'సుధీంద్ర 100మంది కసబ్లతో సమానం!'
ముంబై: ప్రముఖ కాలమిస్టు, బీజేపీ నేత ఎల్కే అద్వానీ మాజీ రాజకీయ సలహాదారు సుధీంద్ర కులకర్ణిపై శివసేన తన దాడిని మానుకోవడం లేదు. ఇప్పటికే ఆయనపై నల్లరంగు చల్లి అమానుషంగా వ్యవహరించిన ఆ పార్టీ తాజాగా సుధీంద్ర కులకర్ణిని ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్‌తో పోల్చింది. 'కులకర్ణిలాంటి వాళ్లు ఇక్కడే ఉన్నప్పుడు పాకిస్థాన్‌కు కసబ్ లాంటి వాళ్లను పంపాల్సిన అవసరమే ఉండదు. 100 మంది కసబ్‌లకు సమానమైన నష్టాన్ని కులకర్ణి చేయగలరు' అంటూ శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో విరుచుకుపడింది.
పాకిస్థాన్ మాజీ విదేశాంగమంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణకు నిర్వాహకుడిగా ఉన్న సుధీంద్ర కులకర్ణిపై సోమవారం నల్లరంగు పోసి శివసేన నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు నిరాకరించడంతో శివసేన ఈ చర్యకు ఒడిగట్టింది. అయినప్పటికీ సుధీంద్ర వెనుకడుగు వేయకుండా కసూరి రాసిన 'నైదర్ ఏ హాక్ నర్ ఏ డోవ్: ఆన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్థాన్ ఫారెన్ పాలసీ' పుస్తకాన్ని సోమవారం సాయంత్రం ముంబైలో ఆవిష్కరించారు.