కొలంబియా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దాదాపు 26 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా కొలంబియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ.. కొలంబియా కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించినట్లు డీఆర్ఎల్ వెల్లడించింది. కొలంబియాలోని క్యాన్సర్ పేషంట్లకు అత్యుత్తమ నాణ్యతతో, అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రమణ తెలిపారు.
విలువ పరంగా డీఆర్ఎల్ అమెరికాలో జనరిక్ ఆంకాలజీ ఇంజెక్టబుల్ విభాగంలో రెండో అతి పెద్ద సంస్థగాను, భారత్లో జనరిక్ ఆంకాలజీ కంపెనీల్లో అగ్రస్థానంలోనూ ఉంది. కంపెనీకి 20 పైగా తయారీ కేంద్రాలు, 20వేల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. భారత్, అమెరికా, రష్యా తదితర దేశాలు కీలక మార్కెట్లుగా ఉన్నాయి.