డ్రగ్స్ మత్తులో జంట మృతి.. తిండిలేక చిన్నారి!
అమెరికాలో ఘోరం జరిగింది. డ్రగ్స్ ఓవర్డోస్ కావడంతో యువ దంపతులు మరణించగా, నాలుగు రోజుల తర్వాత వాళ్ల చిన్నారి కూతురు తిండిలేక చనిపోయింది. ఐదు నెలల వయసున్న సమ్మర్ చాంబర్స్ అనే ఈ చిన్నారి డీహైడ్రేషన్, తిండి లేక మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు జాసన్ చాంబర్స్ (27), చెల్సియా కార్డారో (19)లతో పాటు చిన్నారి సమ్మర్ మృతదేహాలు పిట్స్బర్గ్ నగరానికి 60 మైళ్ల దూరంలోని జాన్స్టౌన్ సమీపంలో ఉన్న వాళ్ల ఇంట్లో పడి కనిపించాయి.
వాళ్ల ఇంట్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. దంపతులిద్దరూ చాలా ఎక్కువ మొత్తంలో హెరాయిన్ తీసుకున్నారని, కొద్ది నిమషాల తేడాలోనే ఇద్దరూ మరణించి ఉంటారని చెప్పారు. వాళ్లు మరణించి దాదాపు వారం అయ్యిందన్నారు. చాబర్స్ ఆ ఇంట్లోని మొదటి అంతస్తులో మరణించి పడి ఉండగా, కార్డారో రెండో ఫ్లోర్లోని బాత్రూంలో పడి ఉంది. వాళ్ల కూతురు మృతదేహం రెండో ఫ్లోర్లోని బెడ్రూంలో కనిపించింది. ఇంట్లో డ్రగ్స్ ఓవర్డోస్ అయి మరణించిన ఘటనలు తరచు అమెరికాలో వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా నార్త్ కరొలినా, ఓహియో, పెన్సల్వేనియా రాష్ట్రాల్లో డ్రగ్స్ కారణంగా సంభవిస్తున్న మరణాలు 2014, 2015 సంవత్సరాల్లో ఎక్కువగానే ఉన్నాయి. ఈ దంపతులు కొంత కాలం క్రితమే న్యూయార్క్ నుంచి పెన్సల్వేనియాకు వెళ్లినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.