కిరికిరి
చొప్పదండి నియోజకవర్గాన్ని కరీంనగర్‌లోనే కొనసాగించాలి
సిరిసిల్లలో కలిపే ప్రతిపాదనలను నిరసిస్తూ ఆందోళనలు
సిద్దిపేట వద్దు.. కరీంనగరే ముద్దంటున్న హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాల ప్రజలు
హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి వరంగల్‌వైపు మొగ్గు
అధికారుల ప్రతిపాదనలపై ఆయా మండల ప్రజల మనోగతం
కరీంనగర్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై మండలాల వారీగా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేసి చొప్పదండి నియోజకవర్గాన్ని కలపాలనే ప్రతిపాదనపై అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమను కరీంనగర్‌లోనే కొనసాగించాలని చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో ఇప్పటికే ఆందోళన చేస్తుండగా... తాజాగా గ్రామాల వారీగా తీర్మానాలు చేసి పంపుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో కలపాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గంగాధర, రామడుగు ప్రజలు సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బొడిగె శోభ జోక్యంతో ప్రజలు ధర్నాను విరమించారు.
వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాల ప్రజలు సైతం సిరిసిల్లలో కలపడాన్ని నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మేడిపల్లి ప్రజలు గ్రామాల వారీగా తమ మనోగతాన్ని వెల్లడిస్తూ తీర్మానం చేసి అధికారులకు అందజేశారు. కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజలంతా దాదాపుగా తమను జగిత్యాల జిల్లాలోనే కలపాలని ప్రతిపాదిస్తున్నారు.
ఈ మేరకు గ్రామాల వారీగా తీర్మానాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలను వరంగల్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనకు అక్కడి ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైంది.
సోమవారం జరిగిన హుజూరాబాద్ నగర పంచాయతీ పాలకవర్గ సర్వసభ్య సమావేశానికి హాజరైన 15 మంది సభ్యుల్లో తొమ్మిది మంది వరంగల్‌లో కలపాలని ప్రతిపాదించగా, ఆరుగురు కరీంనగర్లో కొనసాగించాలని కోరారు. జమ్మికుంట మండలంలో 32 గ్రామాలుండగా... సోమవారం 26 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. వీటిలో వరంగల్ జిల్లాలో తమ గ్రామాలను కలపాలని 17, కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని తొమ్మిది తీర్మానాలు అధికారులకు అందాయి. వీణవంక మండల ప్రజలు తమను కరీంనగర్‌లోనే కొనసాగించాలని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా... కమలాపూర్ మండలంలో మెజారిటీ ప్రజలు వరంగల్‌లో కలపాలని కోరుతున్నారు.
హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాలను సిద్దిపేటలో కలపాలనే ప్రతిపాదనను ఆయా మండలాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ‘కరీంనగర్ జిల్లా కన్న తల్లిలాంటిది, అలాంటి జిల్లాను వదిలి సిద్దిపేటకు పోవడం మాకు ఇష్టం లేదు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి’ అని పేర్కొంటూ హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్మానం చేసి అధికారులకు పంపారు. ‘సిద్దిపేట వద్దు-కరీంనగరే ముద్దు’ అని పేర్కొంటూ బెజ్జంకిలో 29 గ్రామ పంచాయతీలకు 21 గ్రామాల ప్రజలు తీర్మానం చేసి అధికారులకు అందజేశారు.
సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్‌ను చేర్చే అంశంపై అధికారులు ఏకపక్షంగా ఫార్మట్ రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణ జరపడాన్ని అఖిలపక్ష నాయకులు తప్పుపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తప్పుడు ఫార్మట్‌తో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ప్రజాభిప్రాయ ఫార్మట్ పత్రాలను దహనం చేశారు. మరోవైపు తమను కరీంనగర్‌లోనే కొనసాగించాలని కోరుతూ చిగురుమండలానికి చెందిన 16 గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కొత్త మండలాలపై తకరారు
బోయినపల్లి మండలంలోని కొదురుపాకను కొత్త మండలంగా ఏర్పాటు చేయూలని పలువురు కొదురుపాక చౌరస్తాలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైటాయించడంతో బస్సుల రాక పోకలకు అంతరాయం కలిగింది. ‘మండలాన్ని మార్చినా అభ్యంతరం లేదు, కాని జిల్లాను మార్చుతే మాత్రం ఒప్పుకునేది లేదు’ అని పేర్కొంటూ ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట, అబ్బాపూర్ గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. మండలంలోని కమ్మరిఖాన్‌పేట, అబ్బాపూర్ గ్రామాలను జూలపల్లి మండలంలో విలీనం చేయుటకు ప్రభుత్వ అదేశాల మేరకు స్థానిక అదికారులు నివేదికలు పంపించిన విషయం విదితమే.
విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ రెండు గ్రామాలలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం గ్రామసభలు నిర్వహించి పైన పేర్కొన్న విధంగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తమ గ్రామాలను ధర్మారం నుంచి జూలపల్లి మండలంలో విలీనం చేసిన తమకు అభ్యంతరం లేదని కాని జిల్లా కేంద్రం కరీంనగర్‌లోనే ఉంచాలన్నారు. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంతో అనుబంధంగా ఉన్న తమను కొత్తగా ఏర్పాటయ్యే పలిమెల మండలంలో కలపకూడదని పేర్కొంటూ కనుకునూర్ గ్రామ ప్రజలు సోమవారం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో తేల్చిచెప్పారు.
పోటాపోటీగా రెవెన్యూ డివిజన్ పోరు...
రెండేళ్ల క్రితం నుంచి కోరుట్లను జిల్లా కేంద్రంగా మార్చాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు సాగుతున్నాయి. ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్రాలు, పోస్టుకార్డుల ఉద్యమాలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నెలరోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రంగా ఖరారు కావడంతో కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని కోరుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇరవై రోజులుగా ధర్నాలు చేసి పది రోజుల క్రితం కోరుట్ల బంద్ నిర్వహించారు.
సోమవారం నుంచి డివిజన్ సాధన సమితి అధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. మరోవైపు గతంలో పాత తాలుకాగా ఉన్న మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలంటూ అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్రాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. పది కిలోమీటర్ల దూరంలో పక్కపక్కనే ఉన్న కోరుట్ల-మెట్పల్లి పట్టణాల మధ్య రెవెన్యూ డివిజన్ కోసం పోరు సాగుతుండటం చర్చనీయంగా మారింది.