నిజామ్, భవాన్స్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ
హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో నిజామ్ బాస్కెట్‌బాల్ అకాడమీ (ఎన్బీఏ), భవాన్స్ జూనియర్ కాలేజి జట్లు శనివారం జరిగిన లీగ్ మ్యాచుల్లో విజయం సాధించాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో ఎన్బీఏ ‘ఎ’ జట్టు 54-38తో జోసెఫియన్ శాంతినగర్ క్లబ్‌పై గెలుపొందింది. ఎన్బీఏ తరఫున క్రిస్ విరేశ్ (16), శామ్సన్ (13) రాణించారు. జోసెఫియన్ జట్టులో ప్రకాశ్ 12, అనికేశ్ 10 పాయింట్లు సాధించారు. భవాన్స్ 40-26తో వెస్లీ గిల్డ్ జట్టును కంగుతినిపించింది.
భవాన్స్ ఆటగాళ్లు శ్రీరామ్ 15, బాలశౌరి 11 పాయింట్లు చేయగా, వెస్లీ తరఫున గౌరవ్ 6, ప్రసాద్ 5 పాయింట్లు చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో హాస్టలర్స్ 39-23తో నెహ్రూనగర్ ప్లేగ్రౌండ్‌పై నెగ్గింది. హాస్టలర్స్ విజయంలో అవినాశ్ (12), ప్రతీక్ (10) కీలకపాత్ర పోషించారు. నెహ్రూనగర్ జట్టులో శాండి 12, విపుల్ 6 పాయింట్లు సాధించారు. ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్ 44-27తో సిటీ యూత్‌ను ఓడించింది. రెడ్డి హాస్టల్ జట్టులో అభిజిత్ (16) ఆకట్టుకున్నాడు. యూత్ జట్టు తరఫున జోగిందర్ 10 పాయింట్లు చేశాడు.