శ్రీమన్నారాయణ అమరత్వానికి రెండు దశాబ్దాలు
విప్లవ వీరుడి యాదిలో జనగామ పోరు గడ్డ
ఎర్రగొల్లపహాడ్‌లో 2005లో ఎత్తరుున స్థూప నిర్మాణం, ఆవిష్కరణ
విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్‌లో చేరిక
అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో బాధ్యతల నిర్వహణ
జనగామ రూరల్ : ఓ విప్లవ వీరుడి చరిత్రను తరతరాలపాటు ప్రజలు గుర్తుంచుకోవాలంటే ఆయన వందేళ్లు జీవించాల్సిన పనిలేదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అతను ఎంచుకున్న లక్ష్యం, నిర్ధేశించుకున్న మార్గంలో పయనిం చేందుకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన వారు చరిత్ర పుటల్లో ప్రజల హృదయాల్లో చిరకాలం చెరగని ముద్ర వేసుకుం టారు. ఆ స్థానాన్ని పదిలం చేసుకున్న వారిలో జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన కామ్రేడ్ బైరగోని శ్రీమన్నారాయణ అలియాస్ అంజన్న ఒకరు. మాములు రైతు కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్య చదివి, భూస్వాముల, పెత్తందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సమసమాజ స్థాపనే లక్ష్యంగా స్థాపించిన పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరి అతితక్కువ కాలంలో జిల్లా నాయకుడిగా, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ అమరుడై నేటికి(మార్చి 2 నాటికి) సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యాయి.
నూనుగు మీసాల వయస్సులోనే పీపుల్స్‌వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన శ్రీమన్నారాయణ అలియాస్ అంజన్నది కీలక పాత్ర. ఆయన ఉద్యమంలో పని చేసిన కాలం లో భూస్వాముల గుండెల్లో రైళ్లు పరుగెత్తించా రు. పేదలకు భూపంపిణీ చేసేందుకు ఆయన చేసిన కృషిని జిల్లా ప్రజలు నేటికి మరిచి పోరు. 1986లో విద్యార్థి దశలోనే ఉద్యమబాట పట్టిన శ్రీమన్నారాయణ అంచెలంచెలుగా ఎదిగారు. పీపుల్స్‌వార్‌లో జిల్లా నాయకుడిగా, విప్లవ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేగాక నెక్కొండ, చేర్యాల, పాలకుర్తి దళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దివంగత ఎన్డీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తి వేయగా జనగామలోని ప్రెస్టన్ కళాశాలలో 1994లో శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు లక్షలాదిగా ప్రజలు హాజరవడం అప్పటికీ ఇప్పటికీ ఓ పెద్ద సంచలనం. 1995 మే 2న జనగామ మండలం యశ్వాంతాపూర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో శ్రీమాన్నారాయణ అసువులు బాసారు.
స్థూపం నిర్మాణం.. ఆవిష్కరణ
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మావోయిస్టులపై నిషేధం సడలించిన క్రమంలో శ్రీమన్నారాయణ తల్లి రామక్క(ప్రస్తుతం ఆమె లేరు) తన సొంత ఖర్చులతో స్థూపం నిర్మించింది. ఈ స్థూపం ఆవిష్కరణకు విప్లవ కవులు, రచయితలు వరవరరావు, కళ్యాణరావు, మా భూమి సంధ్య హాజరయ్యూరు.