బాల్ మిత్రులు
వారిద్దరూ బాల్యమిత్రులే కాదు, ‘బాల్’ మిత్రులు కూడా. ఇద్దరిదీ నిరుపేద నేపథ్యమే. బడిలో కలసి చదువుకున్నారు. ఆటలాడుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఎదిగే వయసులో ఫుట్‌బాల్‌ను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఏకంగా ‘ఫిఫా’ స్లమ్ సాకర్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో చోటు సాధించారు. తారిఖ్ చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆయన మరణంతో అక్క, అన్నలతో కలసి టోలిచౌకిలోని అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాడు. తమ్ముడు, చెల్లి .. పాతబస్తీలోనే అమ్మ జహెరబాను బేగం వద్దే ఉంటున్నారు. ఆమె టైలరింగ్ చేస్తూ బతుకుబండిని నెట్టుకొస్తోంది. అమ్మమ్మ ఇంటి వద్ద ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు తారిఖ్ చదువు ఇబ్బందిగానే సాగింది. అమ్మమ్మ ఇళ్లలో పనులు చేసి సంపాదించేది.
ఆమె సంపాదనతోనే తారిఖ్ చదువు ముందుకు సాగింది. ఇక సిమర్‌ప్రీత్ తండ్రి స్కూటర్ స్పేర్పార్ట్స దుకాణంలో ఉద్యోగి. చాలీచాలని సంపాదన. ఆర్థికంగా ఎలాంటి ఆసరా లేకున్నా సిమర్‌ప్రీత్.. స్కాలర్‌షిప్‌తో చదువు కొనసాగించాడు. తారిఖ్, సిమర్‌లు ఆరో తరగతి నుంచే మిత్రులు. ఇంటర్ చదువుతుండగా, మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స కోచింగ్ ఫౌండేషన్ సహకారంతో ‘అవేక్’ ఫౌండేషన్ మురికివాడల్లోని విద్యార్థులతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడించారు. వారిలో తారిఖ్, సిమర్‌లు అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. వారి ఆటకు ఫిదా అయిన కోచ్ మహమ్మద్ సలేద్.. వారికి శిక్షణ ఇచ్చారు.
కళాశాల కాగానే మైదానానికి...
తారిఖ్ షాదాన్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సిమర్‌ప్రీత్ ఏవీ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల కాగానే ‘బాల్’మిత్రులిద్దరూ నేరుగా మైదానానికి చేరుకుంటారు. మూడు నాలుగు గంటలు ఏకదీక్షతో సాధన చేస్తారు. వీరిద్దరూ మిడ్‌ఫీల్డర్లే! ఇటీవల నాగపూర్‌లో జరిగిన ఆలిండియా స్లమ్ సాకర్ టోర్నీలో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ జట్టును రన్నరప్‌గా నిలపడంలో తారిఖ్, సిమర్‌లు కీలక పాత్ర పోషించారు. తమ ఆటతీరుతో అక్టోబర్‌లో చిలీలో నిర్వహించనున్న ‘ఫిఫా’ స్లమ్ సాకర్ టోర్నీకి ఎంపికయ్యారు.
- వాంకె శ్రీనివాస్