బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ సిబ్బంది
నిజామాబాద్: ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న మైనారిటీ తీరని ప్రేమికుల వివాహ ప్రయత్నాన్ని సోమవారం ఎల్లారెడ్డి ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు.
మండలంలోని రాములు నాయక్ తండాకు చెందిన మోతీలాల్(19), లింగంపేట మండలం పర్మల్ల తండాకు చెందిన సరిత(16) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 16న వీరి వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహానికి అమ్మాయి బంధువులు అభ్యంతరాలు తెలిపారు. కానీ పెళ్లి కుమారుడు బాలికను తన ఇంటికి తీసుకువచ్చాడు. మైనారిటీ తీరని అమ్మాయికి పెళ్లి కాబోతున్న విషయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చైల్డ్ కేర్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడంతో వారు స్థానిక ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు.
సీడీపీవో సునంద సూచనల మేరకు గ్రామానికి వెళ్లిన సూపర్వైజర్లు శ్రీప్రియ, విశాలదేవి, వీఆర్వో విఠల్‌లు మైనారిటీ తీరని బాలికను తహసీల్దార్ నాగజ్యోతి ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు ఆ బాలికకు తహసీల్దార్ కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికను వారి కుటుంబసభ్యులకు అప్పగించి ఇరువర్గాల పెద్దలకు నచ్చజెప్పి బాల్యవివాహం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పేష్కార్ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.