ఇరకాటంలో పడ్డ స్నాప్ డీల్
న్యూఢిల్లీ : ఇప్పటికే నిధుల రాక తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ఇప్పుడు మరో ఇరకాటంలో పడింది. స్నాప్డీల్ సీఈవో కునాల్ బహల్, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలైంది. దీనిపై వారికి కోర్టు సమన్లు పంపింది. ఈ-ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలుదారులను, విక్రయదారులను కనెక్ట్ చేసే ఐడియాను అనధికారికంగా స్నాప్ డీల్ సంస్థ, దాని అధికారులు వాడుకుంటున్నారంటూ గౌరవ్ దువా అనే వ్యాపారవేత్త ఆరోపించారు. ఈ ఆరోపణలు చేస్తూ స్నాప్ డీల్, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్లపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. నాన్-ఇన్వెంటరీ మార్కెట్ ప్లేస్ మోడల్ ఐడియా తనదేనని వ్యాపారవేత్త చెప్పారు.
ఐపీసీ సెక్షన్లు 420 మోసం, 406 నమ్మకానికి భంగం కలిగించడం, 120బీ నేరపూరిత కుట్ర కింద తన ఫిర్యాదును దాఖలు చేశారు. అయితే ఈ కేసును ట్రయల్ కోర్టు తోసిపుచ్చగా.. సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ ను ఆ వ్యాపారవేత్త వేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి, సంస్థ సీఈవో కునాల్కి, సీఓఓ రోహిత్ బన్సాల్, మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విజయ్ అజ్మేరాకు అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్కే త్రిపాఠి నోటీసులు జారీచేశారు. ఫిర్యాదు ప్రకారం దువా, ఇంజనీర్, వ్యాపారవేత్త. 1999లో మార్కెట్స్ఢిల్లీ.కామ్ ను, 2005లో ఇండియారిటైల్.కామ్ ను స్థాపించారు.
డిజిటల్ టెక్నాలజీ ప్రయోజనాలను రిటైల్ కమ్యూనిటీకి అందించడానికి ఆయన వీటిని తీసుకొచ్చారు. అయితే నాన్-ఇన్వెంటరీ హోల్డింగ్ మార్కెట్ ప్లేస్ మోడల్ ను తీసుకొచ్చిన తనని, స్నాప్డీల్ అధికారులు మోసం చేశారని ఆరోపించారు. తన బిజినెస్లలో పెట్టుబడులు పెడుతూ తనని చీట్ చేసినట్టు పేర్కొన్నారు.