అందరూ భాగస్వాములు కావాలి
మంత్రి, కలెక్టర్ పల్లెనిద్ర
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, జిల్లా కలెక్టర్ జగన్మోహన్ అన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని వాఘాపూర్, ఖండాల, చిచ్ధరి ఖానాపూర్లో నిర్వహించిన పల్లెనిద్రలో పాల్గొన్నారు. అంకోలి గ్రామ పంచాయతీ పరిధి కొలాంగూడలో కలెక్టర్ జగన్మోహన్ పల్లెనిద్రలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రామన్న మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై, ప్రణాళికలు రూపొందించి దశల వారీగా పరిష్కరించనున్నట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ జగన్మోహన్ అంకోలి గ్రామంలో వార్డు వార్డుకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారం కానున్నాయని తెలిపారు.
గ్రామాల్లో ప్రజలు మల, మూత్రవిసర్జన బహిరంగా ప్రదేశాల్లో చేయకుండా ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.12వేలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత తప్పని సరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.