సెల్వి ,లీలా
సాక్షి, చెన్నై: పిల్లల విక్రయ ముఠా రాకెట్ విదేశాలకు సైతం విస్తరించి ఉన్నట్టుగా విచారణలో వెలుగుచూసింది. ఓ న్యాయవాది అయితే, ఆధారాలతో పోలీసుల్ని ఆశ్రయించడంతో విచారణ మరింత ముమ్మరం అయింది. ఈ వ్యవహారంలో మరో ముగ్గురు బ్రోకర్లను ఆదివారం అరెస్టు చేశారు. ఇక, కొల్లిమలైలో 50 మంది పిల్లలు అదృశ్యమైనట్టు వెలుగులోకి వచ్చింది. ఆ పిల్లల బర్త్ సర్టిఫికెట్లు తల్లిదండ్రుల వద్దే ఉన్నా, పిల్లల జాడ కానరాని దృష్ట్యా, విక్రయించినట్టుగా అనుమానాలు బయలు దేరాయి. ఒక్కో బిడ్డను లక్షల్లో అమ్ముకుని ఉన్నట్టుగా సంకేతాలు రావడంతో ఈ కేసును సీబీఐకు లేదా సీబీసీఐడీ, సిట్టింగ్‌జడ్జి ద్వారా విచారించాలన్న నినాదం తెరపైకి వచ్చింది. నామక్కల్ జిల్లా రాశిపురం కేంద్రంగా సాగుతూ వచ్చిన పిల్లల విక్రయ ముఠాగుట్టును ఓ ఆడియో ద్వారా రట్టైనవిషయం తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా ఉన్న అముదవళ్లి, ఆమె భర్త రవిచంద్రన్, అంబులెన్స్ డ్రైవర్ మురుగేషన్, బ్రోకర్లు పర్విన్, హసినా, అరుల్‌స్వామిలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద సాగిన విచారణ మేరకు పలు అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సంతాన లేమితో బాధ పడే దంపతులు ఎందరికో వీరి ద్వారా పిల్లల విక్రయాలు సాగినట్టు, ఒక్కో బిడ్డ కనీసం ఐదారు లక్షలకు పైగానే విక్రయించినట్టుగా తెలిసింది. నామక్కల్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, కరూర్ జిల్లాల్లో గతంలో కరువు తాండవం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారిని గురి పెట్టి పిల్లల్ని బేరాలకు పెట్టే దిశగా మనస్సు మార్చినట్టు బయటపడింది. కొందరు పిల్లల్ని తల్లిదండ్రుల ద్వారానే విదేశాలు, రాష్ట్రంలో కొన్ని నగరాల్లో ఉన్న వాళ్లకు విక్రయించినట్టుగా సమాచారం. మరి కొందరు పిల్లల్ని వీరి ముఠా ద్వారా ఆస్పత్రుల్లో, రోడ్లపై, ఫుట్ పాత్‌లపై నివాసం ఉన్న వారి పిల్లల్ని అపహరించుకుని వెళ్లి మరీ విక్రయానికి పెట్టినట్టు తెలిసింది. శ్రీలంక, మలేషియా వంటి దేశాలకు సైతం పిల్లల్ని విక్రయించినట్టుగా సమాచారాలు వెలుగులోకి రావడమే కాదు, న్యాయవాది విశ్వరాజ్ నామక్కల్ పోలీసులకు ఆధారాలు సహా ఆదివారం ఓ ఫిర్యాదు చేయడం గమనార్హం.
శ్రీలంకలో విక్రయం .....
అముద వళ్లి ద్వారా శ్రీలంకలో కూడా పిల్లల్ని విక్రయించి ఉండడం వెలుగు చూసింది. ఆమేరకు విశ్వరాజ్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు సేలం నెలవరం పట్టికి చెందిన అముద, వడివేలు దంపతుల కుమార్తెను రూ.8 లక్షలకు అముదవళ్లి ద్వారా శ్రీలంకకు చెందిన కుమారస్వామి పిళ్లై పరిమళ దేవి దంపతులకు విక్రయించినట్టు వివరించారు. శ్రీలంకలో ఉండే దంపతులు తిరుప్పూర్ జిల్లా తారాపురంలో ఉన్నట్టుగా సృష్టించి, అందుకు తగ్గ సర్టిఫికెట్లను పొంది మరీ ఆ బిడ్డను విక్రయించినట్టుగా ఫిర్యాదు చేశారు. ఈ ముఠా ద్వారా ఎందరో పి ల్లల్ని విదేశాలకు విక్రయించినట్టుగా తెలుస్తున్నదని, ఈ దృష్ట్యా, కేసును సీబీఐ లేదా ,సీబీసీఐడీ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, కొల్లిమలైలో సాగుతున్న విచారణ మేరకు ఇప్పటి వరకు 50 మంది పిల్లల జాడ కానరనట్టు తేలింది. బెర్త్ సర్టిఫికెట్ల ఆధారంగా ఆరోగ్య శాఖ జరుపుతున్న ఈ విచారణలో శనివారం 20 మంది అదృశ్యమైనట్టు తేలింది. ఆదివారం ఈ సంఖ్య 50కు చేరింది. ఇందులో పది మంది పిల్లలు విదేశాలకు విక్రయించినట్టు సమాచారం. అలాగే, పిల్లల తల్లిదండ్రుల వద్ద బెర్త్ సర్టిఫికెట్లు ఉన్నా, ఆ పిల్లలు మాత్రం ఇక్కడ లేని దృష్ట్యా, అందరూ విక్రయించ బడి ఉంటారన్న అనుమానాలు బయలుదేరాయి. దీంతో విచారణ వేగం మరింతగా పెరిగింది.
మరో ఇద్దరు అరెస్టు..
అముద వళ్లి ముఠాకు సహకరించిన మరో ఇద్దరు మహిళ బ్రోకర్లను ఆదివారం అరెస్టు చేశారు. నామక్కల్ పరిత్తి పాళయం, కుమార పాళయంలకు చెందిన సెల్వి, లీలాను అరెస్టు చేసిన పోలీసులు రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. వీరి వద్ద లభించే సమాచారం మేరకు మరి కొందరు అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అంబులెన్స్ డ్రైవర్ మురుగేషన్ ఇచ్చిన సమాచారం మేరకు కుమార పాళయంకు చెందిన జయరాజ్, పాండియన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ పిల్లల విక్రయ ముఠా వెనుక అదృశ్యశక్తులు తప్పని సరిగా ఉండి ఉంటాయని, గుట్టు బయటకు రావాలంటే, విచారణను ప్రత్యేక సిట్ లేదా, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ పేర్కొంటూ, ఈ వ్యవహరంలో మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకోవాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగినప్పుడే, ఈ ముఠా వెనుక ఉన్న శక్తులు గుట్ట రట్టు అవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment