాయం దక్కేలా చేయాలి. గ్రూప్ వన్ పరీక్షలైనా రాస్తాను... అని రమణ పట్టుదలగా పరీక్షలు రాసి, కృతార్థుడయ్యారు.
నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీని క్రియాశీలంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచించారు...మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంత అభివృద్ధికి ఏర్పాటైన సంస్థకి అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరిని నియమించాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది? అడ్మినిస్ట్రేటర్ సమర్థుడై ఉండాలి. ఆయనకు ఇంగ్లీషు మాత్రమే వస్తే సరిపోదు, తెలుగు, ఉర్దూ బాషల్లో కూడా మంచి ప్రవేశం ఉండాలి.
అన్ని మతాల, వర్గాల వారినీ కలుపుకొని పోగలగాలి. అటువంటి అధికారి ఎవరా? అని మంత్రిమండలిలో చర్చకు వచ్చింది. 1984 నాటికి రమణని భారత ప్రభుత్వం ఐ.ఏ.ఎస్. అధికారిగా కన్ఫర్మ్ చేసింది. ఆ కాలంలోనే నెల్లూరును గజగజలాడించిన పెనుతుపానుకు వేల మంది నిరాశ్రయులయ్యారు. రైతుల పంటలు, జీవితాలు నీళ్లపాలయ్యాయి. సైక్లోన్ స్పెషలాఫీసరుగా రమణ నెల్లూరు జిల్లా ప్రజలకు తక్షణ ప్రభుత్వ సాయం అందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. అయితే ఇంకేం ‘వారినే నియమిద్దాం’ అన్నారు ముఖ్యమంత్రి.
కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత రమణ దృష్టి కులీకుతుబ్‌షా సమాధులవైపు మళ్లింది. ఒక్క ముంతాజ్ బేగం సమాధి తాజ్‌మహల్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందితే ఏడు సమాధుల మాటేమిటి? వాటిని అభివృద్ధి పరిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు పేరొస్తుంది. ముఖ్యమంత్రి ఎన్టీయార్ పూనికతో కె.వి. రమణాచారి దృఢసంకల్పంతో అది ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకొంది. సుమారు నూరు ఎకరాల పైనున్న సమాధుల ప్రాంతంలో రెండు కోట్లతో అభివృద్ధిపరచే ప్రణాళికను సిద్ధంచేసి అమలుచేశారు. విదేశీ పర్యాటకులకూ ఆ ప్రాంతం ఆకర్షణగా నిలిచింది.
ఓ పర్యాయం ఆంధ్ర మహిళాసభలో కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారు చేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ‘లోగోంకే పాస్ వక్త్ హై / నఫ్రత్‌కే వాస్తే / జబ్కే హయాత్ కమ్హై / మొహబ్బత్కే వాస్తే’ (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది... కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు) ఆయన్ని బాగా ఆకట్టుకుంది. దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. ‘‘మా పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు’’ అంటూ ప్రశంసించారు. అప్పట్నించీ చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరు.
సాంస్కృతిక శాఖలో అనే కాదు, ఏ శాఖలో అయినా అద్భుతాలు చేయవచ్చు. సృష్టించవచ్చు. మనకెందుకు? మన జీతం మనకొస్తోంది కదా అనుకుంటే చేసేదేముంటుంది! గత నలభై సంవత్సరాలుగా సాంస్కృతికశాఖ పనితీరును చాలా సన్నిహితంగా గమనిస్తూనే ఉన్నవారికి రమణ లాంటి ఇద్దరు ముగ్గురి హయాంలోనే అది చాలా క్రియాశీలంగా పనిచేసిందనిపిస్తుంది. సాంస్కృతికశాఖలో రమణ ఉన్నప్పుడే అఖిలాంధ్ర నాటకోత్సవాలు ప్రవేశపెట్టారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో మన తెలుగుజాతి చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా శాతవాహనోత్సవాలు, చాళుక్యోత్సవాలు, విజయనగరోత్సవాలు, కాకతీయోత్సవాలు, గోల్కొండోత్సవాలు - ఇలా ఉత్సవాల పరంపర మొదలుపెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘సౌజన్య సంస్కృతీ పథకం’ ప్రవేశపెట్టి రాష్ట్రంలోని వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని ఆర్థిక సహకారం అందించారు. రమణ మాటల్లో చెప్పాలంటే ‘‘ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కంటే సాంస్కృతిక సంస్థలు, సాహితీ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడు అందిస్తే విశేష జనాదరణ పొందగలమన్నది నా విశ్వాసం.’’