Cooperative Bank
-
బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!
దేశీయ బ్యాంకింగ్ సేవలందించే టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది. ఈమేరకు దాడి జరిగిన సర్వర్‌ను డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై బ్యాంకులు, ఆర్బీఐ మాత్రం ఇంకా స్పందించలేదు.ఎన్పీసీఐ విడుదల చేసిన పబ్లిక్ అడ్వైజరీ ప్రకారం..సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ అనే ముంబయికి చెందిన సంస్థ ప్రాంతీయ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలందిస్తోంది. ఈ కంపెనీ టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు రోజుల కిందట ఈ సంస్థ సర్వీసులపై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. తదుపరి చెల్లింపులపై ఎలాంటి ప్రభావం పడకుండా వెంటనే గుర్తించి రిటైల్ పేమెంట్ సిస్టమ్‌తో డిస్కనెక్ట్ చేశారు. దాంతో కొంతమంది వినియోగదారులు చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సీ-ఎడ్జ్ టెక్నాలజీ అందిస్తున్న సర్వర్‌తో అనుసంధానం చేసిన యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్పీసీఐ చెల్లింపులు సేవలను కొంత సమయంపాటు యాక్సెస్ చేయలేరు. ఇప్పటికే బ్యాంకింగ్ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!Regarding interruption in retail payments pic.twitter.com/Ve32ac7WpQ— NPCI (@NPCI_NPCI) July 31, 2024 -
రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ!
సాక్షి, కామారెడ్డి/లింగంపేట: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు రికవరీ కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. తనఖా పెట్టిన భూములను వేలం వేస్తామంటూ ఆ భూముల్లో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలంలోని పోల్కంపేట, పర్మల్ల, శెట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల రైతులు 2010 ప్రాంతంలో పెద్ద మొత్తంలో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నారు. కొందరు కొన్ని వాయిదాలు చెల్లించి మానుకోగా, మరికొందరు అసలే చెల్లించలేదు. కొందరు మాత్రం పూర్తిగా చెల్లించారు. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు కొన్నేళ్లుగా రైతులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులిచ్చారు. భూములను వేలం వేస్తామని హెచ్చరించారు. అయితే అప్పులు తీసుకుని పది పదిహేనేళ్లు కావడంతో వడ్డీలు పెరిగిపోయాయి. అప్పట్లో రూ.5 లక్షలు అప్పు తీసుకుంటే ఇప్పుడది రూ.15 లక్షలు దాటింది. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం రైతులకు భారంగా మారింది. వడ్డీ తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా అప్పులు చెల్లించడం లేదంటూ బ్యాంకర్లు ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు. పోల్కంపేటలో ఓ రైతు పొలంలో భూమిని వేలం వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. వడ్డీలు తగ్గిస్తే అప్పు తిరిగి చెల్లిస్తామని పేర్కొంటున్నారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నాం బ్యాంకుకు భూమి తనఖా పెట్టి అప్పు తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోవడమే గాక, ఆ భూమిని అమ్ముకోవడం చట్టరీత్యా నేరం. బ్యాంకు తనఖాలో ఉన్న భూమిని ఎలా అమ్ముకుంటారు? ఆ భూమిపై బ్యాంకుకే హక్కు ఉంటుంది. లింగంపేట మండలంలో దాదాపు 7 వందల మంది రైతులు దీర్ఘకాలిక రుణాలు తీ సుకున్నారు. వారిలో చాలామంది అప్పులు తి రిగి చెల్లించలేదు. సహకార చట్టం ప్రకారం వా రందరికీ నోటీసులిచ్చాం. వారి ఆస్తులను జప్తు చేయడం, లేదా వేలం వేయడం జరుగుతుంది. – కుమారస్వామి, బ్రాంచి మేనేజర్, ఎన్డీసీసీబీ, లింగంపేట -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు
'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. కానీ ఇటీవల ఆర్బీఐ 'అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు'పై గట్టి చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్యాంకుల పనితీరుపై నిఘాపెట్టిన ఆర్బీఐ.. సరైన పాలన లేని కారణంగా, ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద ఏ మాత్రం ఉండదని వెల్లడించింది. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమలులో ఉంటాయి. కానీ బ్యాంకింగ్ కార్యకలాపాల మీద అటువంటి ఆంక్షలు విధించలేదు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ 'సత్య ప్రకాష్ పాఠక్'ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల మీద ఎటువంటి ఆంక్షలు లేకపోవడం వల్ల రోజువారీ ట్రాన్సక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కాబట్టి బ్యాంక్ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 56, సెక్షన్ 36 AAA కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు అందించేందుకు ఆర్బీఐ ఒక కమిటీని నియమించింది. ఇందులో వెంకటేష్ హెగ్డే, ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్, మహేంద్ర ఛాజెడ్, సుహాస్ గోఖలే వంటి బ్యాంక్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సందీప్ ఘండాత్ మాట్లాడుతూ.. మా బ్యాంక్‌కు గత రెండు సంవత్సరాల నుంచి ఆర్బీఐ నియమించిన అదనపు డైరెక్టర్ (రాజేంద్ర కుమార్) ఉన్నారని, ఆయన సెంట్రల్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా ఆయనతో 29న బ్యాంక్ అధికారుల సమావేశం ఉంది, అంతలోపే ఆర్బీఐ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే? గత రెండు సంవత్సరాల్లో సహకార బ్యాంకు మొండి బకాయిలను రూ.1,550 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు తగ్గించగలిగిందని, బ్యాంకు మెరుగుపడుతున్న సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుకు 109 బ్రాంచులు, 113 ఏటీఎంలు ఉన్నాయి. 2022 మార్చి నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.10,838.07 కోట్లు కాగా.. రుణాల విలువ రూ. 6,654.37 కోట్లుగా ఉన్నాయి. ఈ బ్యాంక్ మహారాష్ట్రలో ,మాత్రమే కాకుండా కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా సేవలను అందిస్తోంది. -
నేతన్నకు నగదు పరపతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తంతోపాటు అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం నగదు పరపతి కూడా సమకూరుస్తోంది. మగ్గాల ఆధునికీకరణతోపాటు చేనేత సామగ్రి కొనుగోలు, మార్కెటింగ్‌కు అనేక రూపాల్లో ఊతమిస్తోంది. చేనేత కుటుంబాలకు భరోసా ఇచ్చేలా వరుసగా ఐదు విడతల్లో నేతన్న నేస్తం ద్వారా రూ.969.77 కోట్లు అందించిన సంగతి తెలిసిందే. సొంత మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఐదు విడతల్లో రూ.1.20 లక్షలు అందించింది. ఈ పథకం అమలు తర్వాత చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ జీవితాలను మెరుగుపర్చుకున్నారు. దీంతోపాటు నేతన్నల పెన్షన్ కోసం రూ.1,396.45 కోట్లు ఇచ్చింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్, ఆప్కోకు సాయం వంటి మూడు పథకాల ద్వారానే నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.2,835.06 కోట్లను వెచ్చించింది. గత ప్రభుత్వం నేతన్నల కోసం ఐదేళ్లలో కేవలం రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇవి కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందిస్తోంది. సహకార బ్యాంకుల ద్వారా రుణాలు వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం ప్రాథమిక చేనేతకారుల సహకార సంఘా(పీహెచ్డబ్ల్యూపీఎస్)లకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో 681 చేనేత సొసైటీలకు రూ.209.29 కోట్లు నగదు పరపతి (రుణాలు) అందించింది. -
ఖాతాదారుల సొమ్ము తమ సొంతానికి వాడుకున్నారు: వల్లభనేని వంశీ
-
సబ్బం హరి ఆస్తులు సీజ్!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నాయకుడు సబ్బం హరి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను సీజ్ చేసినట్లు సమాచారం. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం, వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు సమాచారం. విశాఖ మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న డెక్కన్ క్రానికల్ భవనాన్ని కోటక్ మహీంద్ర బ్యాంకు 2014లో రూ.17.80 కోట్లకు వేలం వేయగా సబ్బం హరి వేలంలో దాన్ని దక్కించుకున్నారు. ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్లు రుణం తీసుకున్నారు. వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డెక్కన్ క్రానికల్ యాజమాన్యం డెట్ రికవరీ అప్పిలేట్ అథారిటీలో కేసు వేసింది. అప్పిలేట్ అథారిటీ ఆ వేలాన్ని రద్దు చేసి, సబ్బం హరి డిపాజిట్ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై కోటక్ మహీంద్ర బ్యాంక్ అప్పీల్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉంది. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో అధికారులు సబ్బం హరికి 2018లోనే నోటీసులు జారీ చేశారు. 60 రోజుల్లో రుణం చెల్లించని పక్షంలో సీతమ్మధారలోని 1,622 చదరపు గజాల స్థలంలోని నివాసంతోపాటు మాధవధార వుడా లేఅవుట్లోని 444.44 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విష్ణు వైభవం గ్రూప్ హౌస్‌లోని అపార్ట్మెంట్, రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాంకు అధికారులు మాధవధార విష్ణు వైభవంలోని అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ నెల 12న సీతమ్మధారలో ఉన్న నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందించినట్లు తెలిసింది. -
అడ్డంగా దొరికిపోయిన టీడీపీ.. వీడియో వైరల్
సాక్షి, తిరుపతి: దొంగే దొంగ అన్న చందంగా తయారైంది తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు పరిస్థితి. టీడీపీ నేతలు ఉదయం నుంచి దొంగ ఓట్లు వేసి నిబంధనలకు తూట్లు పొడిచారు. అధికార వైఎస్సార్సీపీ పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతోంది అంటూనే.. టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. రిగ్గింగ్‌కు పాల్పడుతూ టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వీడియోలో టీడీపీ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థులకు ఏక పక్షంగా బ్యాలెట్ పేపర్‌పై దొంగ ఓట్లు వేస్తున్న వీడియో వీరి డ్రామాలకు అద్దం పడుతోంది. చదవండి: ఒక్కసారిగా మారిపోయిన సీన్.. అక్కడ ఎకరం కోటి రూపాయలపైనే.. -
అప్పు తీర్చే మార్గం కనిపించడంలేదు.. ఊరు విడిచి వెళ్లిపోతున్నా!
జోగిపేట(అందోల్): బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక, అధికారుల వేధింపులు తట్టుకోలేక, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పటాన్చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధి కంసాన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రైతు ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది. తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్ బ్యాంకులో రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు. ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది. అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు. రూ.1.42 లక్షలు చెల్లించాల్సి ఉంది కన్సాన్పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి మోటారు కొనుగోలు కోసం, బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకున్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.42 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తున్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. – రాజు, మేనేజర్ జోగిపేట డీసీసీబీ బ్రాంచ్ -
అనంతపురం అర్బన్ బ్యాంక్ 12 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు
-
ఆదిలాబాద్‌లో రైతులకు బ్యాంకర్ల వేధింపులు
-
యూనిటీ బ్యాంక్ ప్రారంభం
ముంబై: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. దీనితో రూ. 7,000 కోట్ల రుణ కుంభకోణంతో కూరుకుపోయిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్... రానున్న కాలంలో యూనిటీ బ్యాంక్‌లో విలీనం కావడానికి మార్గం సుగమం అయ్యింది. సెంట్రమ్ గ్రూప్, పేమెంట్స్ యాప్ భారత్‌పే 51:49 భాగస్వామ్యంతో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటయ్యింది. అక్టోబర్ 12న సంస్థ ఆర్బీఐ లైసెన్స్ పొంది రికార్డు సమయంలో కార్యకలాపాలు ప్రారంభించింది. పీఎంసీ బ్యాంక్‌ను యూనిటీ బ్యాంక్ స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదన ఉంది. ఆర్బీఐ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఒక బ్యాంక్ మరొక బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవలంటే, ఆ బ్యాంక్ మొదట వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి. -
రూ. 15 కోట్లు గల్లంతు: బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య
భోపాల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే రుణాల్లో అక్రమాలు, ఉన్నతాధికారుల వేధింపులతో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా సహకార బ్యాంకు మక్డాన్ బ్రాంచ్ మేనేజర్ లాల్ సింగ్ కుశ్వాహా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని చిమంగంజ్ మండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖండేల్వాల్ నగర్‌లోని తన ఇంట్లో కుశ్వాహా ఉరి వేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఒక సూసైడ్‌నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంకు ఎండీ విశేష్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ మేనేజర్హే మహేష్ కుమార్ మాథుర్ పేర్లను పేర్కొన్నాడు. తమ అక్రమాలకు, అవినీతికి సహకరించాలంటూ ఉన్నతాధికారులు తనను వేధించారంటూ ఆ లేఖలో పేర్కొనడం కలకలం రేపింది. మరోవైపు ఈ విషయంలో గత ఆరు నెలలుగా తండ్రి మానసిక వేదన అనుభవించాడని కుమారుడు నరేంద్ర చెప్పారు. బ్యాంకులో అవినీతికి పాల్పడటం ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని ఎండీ, ఇతర ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండేదని ఆరోపించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సున్నా శాతం వడ్డీ రేటుతో రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి మక్డాన్ శాఖలో అక్రమాలు వెలుగు చూశాయి. మొత్తం ఎనిమిది ఏఈఎసిల ద్వారా రుణాల పంపిణీకి సంబంధించిన పోర్టల్‌లో అప్లోడ్ సబ్సిడీ షీట్లో సుమారు రూ .15 కోట్ల వరకు తేడా వచ్చింది. దీనిపై పై అధికారులు వివరణ కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, శ్రీవాస్తవ కుశ్వాహాకు నోటీసులు జారీ చేశారు. బహుశా ఈ విషయంలో అతను టెన్షన్ పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామనీ, విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తామన్నారు. -
పార్టీ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ఘట్టం ముగింపు దశకు చేరుకోగా పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పార్టీ మద్దతుదారులకే దక్కేలా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. శనివారం డీసీసీబీ, డీఎస్ఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లా పరిశీలకులతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం కేటీఆర్ గంటన్నర పాటు భేటీ అయ్యారు. శనివారం జరిగే ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన మద్దతుదారులే విజయం సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ ఎన్నికల పరిశీలకులకు దిశా నిర్దేశం చేశారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో వారి ఎంపిక సాఫీగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలకు పరిశీలకులు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు శుక్రవారం రాత్రే జిల్లాలకు బయ ల్దేరి వెళ్లారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, క్యాం పుల్లో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు శనివారం ఉదయం 7 గంటలకల్లా ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. వీరితో ఉదయం 7 గంటలకు పార్టీ పరిశీలకులు సమావేశమై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించిన వారికి మద్దతు పలకాలని కోరతారు. సీల్డ్ కవర్లను తెరిచి పార్టీ నిర్ణయించిన చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగి న తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కోణంలో.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవులకు సంబంధించి పార్టీ సమీకరణాలు, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను సామాజిక సమీకరణాలను దృష్టి లో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరా రుచేసినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొండూరు రవీందర్రావును కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా ఖరారు చేశారు. వీరితోపాటు పోచారం భాస్కర్‌రెడ్డి (నిజామాబాద్), మార్నేని రవీందర్రావు (వరంగల్), అడ్డి బోజారెడ్డి లేదా శరత్చంద్రారావు (ఆదిలాబాద్), మనోహర్‌రెడ్డి (రంగారెడ్డి), గొంగిడి మహేందర్‌రెడ్డి(నల్లగొండ), ఎం.దేవేందర్‌రెడ్డి లేదా చిట్టి దేవేందర్‌రెడ్డి (మెదక్), మనోహర్ (మహబూబ్‌నగర్), కూరాకుల నాగభూషణం లేదా తూళ్లూరు బ్రహ్మయ్య (ఖమ్మం) పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. డీసీఎంఎస్‌కు సంబంధించి మల్కాపు రం శివకుమార్ (మెదక్), శ్రీనివాస్‌గౌడ్ (నిజామాబాద్), పి.క్రిష్ణారెడ్డి (రంగారెడ్డి) పేర్లున్నట్లు సమా చారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టు కుని డీసీసీబీ వైస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన నేపథ్యంలో శనివారం ఉదయం జాబితాపై స్పష్టత రానున్నది. -
నేనే ఈడీ ముందు హాజరవుతా!: పవార్
ముంబై: మనీ ల్యాండరిం గ్ కేసు విచారణకు తానే స్వచ్ఛందంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు ఈనెల 27న హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహారాజా ఛత్రపతి శివాజీ భావజాలాన్ని అనుసరించే తాను కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచబోనని స్పష్టంచేశారు. ‘ఈడీకి నా పూర్తి సహకారం ఉంటుంది’అని చెప్పారు. నేనే ముంబైలోని ఈడీ కార్యాలయానికి వెళ్తా. వాళ్లు అడిగే ఎలాంటి సమాచారాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా’అని పవార్ విలేకరులకు వెల్లడించారు. కాగా, పవార్, అతని సోదరుడి కుమారుడు అజిత్ పవార్, మరో 70 మందిపై ఈడీ కేసువేసింది. -
సహకార బ్యాంక్‌లో రూ.58 లక్షల కుంభకోణం
పెదకూరపాడు : రైతులకు రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు బ్యాంక్ నగదు పుస్తకంలో చూపించి, సొసైటీ ఖాతాలోని రూ.58 లక్షలు గోల్మాల్ చేసిన సంఘటన పెదకూరపాడు మండలం పరసతాళ్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం పరిధిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పెదకూరపాడు శాఖలో చోటు చేసుకుంది. వ్యాపారం పేరుతో ఖాతాలో నగదు డ్రా 2014లో సొసైటీ పేరుతో కాంప్లెక్స్ ఎరువుల వ్యాపారం చేసేందుకని చెప్పి సొసైటీ ఖాతాలో ఉన్న రూ.70 లక్షల్లో రూ.58 లక్షలు డ్రా చేశారు. కొన్నాళ్ల పాటు సొసైటీ పేరుతో ఎరువుల వ్యాపారం చేసిన పాలకవర్గం రెండు సంవత్సరాల్లోనే వ్యాపారం మూసివేసింది. అయితే బ్యాంక్ ఖాతాలో నుంచి తీసుకున్న రూ.50 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. సొసైటీలో రుణం తీసుకోని మండలంలోని గారపాడు, పరస, బలుసుపాడు, లింగంగుంట్ల, పెదకూరపాడు గ్రామాలకు చెందిన సొసైటీలో సభ్వత్వం ఉన్న వారిని 41 మంది పేర్లతో వారికి తెలియకుండా 2017–18 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణాలు ఇచ్చినట్టుగా బ్యాంక్ పుస్తకాల్లో చూపించి ఆ నగదుకు లెక్క సరిపెట్టారు. వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు సొసైటీ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతలే గెలుపొందారు. అందులో చైర్మన్‌తో సహా ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే డైరెక్టర్లుగా ఉన్నారు. పైగా సొసైటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి జీడీసీసీబీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గోల్మాల్ వ్యవహారం బయటకు పొక్కకుండా ఇటు బ్యాంక్ అధికారులను, అటు సొసైటీ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. బ్యాంక్‌లో గత ఏడాది పనిచేసిన నోడల్ అధికారి ఒకరు ఈ కుంభకోణంపై బ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా నేటివరకు విచారణ చేపట్టకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించారు. గత బ్రాంచ్ మేనేజర్ ఈ విషయమై ప్రశ్నించడంతో ఆయన్ను పాలకపార్టీ నాయకులు బదిలీపై పంపించేశారని తెలుస్తోంది. మూలధనమా...రుణమాఫీ నగదా? 2007లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సొసైటీకి రూ.10 కోట్ల మేరకు రుణమాఫీ నిధులు వచ్చాయి. కానీ వాటిలో సుమారు. 9.30 కోట్ల మేరకు రైతులకు రుణమాఫీ చేసి మిగిలిన నగదు సొసైటీ పేరుతో పెదకూరపాడు సహకార బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. అప్పటికే మూలధనం మొత్తం రైతులకు రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. బ్యాంక్‌లో జమచేసిన నగదు రుణమాఫీ నగదుగా పలువురు రైతులు చెబుతున్నారు. నోటీసులు రాకుండా పరపతివినియోగించిన నేతలు ఈ కుంభకోణంపై బ్యాంక్ నోడల్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం విచారణ చేసేందుకు రైతులకు గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా ఆ నోటీసులు రైతుల వద్దకు చేరకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని తెలిసింది. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ డివిజన్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ నిరంజన్ రైతులకు రెండవ విడత నోటీసులు ఇచ్చారు. రైతుల్లో ఆందోళన తమకు తెలియకుండా, తాము ఎక్కడా సంతకాలు చేయకుండా, తమ పేరుతో రుణాలు తీసుకున్నట్టు తెలిసి నోటీసులు అందుకున్న సొసైటీ సభ్యులు విస్తుపోయారు. బ్యాంకు చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వని బ్యాంక్ సిబ్బంది, కనీసం బ్యాంకుకు కూడ వెళ్లకుండా తమకు రుణాలు ఇచ్చినట్టు, వాటి రికవరీకి నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు. మూడు రోజుల పాటు విచారణ రైతులకు నోటీసులు ఇచ్చిన నిరంజన్ మూడు రోజుల పాటు రైతులను విచారించనున్నట్టు తెలిపారు. మొదటి రోజు గారపాడు గ్రామానికి చెందిన రైతులను, మిగిలిన రోజులు పరస, లింగంగుంట్ల, బలుసుపాడు, పెదకూరపాడుకు చెందిన రైతులను విచారించనున్నారు. మొదటి రోజు విచారణలో గారపాడు గ్రామానికి చెందిన రైతులు రుణాల సంగతి తమకు తెలియదని, బ్యాంక్ పుస్తకాల్లో ఉన్న సంతకాలు తమవి కావని తెలిపారు. రుణాల సంగతి మాకు తెలియదని చెప్పారు బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టాం. పరసతాళ్ళూరు సొసైటీ పరిధిలో 41 మంది సభ్యులకు సుమారు రూ.50 లక్షలకు పైగా రుణాలు ఇచ్చినట్టు బ్యాంక్ నగదు పుస్తకంలో రాసి ఉంది. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రైతులకు నోటీసులు అందించాం.అందులో భాగంగా రైతులను విచారణకు పిలవగా, వారు తాము సొసైటీలో సభ్యులమే కానీ, తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని చెప్పారు. ఇదే విషయాన్ని రికార్డు చేసి రైతులకు చదివి వినిపించి సంతకాలు తీసుకుంటున్నాం. –నిరంజన్, ఆసిస్టెంట్ రిజిస్ట్రార్,సబ్ డివిజన్ ఆఫీసర్, సత్తెనపల్లి -
ఆ..కేసు ఏమాయే?
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సంచలనం సృష్టించిన దేవరకొండ సహకార బ్యాంకు బ్రాంచ్ అవినీతి అక్రమాల కేసు మరుగున పడింది. రూపాయి కాదు రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.18 కోట్లు స్వాహా చేసినట్లు తేలింది. అక్రమాలు జరిగి ఆరేళ్లు గడిచినా నేటికీ నయాపైసా అక్రమార్కులనుంచి రికవరీ చేయలేదు. 2011 నుంచి 2013 సంవత్సరం వరకు మూడేళ్లు నిధులు పక్కదారి పట్టినా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చేయి కాలాకా..ఆకులు పట్టుకున్నట్లు..అంతా అయిపోయాక.. అక్రమార్కులపై పోలీస్ కేసులు నమోదు చేయించి సస్పెండ్ మాత్రం చేయించారు. ఇక..అంతటితోనే ఆపేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు.. పక్కదారి పట్టినసొమ్మును మాత్రం రికవరీ చేయించలేదనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల విషయంలో నిగ్గుతేల్చాల్సిన పాలకమండలి మాత్రం రెండు గ్రూపులుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడంతోనే సరిపుచ్చుకుంటున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్లపాటు అక్రమాల పరంపర.. దేవరకొండ, తిమ్మాపూర్, మల్లెపల్లి, చిత్రియాల, డిండి, పీఏపల్లి, తవక్లాపూర్ సహకార సొసైటీల్లో 2011 నుంచి 2013 సంవత్సరం వరకు రుణాల మంజూరులో సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శించారు. మొత్తంగా రూ.18 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో పాలకవర్గం, అధికారులు, రాష్ట్ర సహకార శాఖ కమిషనర్లు నాన్చుడు దోరణికి పాల్పడుతున్నారని గతంలో కొందరు డైరెక్టర్లు లోకాయుక్తాలో పిటిషన్ దాఖలు చేశారు. నాన్చుడు ధోరణికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలు వెలుగు చూసిన తొలుతలో దానికి బాధ్యుడిని చేస్తూ బ్రాంచ్ మేనేజర్‌ను సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన పాలకవర్గం.. తరువాత దానిపై అంత దృష్టి సారించలేదని ఆరోపణలు వచ్చాయి. అందరి ‘సహకారం’తోనే.. రూ.18 కోట్ల మేర జరిగిన అక్రమాలలో పాలకమండలి సభ్యులతో పాటు డీసీసీబీలో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులకు కూడా సంబంధం ఉందనే అనుమానాలను పలువురు డైరెక్టర్లు వ్యక్తం చేసి ఆందోళన కూడా చేశారు. దీనికి పాలకవర్గం ఐదుగురు డైరెక్టర్లతో కూడిన ఫ్రాడ్ కమిటీని వేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సూచించింది. కమిటీ దేవరకొండ, తిమ్మాపూర్, మల్లెపల్లి, చిత్రియాల, డిండి, పీఏపల్లి, తవక్లాపూర్ సొసైటీలలోని సభ్యులతోపాటు రుణాలను పొందినట్లు రికార్డులలో నమోదైన వారందరినీ విచారించింది. మొత్తం 17,91,44,139 రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని తేల్చింది. ఆ నివేదికను డీసీసీబీకి అందించింది. అధికారులు, పాలకవర్గం అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారని, నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతుంటే పర్యవేక్షించిన అధికారులు చేసిన నిర్వాకం, సొమ్మును రికవరీ చేయడానికి బాధ్యులందరి ఆస్తులను అటాచ్ చేయాలని, వారిని ఉద్యోగాల నుంచి తప్పించి విచారణ చేయాలని పలు సందర్భాల్లో పాలకమండలి సమావేశాల్లో సభ్యులు ఆందోళన కూడా చేశారు. విచారణను సీబీఐకి గాని సీబీసీఐడీకి గాని అప్పగించాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేసి పంపించినా ఫలితం లేకుండా పోయింది,. చివరకు కేసు రాష్ట్ర సహకార కమిషనర్ పరిధిలోకి రెండేళ్ల క్రితం వెళ్లింది. కానీ ఇప్పటివరకు కేసు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందనే వాదన వినిపిస్తోంది. డీసీసీబీకి మాయని మచ్చ బాధ్యులనుంచి దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని రికవరీ చేయడంలో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలను సహకార శాఖ ఎదుర్కొంటోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దేవరకొండ అక్రమాల కేసు చెరిపివేయలేని మచ్చని మిగిల్చింది. ఇప్పటికైన అధికారులు స్పందించి పక్కదారి పట్టించిన వారినుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
కథ కంచికేనా..!
కడప అగ్రికల్చర్ : సిద్దవటంలోని సహకార బ్యాంకు బ్రాంచీలో ఉంచిన బంగారు ఆభరణాలు మాయమై 24 రోజులు గడచినా ఇప్పటికి అతీగతీలేదు. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఖాతాదారుల నుంచి వెళ్లువెత్తున్నాయి. ఎంతో నమ్మకంగా ఖాతాదారులు నగలను బ్యాంకు లాకర్లలో దాచుకుంటే కాపాలా కాయల్సిన అధికారులే స్వాహాకు పాల్పడితే ఎవరికి చెప్పు కోవాలని ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులోనే భద్రత లేకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాజంపేట, అట్లూరు, అలిరెడ్డిపల్లె, ఖాజీపేట అగ్రహారం, సిద్దవటం సహకార సొసైటీ బ్యాంకుల్లో వరుసగా స్వాహా పర్వాలు చోటు చేసుకుంటుండడంతో సభ్యులు, ఖాతాదారులు హడలిపోతున్నారు. రాష్ట్ర సహకార శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో దీన్ని బట్టే అర్థమవుతోందంటున్నారు. జరిగింది ఇలా.. గత నెల 7వ తేదీన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బదిలీపై రాజంపేట బ్రాంచీకి వెళ్లారు. అయితే 17న నగల లాకర్‌ను బ్యాంకు మేనేజర్ రవిచంద్రరాజు అనుమానం వచ్చి తీసి పరిశీలించారు. రికార్డు ప్రకారం 34 మంది ఖాతాదారుల నగలు ఉండాలి. అయితే అందులో నలుగురికి చెందిన నగల చిరు సంచుకులు కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన మేనేజర్ వెంటనే అక్కడి బ్యాంకు అధికారులను సమావేశపరిచారు. నగల లాకర్ నుంచి మాయమైన విషయమై చర్చించారు. అధికారులు, సిబ్బంది తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులు మేనేజర్‌ను, అసిస్టెంట్ మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఖాతాదారుల్లో నమ్మకం కలిగిలా పటిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పబ్లిక్‌లో ఎదైనా సంఘటన జరిగినా, దొంగతనాలు జరిగిన సందర్భంలో హడావిడి చేసే పోలీసులు బ్యాంకులో నగలు స్వాహా అయి 24 రోజలు గడచినా ఎందుకు అరెస్టులు చేయలేదని సంఘంలోని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. బాధితులు రైతులే.. సిద్దవటం సహకార బ్యాంకులో గత ఏడాది 34 మంది రైతులు తమ పంటల సాగు కోసం నగలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఇందులో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన పాటూరి విజయభాస్కరరెడ్డి 221 గ్రాముల బంగారును తాకట్టు పెట్టి రూ.3.28 లక్షలు, సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి సుబ్బమ్మ 28.5 గ్రాముల నగలు కుదువ పెట్టి రూ.40 వేలు, అదే మండలం పి.కొత్తపల్లెకు చెందిన రూపురెడ్డి ఎల్లారెడ్డి మొదటిసారి 62.5 గ్రాములకు రూ.95 వేలు, రెండోసారి 65.5 గ్రాముల నగలను తాకట్టుపెట్టి రూ.99 వేలు నగదు తీసుకున్నారు. ఇందులో ప్రతినెల పాటూరి విజయభాస్కరరెడ్డి మాత్రమే రూ.3250లు వడ్డీ చెల్లిస్తున్నారు. మిగతా వారు జూన్, జూలై నెలలో వడ్డీ చెల్లించి నగలు తీసుకోవడమో, రెన్యూవల్ చేయడమో చేస్తామని అనుకున్నారు. ఇంతలోనే అధికారులు ఆ నగలపై కన్నువేసి దోపిడీ చేశారు. అరెస్టులు లేవు జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. కేవలం విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారేగాని, అక్రమాలకు పాల్పడిన వారిని ఇంత వరకు అరెస్టులు చేయలేదని, ఒకవేళ నగలను స్వాధీనం చేసుకున్నారా అం టే అదీ లేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ జరుగుతోంది నగలు మాయమైన విషయం బయటపడింది వాస్తమే. దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు. 24 రోజులు పూర్తి అయింది. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణ పూర్తి కాగానే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయి. – వెంకటరత్నం, సీఈఓ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, కడప. -
బ్యాంకులో.. నగలు ఏమయ్యాయి?
సిద్దవటం : సిద్దవటంలోని సహకార బ్యాంకు బ్రాంచ్‌లో ఉంచిన బంగారు ఆభరణాలు మాయమవడంతో ఖాతాదారులు, నగలను లాకర్లలో ఉంచిన వారు బెంబేలెత్తుతున్నారు. బ్యాంకులోనే భద్రత లేకపోతే ఎలా అని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలోనే ఇటీవల సొసైటీ బ్యాంకుల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. ఆయన పట్టించుకోక పోవడం గమనార్హం. మొన్న రాజంపేట, ఆ మొన్న అట్లూరు, నిన్న అలిరెడ్డిపల్లె, ఖాజీపేట అగ్రహారం, సిద్దవటం సహకార సొసైటీ బ్యాంకుల్లో నగదు, నగలు మాయం అయ్యాయి. సిద్దవటంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అనుబంధంగా డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఉంది. దీని నుంచి రైతులు, సంఘ సభ్యులు రుణాలు తీసుకుంటున్నారు. అందులో కొందరు బంగారును తాకట్టు పెట్టి నగదును రుణంగా తీసుకున్నారు. 377.5 గ్రాముల బంగారు నగలు మాయం గతేడాది 34 మంది రైతులు తమ పంటల సాగు కోసం నగలను తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఇందులో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన పాటూరి విజయభాస్కరరెడ్డి 221 గ్రాముల బంగారును తాకట్టు పెట్టి రూ.3.28 లక్షలు, సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి సుబ్బమ్మ 28.5 గ్రాముల నగలు కుదువ పెట్టి రూ.40 వేలు, అదే మండలం పి.కొత్తపల్లెకు చెందిన రూపురెడ్డి ఎల్లారెడ్డి మొదటి సారి 62.5 గ్రాములకు రూ.95 వేలు, రెండో సారి 65.5 గ్రాముల నగలను తాకట్టుపెట్టి రూ.99 వేలు నగదును తీసుకున్నారు. ఇందులో ప్రతి నెల పాటూరి విజయభాస్కరరెడ్డి మాత్రమే రూ.3250 వడ్డీ చెల్లిస్తున్నారు. మిగతా వారు జూన్, జూలైలలో చెల్లించి నగలు తీసుకోవడమో, రెన్యూవల్ చేయడమో చేద్దామని అనుకున్నారు. ఇంతలోనే అధికారులు ఆ నగలపై కన్ను వేశారు. ఈ నెల 17న బయపడిన వ్యవహారం ఈ నెల 7న బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బదిలీపై రాజంపేట బ్రాంచ్‌కి వెళ్లారు. ఆ తరువాత ఈ నెల 17న నగల లాకర్‌ను బ్యాంకు మేనేజర్ రవిచంద్రరాజు అనుమానం వచ్చి పరిశీలించారు. 34 మంది ఖాతాదారుల నగలు రికార్డు ప్రకారం ఉండాలి. అయితే అందులో నలుగురికి చెందిన నగల సంచులు కనిపించకపోవడంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అధికారులను సమావేశ పరచి చర్చించారు. వారు ఎలాంటి సమాచారం తెలపలేదు. బ్రాంచ్ మేనేజర్ జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. జిల్లా కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ వచ్చి సీసీ కెమరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ను జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులు సస్పెండ్ చేశారు. అయితే నగల మాయంపై బ్యాంకర్లు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
రుణాలపై రిబేటేదీ..?
సేద్యం చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కోఆపరేటివ్ బ్యాంక్‌ల ద్వారా వ్యక్తిగత దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. తీసుకున్న రుణాలకు రైతు చెల్లించ వడ్డీలో ప్రభుత్వం ఆరు శాతం రిబేట్ భరించాల్సి ఉండగా రెండేళ్లుగా పైసా ఇవ్వడం లేదు. దీంతో అసలు, వడ్డీ తడిసిమోపెడవుతుండడంతో రైతులు కిస్తులు చెల్లించలేకపోతున్నారు. మరో వైపు బాకీ చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రాజాపేట (ఆలేరు) : సహకారం సంఘాల్లో రైతులు తీసుకున్న వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణంపై ఇవ్వాల్సిన ఆరు శాతం వడ్డీరాయితీపై ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రెండేళ్లుగా రిబేట్ ఇవ్వకపోవడంతో రైతులపై అప్పుల భారం ఎక్కువవుతోంది. డీసీసీబీ ద్వారా కోఆపరేటీవ్ బ్యాంకులు రైతుల అభివృద్ధికి వ్యక్తిగత, దీర్గకాలిక రుణాలను జారీ చేస్తాయి. వీటిలో ప్రధానంగా 5 ఎకరాలు పైబడిన రైతులకు ట్రాక్టర్ల కోసం రూ.5లక్షల రుణాలను అందజేసింది. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో 107 బ్యాంకుల్లో 3,818 మంది రైతులు ట్రాక్టర్ల కోసం రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు చెల్లించే క్రమంలో ప్రభుత్వం వడ్డీలో ఆరు శాతం రాయితీ ఇస్తుంది. ఈ వడ్డీ రాయితీని ప్రభుత్వం గతేడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో ట్రాక్టర్ల కోసం రుణం పొందిన రైతులు గడువులోగా కిస్తీ చెలిస్తూ రిబేట్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం రిబేట్ చెల్లించకపోవడం.. ప్రస్తుత కిస్తీ గడువు జనవరి 31లోపు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో రైతులకు ఎటూ పాలుపోవడంలేదు. జనవరి 31లోపు రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు, వడ్డీ చెల్లించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ రాయితీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.250 కోట్లు రిబేట్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రుణాల చెల్లింపులు ఇలా.. కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రైతులకు 6 శాతం రిబేట్‌పై రూ.5లక్షలు వ్యక్తిగత దీర్ఘకాలిక రుణం అందజేసింది. ఈ రుణాన్ని అసలు, వడ్డీ కలిపి 9 సంత్సరాల కాలపరిమి తిలో రైతులు చెల్సించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు అధికారులు రైతుల పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్, బాండ్లు వంటివి తీసుకుని రుణాలు ఇస్తారు. రుణం తీసుకున్న రైతు మొదటి సంవత్సరానికి రూ.98,340 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు రూ.32,090, వడ్డీ 66,250 మొత్తం రూ.98,340 అవుతుంది. వడ్డీ రూ.66,250లో 6 శాతం రిబేట్ సుమారుగా రూ.30,000 పోను రూ.36,250, అసలు రూ.32090 మొత్తం రూ.68,240 రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రుణంతీరే వరకు ఏటా మొత్తం చెల్లింపులో తేడా లేకున్నా వడ్డీ తగ్గుతూ.. అసలు పెరుగుతూ వస్తుంది. కాగా రెండు సంవత్సరాలుగా 6 శాతం రిబేట్ రాకపోవడంతో రైతుపై సుమారు రూ.60 వేల వరకు భారం పడుతోంది. ఇప్పటికే పంటల దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న తమపై ప్రభుత్వం కనికరం చూపడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లకు సంబంధించిన రిబేట్ వెంటనే మంజూచేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులకు రిబేట్ అందించాలి పీఏసీఎస్‌లలో రెండు సంవత్సరాలుగా 6శాతం రిబేట్ రావడంలేదు. ప్రభుత్వం వెంటనే రైతులకు రిబేటు అందించాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల్లో ఉన్నారు. ప్రభుత్వం రిబేట్ చెల్లించకుంటే ట్రాక్టర్లను బ్యాంకు అధికారులకు అప్పగిస్తాం.– బైర పాండు, రైతు, బేగంపేట రెండేళ్లుగా రిబేట్ రాలేదు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో వ్యవసాయ సేద్యం కోసం ట్రాక్టర్లకు వ్యక్తిగత దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులకు రావాల్సిన 6 శాతం రిబేట్ రెండు సంత్సరాలుగా రాలేదు. ఈ విషయాన్ని రైతులు పలుమార్లు మా దృష్టికి తెచ్చారు. ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – ప్రసాద్, ఏజీఎం, నల్లగొండ -
బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు
-
బ్యాంకుకు టోకరా వేసిన మంత్రిగారి బంధువు
సాక్షి ప్రతినిధి, కడప: సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే పాలక వర్గంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (టౌన్ బ్యాంకు)లో రూ.2 కోట్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. చైర్మన్ హృషి కేశవరెడ్డి, సీఈవో బాలాజీ ఈ సొమ్మును స్వాహా చేయడంతో బ్యాంకు మూతపడే పరిస్థితి వచ్చిందని ఈ నెల 22, 23వ తేదీల్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేల్చారు. హృషికేశవరెడ్డి మీద సోమవారం పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాలకవర్గాన్ని రద్దు చేసి, జమ్మలమడుగు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు. జమ్మలమడుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడంతో పాటు, రుణాలు మంజూరు చేస్తూ వ్యాపారం చేసింది. సహకార చట్టం కింద నడుస్తున్న ఈ సొసైటీ యాక్సిస్ బ్యాంకులో ఖాతా తెరచి తమ బ్యాంకుకు వచ్చే మొత్తాన్ని అందులో జమ చేసి లావాదేవాలు జరిపింది. మంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషి కేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌గా, మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ తులసి భర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి కుటుంబం, బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ.2 కోట్లు పక్క దారి పట్టాయి. వ్యాపారులు కట్టిన సొమ్మును యాక్సిస్ బ్యాంకులో జమ చేయకుండా చైర్మన్ హృషి కేశవరెడ్డి తన సొంత అవసరాలకు వాడుకున్నారు. హృషికేశవరెడ్డిపై కేసు.. ఆస్తుల అటాచ్‌కు ఆదేశం రూ.1.41 కోట్లు కాజేశాడనేందుకు ఆధారాలు లభించడంతో చైర్మన్ హృషి కేశవరెడ్డిపై సోమవారం డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సహకార చట్టంలోని సెక్షన్ 73 కింద ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు అటాచ్ చేయాలని జిల్లా సహకార శాఖాధికారి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు సెక్షన్ 51 కింద లోతైన దర్యాప్తు జరపాలని డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. క్రెడిట్ సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేసి జమ్మల మడుగు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు. కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి చెందిన రూ.1.41 కోట్లు తనకు చేరినట్లు, మరో రూ.54 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు చైర్మన్ హృషి కేశవరెడ్డి విచారణ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. రూ.5 లక్షలు వాడుకున్నట్లు సొసైటీ సీఈవో బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాము కష్టపడి దాచుకున్న సొమ్ము తిరిగి ఇచ్చేయాలని బాధితులు చైర్మన్ హృషి కేశవరెడ్డిని కలసి కోరారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు, విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి తనకు రూ.కోటి ఇవ్వాలని, ఆయన ఆ సొమ్ము తనకిస్తే ఈ బాకీ తీరుస్తానని చెబుతున్నారని వారు గగ్గోలు పెడుతున్నారు. విద్యా సంస్థల కేశవరెడ్డి బాకీతో తమకు సంబంధం ఏమిటని, తమ సొమ్ము వెంటనే తమకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పాతనోట్ల మార్పిడి నో చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత ధర్మాసనం నాసిక్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు షాకిచ్చింది. రద్దయిన పెద్దనోట్లను భారీమొత్తంలో డిపాజిట్ చేయడానికి అనుమతిని సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.371కోట్ల పాత కరెన్సీనోట్ల మార్పిడికి అనుమతించాల్సిందిగా పెట్టుకున్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టి పారేసింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలో ఆర్టికల్32 ప్రకారం ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. నోట్ల జమకు ఆర్బీఐ నిరాకరించిడంతో కో ఆపరేటివ్ బ్యాంకు సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. ఈ నోట్ల జమకు అనుమతిని నిరాకరిస్తే..లిక్విడిటీ రేషియో దెబ్బతింటుందని, తద్వారా నాసిక్ జిల్లాలో 281 తమ కార్యాలయాలు మూతపడతాయని బ్యాంకు వాదించింది. 2016, నవంబర్ 8-14 మధ్య తమ ఖాతాదారులు జమ చేసిన సొమ్ము ఇది అనీ, ఎక్కువగా రైతులకు రుణాలను అందించే బ్యాంకు శాఖలు మూసివేత తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందన్న బ్యాంకు వాదించింది. కోఆపరేటివ్ బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలను వినిపించారు. ఇది ఇలా ఉంటో మరోకేసులో కూడా రద్దయిన నోట్ల డిపాజిట్‌కు ఎపెక్స్ కోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఎన్పీఏగా ప్రకటించిన రాను ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిరన రూ. 10కోట్లను పాత కరెన్సీమార్పిడికి అనుమతిని నిరాకరించింది. -
ఆర్బీఐ తీరుకు నిరసన
– నోట్ల మార్పిడి, డిపాజిట్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ – రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్వులు సడలించాలి - కేడీసీసీబీ ఎదుట ధర్నా కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో రద్దయిన నోట్ల మార్పిడి, డిపాజిట్లు స్వీకరించడాన్ని ఆర్బీఐ నిషేదించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా సహకార కేంద్రబ్యాంకు అధికారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగుల యూనియన్, ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించిన ధర్నాకు కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, సీఈఓ రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వర రెడ్డి, సునిల్‌కుమార్, శివలీల, ఏజీఎంలు పద్మావతి, నూర్అహ్మద్బాషా తదితరులు సంఘీభావం ప్రకటించారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటున్న ఈ బ్యాంకులో డిపాజిట్లు,నోట్ల మార్పును నిషేదించడం తగదన్నారు.దీంతో రైతులు నుంచి రికవరీలు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.యూనియన్ల నేతలు మాట్లాడుతూ ఉత్తర్వులను సడలించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. జిల్లా సహకార కేంద్రబ్యాంకు ఉద్యోగుల యూనియన్ నేతలు రాఘవేంద్ర, త్రీనాథ్రెడ్డి, నాగమద్దిలేటి, ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు ఈశ్వరరెడ్డి, శివరామకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు -
సహకార బ్యాంకుల సిబ్బంది నిరసన
అశ్వారావుపేట: సహకార బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను తీసుకోవద్దంటూ రిజర్వు బ్యాంకు ఆదేశాలు ఇవ్వడాన్ని ఆ బ్యాంకుల సిబ్బంది నిరసిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శాఖకు సిబ్బంది తాళాలు వేశారు. రద్దు చేసిన పెద్ద నోట్లను సహకార బ్యాంకులు తీసుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సత్తుపల్లిలోనూ డీసీసీబీ ముందు బ్యాంకు సిబ్బంది, చైర్మన్, రైతులు ఆందోళన నిర్వహించారు. -
రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద మృతి
నల్లగొండ జిల్లా హుజూరాబాద్ మండలం శ్రీనగర్ కాలనీలో సహకార బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ వెంకటరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా మృతిచెందడంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.