'కంపెనీల బిల్లు చరిత్రాత్మకం'
న్యూఢిల్లీ: కొత్త కంపెనీల బిల్లును పార్లమెంట్ గురువారం ఆమోదించింది. వెరసి ఆరు దశాబ్దాల పాత చట్టం మూలనపడనుంది. పార్లమెంట్ ఆమోదం పొందిన కొత్త బిల్లుపై రాష్ర్టపతి సంతకం చేయాల్సి ఉంది. దీంతో ఈ బిల్లు చట్టంగా మారుతుంది. బిల్లు పాస్ కావడంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్ స్పందిస్తూ ఇది చరిత్రాత్మక విషయమన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
30 సెక్షన్లూ, 300 పేజీలూ
1956 కంపెనీల చట్టం స్థానే రానున్న కొత్త బిల్లును 30 రకాల సెక్షన్లు, 300 పేజీలతో రూపొందించారు.పాత చట్టం గత 57 ఏళ్లలో 25సార్లు సవరణలకు లోనుకాగా, కొన్ని ప్రొవిజన్లు ఇప్పటికీ కాలానుగుణంగా లేకపోవడం గమనార్హం. కొత్త బిల్లుకు పారిశ్రామిక వర్గాలు, రాజకీయ నాయకులు, కన్సల్టెంట్లు తదితరుల నుంచి మద్దతు లభించింది. అనవసర నిబంధనలను తగ్గించడం ద్వారా చట్టాన్ని స్వతంత్రంగా పాటించేలా చేయాలన్నది కొత్త బిల్లు లక్ష్యమని పైలట్ పేర్కొన్నారు.