పాఠకాదరణే అతడికి అవార్డు
స్నేహం
డా. కేశవరెడ్డి రచనా యాత్ర ‘బానిసలు- భగవాను ఉవాచ’తో ప్రారంభమైంది. దళితుల దయనీయ జీవితాలపై, భూస్వామ్య పీడనలో నలిగిపోతున్న శూద్రులు అతిశూద్రుల జీవన సమరంపై ఎనిమిది నవలలు- ‘సిటీ బ్యూటిఫుల్’ మినహా- రచించిన ప్రత్యేకత ఆయనది. మొదటిసారి ‘ది ఇన్‌క్రెడిబిల్ గాడెస్’ (క్షుద్రదేవత) చదివిన తర్వాత నాకు కేశవరెడ్డి రచనల మీద, ఆయన వాడే చిత్తూరు యాస మీదా ఆసక్తి కలిగి ‘శ్మశానం దున్నేరు’, ‘చివరి గుడిసె’, ‘అతడు అడవిని జయించాడు’ చదివి, 1986కు పూర్వమే దక్కన్ క్రానికల్ ఆదివారం అనుబంధంలో ‘ది టేల్స్ ఆఫ్ డవున్ ట్రాడన్’ శీర్షికన వ్యాసం రాశాను.
తర్వాత కాలంలో ఆయనతో పరిచయం పెరిగింది. మొదటిసారి డిచ్పల్లిలోని విక్టోరియా ఆసుపత్రిలో కలుసుకున్నాను. నిజామాబాద్‌లో ఒక సాహిత్యసభకు వెళుతూ దళితకవి- జర్నలిస్టు సలంద్రతో పాటు ఆసుపత్రి ఆవరణలో గడిపాము. కుష్టు రోగులకు చికిత్స చేస్తూ అతి నిరాడంబరంగా రెండు గదుల పోర్షన్లో నివాసం ఉంటూ కనిపించారు. ఆయనతో లంచ్ చేసిన తర్వాత తెలుగు నవలా పరిణామం పై ఇంగ్లిష్ నవలల గురించి మా సంభాషణ సాగిపోయింది.
కేశవరెడ్డి నవల ‘రాముడున్నాడు- రాజ్జిం ఉండాది’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్‌గా వచ్చినప్పుడు వరసగా చదివాను. ఆ నవల నన్ను బాగా ఆకట్టుకుంది. గ్రామీణ పేద రైతాంగం పూట గడవని స్థితికి చేరుకుని నగరాలకు వలస పోతున్న నేపథ్యాన్ని ఆ నవల చూపిస్తుంది. దాని మీద నేను 1988 నాటి ఆంధ్రజ్యోతి వీక్లీలో వ్యాసం రాస్తే పురాణంగారు కేశవరెడ్డి ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టి ప్రచురించారు.
‘అతడు అడవిని జయించాడు’ నవల శిల్పపరంగా హెమింగ్వే ‘ది ఓల్డ్‌మేన్ అండ్ సీ’ని అనుకరించినా కథాకథనంలో- తాత్త్వికత, పాత్రచిత్రణలో కేశవరెడ్డి గాఢతను సాధించగలిగాడు. ఈ నవలను నేషనల్ బుక్ట్రస్ట్వారు పద్నాలుగు భారతీయ భాషల్లో అనువదించి ప్రచురించినప్పుడు దానికి నేను ముందుమాట రాశాను. అలాగే ‘ఇన్‌క్రెడిబిల్ గాడెస్’ మరాఠీలో అనువాదమై పుస్తకంగా వెలువడటంలో అనుసంధానకర్తగా వ్యవహరించాను. చివరిసారిగా తన ఆఖరి నవల ‘మునెమ్మ’ను ప్రత్యేకించి పంపిస్తే చదివి, నాకు నచ్చలేదని నా అభిప్రాయం రాసి ‘ఇలాంటి ఇతివృత్తంతో మీరేమి సాధించగలిగారు’ అని ప్రశ్నించాను. తిరిగి సమాధానం రాసి ఫోనులో కూడా మాట్లాడి ఆయన వాదన వినిపించారు.
అతి పేద దళితుల జీవితాల గురించి ఒక దళితేతర రచయితగా కేశవరెడ్డి తన సామాజిక స్ఫూర్తిని, ప్రతిభను నిరూపించుకున్నారు. ఏనాడూ సన్మానాల కోసం, అవార్డుల కోసం ఎగబడలేదు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు రాలేదు. జ్ఞానపీఠ్ అవార్డు కోసం అన్ని అర్హతలున్న రచయితగా కేశవరెడ్డి పేరును వివరాలతో పాటు సూచిస్తూ రెండు మూడుసార్లు నా వంతు ప్రపోజల్స్ పంపించాను. ఆయన మితభాషి. నెమ్మదిగా మాట్లాడుతూ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఎంతో సీరియస్ అంశాన్నైనా తేల్చేసేవాడు. అవార్డులను కూడా అలాగే చూసి ఉండవచ్చు. ఇప్పుడు ఆయన లేడు. నాకు మాత్రం ఆయనతో కలసి ఆయా సందర్భాలలో నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ సభలలో ఒకే వేదిక పై నుంచి ప్రసంగించిన జ్ఞాపకాలు మిగిలిపోయాయి.
- నిఖిలేశ్వర్ 9177881201