జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు
అంతర్జాతీయ కామన్వెల్త్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కామన్వెల్త్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు ఏడు పతకాలు సాధించారు. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు ఒక కాంస్య పతకం ఉన్నాయి. పెర్త్ (ఆస్ట్రేలియా)లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో ఆశిష్ కుమార్ మెరుపు విన్యాసంతో రెండేసి చొప్పున స్వర్ణ, రజత పతకాలతో పాటు టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుపొందాడు. కామన్వెల్త్ గేమ్స్ (2010), ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆశిష్ ఈ ఈవెంట్లో పురుషుల ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్ విభాగాల్లో ఒక్కో స్వర్ణం గెలిచాడు. మరో స్వర్ణాన్ని దీపా కర్మాకర్ మహిళల వాల్ట్ విభాగంలో చేజిక్కించుకుంది.
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ప్యారలల్ బార్స్‌లో ఆశిష్ రెండు రజతాల్ని సాధించగా, దీప మహిళల బాలెన్సింగ్ బీమ్ ఈవెంట్లో రజతం దక్కించుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో ఆశిష్, రాకేశ్ పాత్ర, అభిజిత్ షిండే, సంజయ్ బర్మన్, చందన్ పాఠక్‌ల బృందం కాంస్య పతకం సాధించింది. మూడేళ్ల క్రితం భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ)లో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో కేంద్ర క్రీడాశాఖ జీఎఫ్‌ఐకి గుర్తింపు రద్దు చేసింది. దీంతో 2011 నుంచి ఎలాంటి జిమ్నాస్టిక్స్ పోటీలు కూడా జరగట్లేదు. అయినా భారత క్రీడాకారులు విదేశీ గడ్డపై సత్తాచాటడం విశేషం.