'చింగ్ చాంగ్' అన్నందుకు జాబ్ ఊడింది!
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్కడ జాతి విద్వేష ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా న్యూయార్క్‌లో అలాంటి ఘటన చోటుచేసుకుంది. జాత్యహంకారాన్ని ప్రదర్శించిన అమెరికన్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ వివరాలివి.. ఆసియాకు చెందిన వ్యక్తి మనహట్టన్ ఈస్ట్ విలేజ్‌లో కార్నర్‌స్టోన్ కేఫ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. అతడు తనకు కావలసిన ఐటమ్స్ ఆర్డర్ చేయగా.. రెస్టారెంట్ లోని ఓ వెయిటర్ కస్టమర్ పేరుకు బదులుగా 'చింగ్ చాంగ్' అని రాశాడు.
ఈ విషయాన్ని రెస్టారెంట్ మేనేజర్ రాక్కో దృష్టికి కస్టమర్ తీసుకెళ్లాడు. ఇది కచ్చితంగా జాతి విద్వేష చర్య అని వివరించి, తనకు అవమానం జరిగిందని వాపోయాడు. కస్టమర్‌ను అవమానించాడన్న కారణంగా వెయిటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు మేనేజర్ రాక్కో తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
అసలు వివాదమేంటి..
తన స్నేహితుడి కుటుంబం రెస్టారెంట్‌కు వెళ్లగా కస్టమర్ పేరుకు బదులుగా చింగ్ చాంగ్ అని రాశారని జిగ్గి చౌ అనే యువకుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. బిల్లు పేపర్‌పై చింగ్ చాంగ్ ఉన్నట్లు ఓ ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ జాతి విద్వేష చర్య విషయం వెలుగుచూసింది. దీనిపై స్పందించిన యాజమాన్యం వెయిటర్ చేసిన తప్పిదాన్ని గుర్తించి ఫేస్బుక్ ద్వారా క్షమాపణ చెప్పడంతో పాటు అతడిని జాబ్ నుంచి తొలగించినట్లు మేనేజర్ వివరించారు. సాధారణంగా చైనా భాషను, చైనీయులను గేలీ చేయడానికి చింగ్ చాంగ్ అనే పదాలు వాడతారన్న విషయం తెలిసిందే.