‘చుండూరు’పై సుప్రీంకు వెళతాం: బొజ్జా తారకం
హైదరాబాద్, న్యూస్‌లైన్: చుండూరు ఘటనపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆర్పీఐ నాయకుడు, చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టు ఇచ్చిన తీర్పు తమను కలచివేసిందని అన్నారు. చుండూరు తీర్పును దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50 ప్రజా సంఘాలు కలసి చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. చుండూరు ఘటన జరిగి 25 ఏళ్లు కావస్తోందని, కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు 8 మంది దళితులను అతి దారుణంగా హత్య చేశారని తెలిపారు.
రెండు శవాలను ముక్కలు చేసి, గోనెసంచిలో మూటకట్టి తుంగభద్ర కాలువలో పారేశారని, మొత్తం 53 మంది గాయపడ్డారని వివరించారు. ఈ మారణకాండ కళ్లెదుటే జరిగినా, పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ ఘటనలో 21 మందికి యావజ్జీవ, 53 మందికి రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధించారని, కొంతమందిని అయితే సాక్ష్యాలు లేవని వదిలేశారన్నారు. శిక్షపడిన వారిని ఇటీవలే హైకోర్టు ఏకపక్షంగా అన్ని సెక్షన్లను కొట్టివేసి వదిలివేయడం బాధాకరమన్నారు. దుండగులు దళితులను తరుముతుంటే వారి నుంచి తప్పించుకునేందుకు కాలువలో దూకిన వ్యక్తికి ఈత రాదన్న ఒక్క కారణం చూపుతూ మొత్తం కేసునే కొట్టివేయడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల మాట్లాడుతూ ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ఎవరికీ నమ్మకం కలిగించేలా లేదన్నారు. పీఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ హంతకులు నిర్దోషులైతే అసలు హంతకులెవరో కోర్టే చెప్పాలన్నారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఝాన్సీ, బత్తుల రాంప్రసాద్, కరుణ, శ్యామల, అనురాధ, డప్పు రమేష్, కంచర్ల మోహన్‌రావు, శేషు, నాగేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.