మిర్చి విత్తనాల అవినీతిలో మంత్రికి వాటా
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట టౌన్: వ్యవసాయ శాఖ మంత్రికి వాటా ఉండడంతోనే అధిక ధరలకు మిర్చి విత్తనాల విక్రయాలు కొనసాగాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నెస్పీ కెనాల్స్ కార్యాలయం వద్ద కుడి కాల్వకు సాగర్ జలాల విడుదల కోరుతూ ధర్నా నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో సైతం మిర్చి విత్తనాలు కిలో లక్ష రూపాయలకు విక్రయాలు జరిగాయన్నారు. విత్తన కంపెనీల నుంచి అందిన వాటాల కారణంగానే అధిక ధరలను, కల్తీలను నియంత్రించలేక పోయారని ఆరోపించారు. దీంతో కల్తీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించి పంటలు పండక రైతులు దారుణంగా నష్టపోయారని చెప్పారు. విత్తన చట్టంలోని లోపాల కారణంగా చర్యలు తీసుకోలేకపోతున్నామని మంత్రి ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ మాటలు ఎవరిని మోసం చేసేందుకు చెబుతున్నారో తెలపాలని ప్రశ్నించారు. వ్యవసాయ అధికారులు ప్రతి ఏడాది తనిఖీలు నిర్వహించి «ధవీకరించాకే మార్కెట్లోకి విత్తనాలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయాక నకిలీలు విక్రయిస్తే పీడీ యాక్టు ప్రయోగిస్తామని చెప్పడం రైతులను మభ్యపెట్టడానికేనని విమర్శించారు.