Child sales
-
మరీ పిల్లల్ని విక్రయించేశారా?
సాక్షి, చెన్నై: పిల్లల విక్రయ ముఠా రాకెట్ విదేశాలకు సైతం విస్తరించి ఉన్నట్టుగా విచారణలో వెలుగుచూసింది. ఓ న్యాయవాది అయితే, ఆధారాలతో పోలీసుల్ని ఆశ్రయించడంతో విచారణ మరింత ముమ్మరం అయింది. ఈ వ్యవహారంలో మరో ముగ్గురు బ్రోకర్లను ఆదివారం అరెస్టు చేశారు. ఇక, కొల్లిమలైలో 50 మంది పిల్లలు అదృశ్యమైనట్టు వెలుగులోకి వచ్చింది. ఆ పిల్లల బర్త్ సర్టిఫికెట్లు తల్లిదండ్రుల వద్దే ఉన్నా, పిల్లల జాడ కానరాని దృష్ట్యా, విక్రయించినట్టుగా అనుమానాలు బయలు దేరాయి. ఒక్కో బిడ్డను లక్షల్లో అమ్ముకుని ఉన్నట్టుగా సంకేతాలు రావడంతో ఈ కేసును సీబీఐకు లేదా సీబీసీఐడీ, సిట్టింగ్‌జడ్జి ద్వారా విచారించాలన్న నినాదం తెరపైకి వచ్చింది. నామక్కల్ జిల్లా రాశిపురం కేంద్రంగా సాగుతూ వచ్చిన పిల్లల విక్రయ ముఠాగుట్టును ఓ ఆడియో ద్వారా రట్టైనవిషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా ఉన్న అముదవళ్లి, ఆమె భర్త రవిచంద్రన్, అంబులెన్స్ డ్రైవర్ మురుగేషన్, బ్రోకర్లు పర్విన్, హసినా, అరుల్స్వామిలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద సాగిన విచారణ మేరకు పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సంతాన లేమితో బాధ పడే దంపతులు ఎందరికో వీరి ద్వారా పిల్లల విక్రయాలు సాగినట్టు, ఒక్కో బిడ్డ కనీసం ఐదారు లక్షలకు పైగానే విక్రయించినట్టుగా తెలిసింది. నామక్కల్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, కరూర్ జిల్లాల్లో గతంలో కరువు తాండవం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని గురి పెట్టి పిల్లల్ని బేరాలకు పెట్టే దిశగా మనస్సు మార్చినట్టు బయటపడింది. కొందరు పిల్లల్ని తల్లిదండ్రుల ద్వారానే విదేశాలు, రాష్ట్రంలో కొన్ని నగరాల్లో ఉన్న వాళ్లకు విక్రయించినట్టుగా సమాచారం. మరి కొందరు పిల్లల్ని వీరి ముఠా ద్వారా ఆస్పత్రుల్లో, రోడ్లపై, ఫుట్ పాత్లపై నివాసం ఉన్న వారి పిల్లల్ని అపహరించుకుని వెళ్లి మరీ విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. శ్రీలంక, మలేషియా వంటి దేశాలకు సైతం పిల్లల్ని విక్రయించినట్టుగా సమాచారాలు వెలుగులోకి రావడమే కాదు, న్యాయవాది విశ్వరాజ్ నామక్కల్ పోలీసులకు ఆధారాలు సహా ఆదివారం ఓ ఫిర్యాదు చేయడం గమనార్హం. శ్రీలంకలో విక్రయం ..... అముద వళ్లి ద్వారా శ్రీలంకలో కూడా పిల్లల్ని విక్రయించి ఉండడం వెలుగు చూసింది. ఆమేరకు విశ్వరాజ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు సేలం నెలవరం పట్టికి చెందిన అముద, వడివేలు దంపతుల కుమార్తెను రూ.8 లక్షలకు అముదవళ్లి ద్వారా శ్రీలంకకు చెందిన కుమారస్వామి పిళ్లై పరిమళ దేవి దంపతులకు విక్రయించినట్టు వివరించారు. శ్రీలంకలో ఉండే దంపతులు తిరుప్పూర్ జిల్లా తారాపురంలో ఉన్నట్టుగా సృష్టించి, అందుకు తగ్గ సర్టిఫికెట్లను పొంది మరీ ఆ బిడ్డను విక్రయించినట్టుగా ఫిర్యాదు చేశారు. ఈ ముఠా ద్వారా ఎందరో పి ల్లల్ని విదేశాలకు విక్రయించినట్టుగా తెలుస్తున్నదని, ఈ దృష్ట్యా, కేసును సీబీఐ లేదా ,సీబీసీఐడీ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, కొల్లిమలైలో సాగుతున్న విచారణ మేరకు ఇప్పటి వరకు 50 మంది పిల్లల జాడ కానరనట్టు తేలింది. బెర్త్ సర్టిఫికెట్ల ఆధారంగా ఆరోగ్య శాఖ జరుపుతున్న ఈ విచారణలో శనివారం 20 మంది అదృశ్యమైనట్టు తేలింది. ఆదివారం ఈ సంఖ్య 50కు చేరింది. ఇందులో పది మంది పిల్లలు విదేశాలకు విక్రయించినట్టు సమాచారం. అలాగే, పిల్లల తల్లిదండ్రుల వద్ద బెర్త్ సర్టిఫికెట్లు ఉన్నా, ఆ పిల్లలు మాత్రం ఇక్కడ లేని దృష్ట్యా, అందరూ విక్రయించ బడి ఉంటారన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో విచారణ వేగం మరింతగా పెరిగింది. మరో ఇద్దరు అరెస్టు.. అముద వళ్లి ముఠాకు సహకరించిన మరో ఇద్దరు మహిళ బ్రోకర్లను ఆదివారం అరెస్టు చేశారు. నామక్కల్ పరిత్తి పాళయం, కుమార పాళయంలకు చెందిన సెల్వి, లీలాను అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. వీరి వద్ద లభించే సమాచారం మేరకు మరి కొందరు అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అంబులెన్స్ డ్రైవర్ మురుగేషన్ ఇచ్చిన సమాచారం మేరకు కుమార పాళయంకు చెందిన జయరాజ్, పాండియన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ పిల్లల విక్రయ ముఠా వెనుక అదృశ్యశక్తులు తప్పని సరిగా ఉండి ఉంటాయని, గుట్టు బయటకు రావాలంటే, విచారణను ప్రత్యేక సిట్ లేదా, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ పేర్కొంటూ, ఈ వ్యవహరంలో మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకోవాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినప్పుడే, ఈ ముఠా వెనుక ఉన్న శక్తులు గుట్ట రట్టు అవుతాయన్నారు. -
శిశు విక్రయాల పరంపర
జిల్లాలో శిశు విక్రయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకులు ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. అధికారులు ఎంతగా చైతన్య పరిచినా సాంఘిక దురాచారానికి అడ్డుకట్ట పడడం లేదు. జిల్లాలోని చివ్వెంల, మర్రిగూడ మండలాల పరిధిలో ఆడపిల్లల విక్రయాలు ఆలస్యంగా వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. - సూర్యాపేట చివ్వెంల మండలం రాజ్తండాకు చెందిన మంగ్త్యా-కవిత దంపతులకు మొదటి, రెండో సంతానంలో ఆడబిడ్డలు జన్మించారు. కాగా కవితకు మొదటి సంతానం నుంచే బాలిం త గుణం వస్తుండేది.. ఈ క్రమంలో ఆమె రెండో సంతానంలో కూడా ఆడ శిశువుకు జన్మనిచ్చి.. అదే మాదిరిగా బాలింత గుణం రావడంతో రెండు నెలల హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. ఈలోగా ఆమె అత్త, బంధువులు కలిసి శిశువును రూ.26 వేలకు సూర్యాపేటలోని గన్నోజు దుర్గాచారి, చివ్వెంల మండలం మోదిన్పురానికి చెందిన ఆర్ఎంపీ అంజి, కొండల్రాయినిగూడేనికి చెందిన మరో ఆర్ఎంపీ రవిలకు విక్రయించారు. గన్నోజు దుర్గాచారి ఎన్జీవో సంస్థలో చిరుద్యోగం చేస్తుండేవాడు. పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన రమణకు తమ వద్ద ఆడ శిశువు ఉందని.. సంతానం లేని వారు ఎవరైనా ఉంటే చెప్పమన్నాడు. ఆమె అదే కాలనీకి చెందిన సైదమ్మ అనే మరో మహిళకు విషయాన్ని వివరించింది. సైదమ్మ ఆమె ఇంటి పక్కనే నివాసముంటున్న మండలి నిర్మల ఆడపడుచుకు విషయాన్ని చెప్పింది. ఆమె నిర్మలకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలపడంతో తాను కొనుగోలు చేస్తానని చెప్పింది. దీంతో హైదరాబాద్‌లో నివాసముంటున్న నిర్మల వద్దకు.. దుర్గాచారి, రవి, అం లు వెళ్లి శిశువును ఆమెకు *26 వేలకు విక్రయించారు. రెండు నెలల తర్వాత.. శిశువు తల్లి కవిత హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కోలుకుంది. వారం రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకుని తన బిడ్డ ఏమైందని అత్తను నిలదీయగా.. నీ వద్ద పాలు లేకపోవడంతో.. బంధువుల ఇంటికి పంపించామని మాయమాటలు చెబుతూ వస్తోంది. సోదరుడు జలెందర్కు బాధిత మహిళ తన బిడ్డ కనిపించడం లేదంటూ విషయాన్ని తెలిపడంతో.. ఇద్దరు కలిసి మూడు రో జుల క్రితం భర్త మంగ్త్యాపై చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. పోలీసులు విచారణ సాగిస్తుండగా.. విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం సూర్యాపేటకు చేరుకుని దుర్గాచారిని ప్రశ్నించడంతో వివరాలు వెల్లడించి.. శిశువును తెప్పించి తల్లికి అప్పగించారు. అనంతరం దుర్గాచారి, శిశువు విక్రయానికి సహకరించిన రమణ, సైదమ్మ, కొనుగోలు చేసిన నిర్మలను చివ్వెంల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆడపిల్లను విక్రయించేందుకు బేరం కుదుర్చుకుని.. మర్రిగూడ: మర్రిగూడ మండలం కొం డూరు గ్రామ పంచాయతీ పరిధి జం టతండాకు చెందిన జర్పుల రవి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు జన్మిం చారు. పిల్లల పోషణ భారంగా మారడంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు ఓ ఆడపిల్లను హెదరాబాద్కు చెందిన వారికి అమ్మడానికి బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి సీడీపీఓ లావాణ్యకుమారి, ఐసీడీసీ సూపర్వేజర్ తులసి గురువారం ముందుగా తండాలో విచారణ చేశారు. అనంతరం మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌కు ఆ దంపతులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు. -
ఓడిపోతున్న అమ్మతనం
వంశోద్ధారకుడు కావాలన్న ఆరాటం.. ఆడపిల్లను సాకలేమన్న నిస్సహాయత.. ఏదైతేనేమీ.. జిల్లాలో శిశు విక్రయాల దుష్ట సంప్రదాయం కొనసాగుతుండడం దురదృష్టకరం. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం తండాలను వీడడం లేదు. ఇక..ఆధునికతకు పేరొందిన పట్టణ ప్రాంతాల్లో ‘కని’కరం లేకుండా ఆడశిశువులను రోడ్డు పక్కన, చెత్తకుప్పల్లో.. మురుగు కాల్వల్లో వేస్తున్న సంఘటనలు అనేకం.. ఆడశిశువులను ‘కని’కరం లేకుండా వదిలించుకుంటున్న విషాదాలకు జిల్లాలో ఇక.. ముగింపు లేదా...? విషసర్పాలైన పాములు కూడ గత్యంతర లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కన్న పిల్లలను వధిస్తాయని తెలిసిందే. పేదరికం, అధిక సంతానం మనుషులను కూడ కర్కోటకులుగా మారుస్తోంది. నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి సైతం ప్రేమను త్వజించి పేగు తెంచుకుపుట్టిన పసిగుడ్డును పాషాణంగా వదిలేస్తోంది. ⇒ పసిగుడ్డులను పడేస్తున్న కొందరు.. ⇒ దత్తత పేరుతో విక్రయిస్తున్న మరికొందరు ⇒ జిల్లాలో ఇంకా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయం నల్లగొండ అర్బన్: రోజులు, నెలలు, సంవత్సరాలతోపాటు క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ అడశిశువులను వదిలించుకునే అనాచారం నుంచి గిరి‘జనం’ బయటపడలేకపోతోంది. ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా, బంగారుతల్లి, కల్యాణ లక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టినా ఈ దుష్ట సంప్రదాయాన్ని నిలువరించలేకపోతున్నారు. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం గిరిజన తండాలను వీడడం లేదు. శిశు విక్రయాలతో దశాబ్దన్నర క్రితమే పత్రికల్లో పతాక శీర్షికల్లోకెక్కిన దేవరకొండ ప్రాంతంలో తరచు ఇలాంటి అనాచారపు ఆనవాళ్లు మెదలుతూనే ఉండగా, దుష్ట సంస్కృతి తాజాగా జిల్లా కేంద్రమూ మినహాయింపుకాదనే సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లేదారిలో అవాంఛిత మృతశిశువు ఉదంతం వెలుగులోకిచ్చి పదిరోజులైనా కాకముందే దత్తత ముసుగులో శిశు విక్రయ సంఘటన కలకలం రేపడం చర్చనీయాంశమైంది. వదిలించుకుంటున్న శిశువులు రోజుల వయస్సు వారు కావడంతో తల్లిపాలు పొందడం, తల్లిదండ్రుల వద్ద సహజ వాతావరణంలో పెరగడంలాంటి ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారు. 1999 నుంచి.. 1999 మార్చిలో దేవరకొండ మండలం కొండమల్లేపల్లి శివారు గౌరికుంట తండాలో ఇంద్రావత్ మంగ్లి అనే గిరిజన మహిళ 3 నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 75 మంది శిశు విక్రయాలు జరిగాయని పరిశోధనల్లో తెలింది. ‘‘ఆడశిశువులను అమ్ముకుంటే ఎంతో కొంతలాభం...లేకుంటే పెంచి పెద్దచేసి పెళ్లిచేస్తే లక్షలవుతది. అందుకే అమ్ముకుంటున్నాం’’ అని పలువురు గిరిజన మహిళలు పేర్కొనడం వారి పరిస్థితులకు అద్దంపట్టింది. అత్యధికంగా చందంపేట మండలంలో ఆ తర్వాత డిండి, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో విక్రయాలు జరిగినట్లు తేలాయి. ప్రత్యేక ప్యాకేజీ అనంతరం కొంతమేర తగ్గడం, ఆతర్వాత ‘ఊయల’ పేరుతో శిశుగృహలకు తరలించే ఏర్పాటు చేయడంతో మరికాస్త చైతన్యం వచ్చినా, దత్తత పేరుతో అడపాదడపా శిశు విక్రయాల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సాటుమాటుగా కొనసాగుతున్న విక్రయాలు.. పెంపకానికనో, దత్తత ఇచ్చామనే సాకులతో శిశు విక్రయాలు సాటుమాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే...వెలుగులోకి రానివి ఇంకొన్ని. చందంపేట మండలం పోలేపల్లి శివారు ఫకీర్‌నాయక్ తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానమైన నెలవయస్సు దాటని ఆడశిశువును మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 15వేలకు కొండమల్లేపల్లి విద్ద విక్రయించారు. విషయం పోలీసులకు తెలియడంతో శిశువును స్వాధీనం చేసుకుని దేవరకొండలోని శిశు గృహకు తరలించిన సంఘటన తెలిసిందే. తాజాగా హాలియా మండలంలోని రంగుండ్ల తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానంలో జన్మిం చిన ఆడశిశువును మునుగోడు మండలానికి చెందిన ఓవ్యక్తి అప్పగించడం.. నల్లగొండలో జరిగిన వాగ్వివాదంతో విషయం అధికారుల దాకా వెళ్లి పాపను శిశుగృహకు తరలించారు. ఒకప్పుడు గొంతులో వడ్లగింజవేసి అక్కడిక్కడే అవాంఛిత శిశువుల ఉసురు తీసిన సంఘటనల నుంచి శిశు విక్రయాలు, దత్తత ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’తోనైనా ఆగేనా... ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ఏటా కొంత నగదును ఇస్తూ మొత్తంగా రూ.2.16లక్షలను అందజేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపు అస్పష్టంగానే ఉంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారానైనా ఆడపిల్లల జీవితాలకు భరోసా కలగాలని ఆశిద్దాం. ఆడశిశువైతే వీడాల్సిందే...! వంశోద్ధారకుడు కావాలనే తాపత్రయంతో రెండు, మూడు కాన్పుల వరకు చూసి ఆపై కూడ ఆడ సంతానమే కలిగితే వదిలించుకుంటున్న సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, యాజమాన్యత, దారిద్య్రం, లింగవివక్షలు, వరకట్న సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్న విపత్కర పరిస్థితుల ప్రేరేపణతో నవమాసాలు మోస్ఙికన్న’ ఆ పేగే బరువైపోతోంది. ఈ అనాచారం విశృంఖలంగా మారి పరిస్థితి ఘోరంగా తయారవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ మొదలు అసెంబ్లీ కమిటీల వరకు గిరిజన తండాల్లో పర్యటించి శిశు విక్రయ నిరోధానికి సలహాలు, సూచనలిచ్చాయి. రూ.26 కోట్ల ప్యాకేజీతో కొంతతగ్గినా... శిశు విక్రయాల సంఘటనలను తీవ్రంగా పరిగణించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ 2001లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటన తర్వాత..దాని నివేదిక ప్రకారం 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మరికొంత ఆర్థిక సాయం అందించింది. దీంతో కొన్నాళ్లపాటు ఈ అనాచార, ఉదంతాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథాతధమయ్యాయి.