67ఏళ్ళ జైలు జీవనాన్ని గడిపి, ప్రాణాలు విడిచింది!
ప్రకృతి వనాల మధ్య, పచ్చని చెట్లతో దట్టంగా ఉండే అడవుల్లో గుంపులతోపాటు ఉండాల్సిన ఏనుగు.. తన సుదీర్ఘ జీవనాన్ని కాంక్రీట్ జంగిల్ లో ఒంటరిగా గడిపి, చివరికి ప్రాణాలు విడిచింది. జపాన్ లోని ఇనోకాషిరా పార్క్ జ్యూలో బందీగా 67 ఏళ్ళపాటు ఒంటరి జీవితం గడిపిన హనాకో విముక్తికోసం... అంతర్జాతీయ ప్రచారం జరిగినా లాభం లేకపోయింది. చివరికి 69 ఏళ్ళ వృద్ధాప్యంతోపాటు, తీరని ఒంటరితనం ఆ ఏనుగు ప్రాణాలు తీసింది.
'వరల్డ్స్ లోన్లీయెస్ట్ ఎలిఫెంట్' గా పేరొందిన 69 ఏళ్ళ ఏనుగు 'హనాకో' జపాన్ జ్యూలో మరణించింది. ఏడాది క్రితం ఓ టూరిస్టు తీసిన వీడియోను వీక్షించిన జనం ... దాన్నిబంధనాలనుంచి విముక్తురాలిని చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. వీడియోలో ఎంతో విచార వదనంతో కనిపించిన ఏనుగును ఎలాగైనా రక్షించాలనుకున్నారు. కాంక్రీట్ జైల్లో మగ్గిపోతున్న జంతువును ప్రకృతి వనాల మధ్య విడిచిపెట్టాలంటూ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. హనాకో ఉన్న ఎన్ క్లోజర్ ఓ రాతి జైలులా , అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శించే జ్యూలా ఉందంటూ టూరిస్ట్ ఉలారా నగగావా ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆ ఒంటరి ఏనుగును విశాల ప్రపంచంలోకి వదిలెయ్యాలంటూ అంతర్జాతీయంగా ఓ పిటిషన్ కూడ దాఖలు చేసింది. అయితే జ్యూ సిబ్బంది మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సుదీర్ఘ జీవితం ఒంటరిగానే గడిపిన ఆ ఏనుగును తిరిగి ఇతర గుంపులు తమతో కలుపుకోలేవని, పైగా ఇబ్బందులకు గురి చేస్తాయని తెలిపారు. దాంతో సుమారు 500,000 మంది సంతకాలు చేసి పిటిషన్ వేసినా...ఉపయోగం లేకపోయింది. అప్పటికే హనాకో వయసు కూడ మీరిపోవడంతో చేసేది లేకపోయింది.
హనాకో ఉదయం సమయంలో ఓ పక్కకు తిరిగి పడుకోవడం చూశామని, అనుమానం వచ్చి అప్పట్నుంచీ దాని ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఎంతో ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయిందని, మధ్యాహ్నం సమయానికి అది మరణించిందని జ్యూ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండేళ్ళ వయసులో ఒంటరిగా థాయిల్యాండ్ అడవిలో నివసిస్తున్న ఏనుగు పిల్లను (హనాకో) అధికారులు అప్పట్లో జ్యూకి బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచీ సుమారు ఆరు దశాబ్దాలకు పైగానే కొద్దిపాటి పచ్చదనంతో కూడిన కాంక్రీట్ ఎన్ క్లోజర్ లోఒంటరిగానే జీవనం గడిపింది. హనాకో మరణవార్త సోషల్ మీడియాలో సంచలనం రేపింది. విషాద వార్తను చూసిన జనం నివాళులర్పించారు. వందలకొద్దీ షేర్లు చేశారు. ఏనుగును బంధించిన జపాన్ జ్యూ సిబ్బంది తీరుపై ఇబ్బడి ముబ్బడిగా ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ విమర్శలు గుప్పించారు.