రుణాల కల్పనలో బ్యాంకులు చొరవ చూపాలి
రైతులు, చిన్న వ్యాపారులు, వృత్తికారులను ఆదుకోవాలి
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ :
చిన్నతరహా వ్యాపారాలు, వృత్తులకు రుణాల కల్పనకు బ్యాంకులు చొరవతో ముందుకు రావాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ బ్యాంకర్లను కోరారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాలులో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, బ్యాంకుల అధికారులతో జిల్లాస్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సలే్టటీవ్ కమిటీ సమావేశాలు కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతులకు రూ.4251 కోట్లు పంట రుణాలు కల్పించే లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ రూ.3922 కోట్ల రుణాలు కల్పించి 92 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. జిల్లాలో లక్షా 30వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయగా 45,581 మంది రైతులకు 97 కోట్లు మేరకు పంట రుణాలు కల్పించారన్నారు. కౌలు రైతులకు రుణాల కల్పన మరింత సరళం చేస్తూ వ్యవసాయ శాఖ ద్వారా సాగు ధృవీకరణ పత్రాల జారీని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జిల్లాలో సాగు చేపట్టిన కౌలు రైతుందరికీ ఈ పత్రాలు జారీ చేసి రుణాలు అందేట్టు చూడాలని, ఈ నెలాఖరులోగా మరో రూ.30 కోట్లు అందించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయ బృందాలకు ఈ ఏడాది రూ.1346 కోట్ల రుణాల కల్పన లక్ష్యానికి గాను ఇప్పటి వరకూ రూ.229 కోట్ల రుణాలు అందించామన్నారు. జిల్లాలో చిన్న వ్యాపారస్తులు, వృత్తికారులు అధిక వడ్డీ రుణాల ఊబిలో చిక్కుకోకుండా వర్కింగ్ కాపిటిల్ కింద రూ.5 వేల నుంచి రూ.15వేలు డీఆర్ఐ రుణాల కల్పనలో బ్యాంకులు చొరవ చూపాలని, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి బ్యాంకు బ్రాంచి నెలకు కనీసం 100 రుణాలు కల్పించాలన్నారు. చంద్రన్న బీమా పథకం కింద జిల్లాలో నమోదైన 17 లక్షల మందిలో సుమారు 3 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు అక్టోబరు 2లోగా తెరవాల్సి ఉన్నందున బ్యాంకులు, డీఆర్డీఏ అధికారులు సమన్వయంతో సకాలంలో అకౌంట్లు కల్పించి లబ్ధిదారులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ఆర్.భాస్కరరావు, ఎల్డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, నాబార్డు ఏజీఎం కేవీఎస్ ప్రసాద్, ఆర్బీఐ ఏజీఎం సీబీ గణేష్, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, వ్యవసాయశాఖ జేడీ కేవీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.