పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
పాఠశాల కరస్పాండెంట్ వేధింపుల వల్లేనని తండ్రి ఫిర్యాదు
కారేపల్లి : పదోతరగతి విద్యార్థిని గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి, పోలీసులు తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లా మాదారం గ్రామ పంచాయతీలోని కొత్తతండా గ్రామానికి చె ందిన బాణోతు నాగమణి(15) స్థానిక ప్రగతి విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 7న పాఠశాలలో ప్రత్యేక తరగతులకు వెళ్లిన నాగమణిని పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డి స్కూల్ ఫీజు అడిగాడు. ఫీజు చెల్లించలేకపోతే తన గదికి రావాలంటూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీంతో, ఆమె రెండు రోజుల నుంచి పాఠశాలక వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది.
పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని తండ్రి శంకర్ గురువారం ఉదయం ప్రశ్నించడంతో.. ఆమె అసలు విషయం బయటపెట్టింది. పాఠశాలకు వెళ్లవద్దని చెప్పి, ఆయన పొలం పనులకు వెళ్లాడు. ఆ తరువాత ఆమె ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని సింగరేణి తహసీల్దారు ఎం.మంగీలాల్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కారేపల్లి పోలీసులు పంచనామా నిర్వహించారు. నాగమణి తండ్రి ఫిర్యాదుతో పాఠశాల కరస్పాండెంట్ రామిరెడ్డిపై ఎస్ఐ బి.మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, నాగమణి ఆత్మహత్యపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.