సిటీ ల్యాబ్స్ సిద్ధం! .
ఇక కేసుల దర్యాపు వేగవంతం
సైబర్, నేరాల విశ్లేషణ కోసం వినియోగం
సైబర్ ఠాణా, హాకా భవన్లో ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: నేర స్థలాల్లో లభించే, నేరాలకు సంబంధించిన ఆధారాలను విశ్లేషించేందుకు లాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు. నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన మేరకు సిటీ ల్యాబ్స్ పేరుతో అందుబాటులోకి వస్తున్న వీటిని దర్యాప్తులు వేగవంతం చేయడం, ‘అనుమానాస్పదాలను’ గుర్తించడం కోసం వినియోగించనున్నారు. క్రైమ్ ల్యాబ్‌కు సంబంధించిన ఉపకరణాలు, సైబర్ ల్యాబ్‌కు అవసరమైన టూల్స్, సాఫ్ట్వేర్స్ ఖరీదు చేయడానికి టెండర్లు ఆహ్వానించారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి ఇవి ప్రత్యామ్నాయం కావని అధికారులు స్పష్టం చేశారు.
నకిలీ నోట్లు, బోగస్ ధ్రువీకరణలు, దొంగ సంతకాలు తదితరాలపై నిత్యం అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. ఇతర విభాగాల కంటే సీసీఎస్‌కు వీటి తాకిడి ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా అనుమానాస్పద పత్రాలు (క్వశ్చన్డ్ డాక్యుమెంట్స్), సంతకాలను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపి, వారి నివేదిక అందిన తరవాతే నిందితులపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటోంది. ఇది కాలయాపనతో కూడినది కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో నిందితులు ‘ప్రత్యామ్నాయ మార్గాలు’ చూసుకోవడానికి, అజ్ఞాతంలోకి వెళ్లడానికీ అవకాశం ఏర్పడుతోంది.
డ్రగ్ కేసుల్లో ‘వీగిపోయే’ ముప్పు...
నగరంలో మాదకద్రవ్యాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల వారితో పాటు స్థానికులూ వివిధ రకాలైన డ్రగ్స్‌తో పట్టుబడుతున్నారు. చెరస్, గంజాయి వంటి కొన్నింటిని తప్ప మిగతా వాటిని చూసి గుర్తించడం పోలీసులకు సాధ్యం కాదు. ఆ సందర్భంలో నిందితులు చెప్పిన దానిపై ఆధారపడాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా గతంలో నగర పోలీసు విభాగం స్పాట్ టెస్టింగ్ కిట్స్ ఖరీదు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. కొన్ని రకాలైన మాదకద్రవ్యాలు ఏమిటో తెలుసుకోవడానికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఫోరెన్సిక్ ల్యాబ్‌లపై ఆధారపడటంతో జాప్యం జరుగుతోంది. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం ప్రకారం నమోదు చేసే ఈ కేసుల్లో ఎలాంటి పొరపాట్లకూ ఆస్కారం ఉండకూడదు. పట్టుబడినప్పు పోలీసులు రాసిన వివరాలు, ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో ఉన్న అంశాల మధ్య ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా కోర్టుల్లో కేసులు వీగిపోయే ప్రమాదం ఉంది.
ఆదమరిస్తే ‘సైబర్ క్రాష్’...
ఇటీవల సిటీలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు దర్యాప్తు అధికారులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఫిర్యాదు అందినప్పటి నుంచీ కేసు దర్యాప్తులో అడుగడుగునా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆన్లైన్, సోషల్ మీడియాలతో పాటు పెన్‌డ్రైవ్స్, హార్డ్‌డిస్క్‌లు తదితరాలనూ విశ్లేషిస్తారు. వీటిలో లభించిన ఆధారాలను బట్టే నిందితుల్ని గుర్తించడం, కేసు తీవ్రతను తెలుసుకోవడం సాధ్యమవుతాయి. కొన్ని సందర్భాల్లో పాక్షికంగా దెబ్బతిన్న సీడీలు, డీవీడీలతో పాటు ఇతరాల నుంచీ సమాచారం సంగ్రహించాల్సి ఉంటుంది. సెల్ఫోన్లు, ఈ-మెయిల్స్ నుంచి డిలీట్ చేసిన డేటాను సేకరించాలి. వీటిలో ఏమాత్రం పొరపాటు జరిగినా... సాంకేతిక ఆధారాలు నాశనమై దర్యాప్తుకే ఆటంకం కలుగుతుంది.
రెండూ రెండు చోట్ల ఏర్పాటు...
ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా సిటీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ ల్యాబ్‌ను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో, క్రైమ్ ల్యాబ్‌ను సీసీఎస్ సమీపంలోని హాకా భవన్లో అద్దెకు తీసుకున్న ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్నాయి. నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) నేతృత్వంలో ఇవి పని చేస్తాయి. వీటిలో వినియోగించే పరికరాలు, సాఫ్ట్వేర్స్ ఖరీదు చేయడానికి టెండర్లు పిలిచారు. ఈ ల్యాబ్స్‌లో పని చేయడానికి నగర పోలీసు విభాగంలోని సిబ్బందినే ఎంపిక చేసి, అవసరమైన శిక్షణ ఇప్పించనున్నారు. ఈ ల్యాబ్స్ ఆధారాల స్వరూపం చెడిపోకుండా విశ్లేషించి, దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉపకరించనున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలతో వీటికి సంబంధం లేదని, న్యాయస్థానంలో అవి కచ్చితమని అధికారులు తెలిపారు.