మరోసారి వేలానికి వైస్రాయ్ హోటల్
రిజర్వు ధర రూ.92.34 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన కోర్ట్‌యార్డ్ మారియట్ హోటల్ మరోసారి వేలానికి వచ్చింది. వైస్రాయ్కి రుణమిచ్చిన కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఆస్తుల పునర్నిర్మాణ, వాటాదారుల ప్రయోజనాల అమలు చట్టం (సర్ఫయేసి) కింద ఈ–వేలాన్ని ప్రకటించాయి. కంపెనీ ఎస్బీఐకి రూ.68.31 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.28.24 కోట్లు బాకీ పడింది. 2012 నుంచి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంది. ఇరు బ్యాంకుల నుంచి వైస్రాయ్ రూ.100 కోట్లకుపైగా రుణం తీసుకున్నట్టు సమాచారం.
2016 జనవరిలో, అలాగే అదే ఏడాది చివర్లో కూడా బ్యాంకులు వేలం వేస్తున్నట్లుగా ప్రకటించాయి. కానీ అప్పట్లో ఇన్వెస్టర్ల నుంచి స్పందన రాలేదని బ్యాంకు అధికారి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. హుస్సేన్‌సాగర్ సమీపంలోని కోర్ట్‌యార్డ్ మారియట్ హోటల్లో 120 గదులున్నాయి. వైస్రాయ్ హోటల్స్‌ను ప్రస్తుతం యూఎస్‌కు చెందిన మారియట్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తోంది. ఫ్రాంచైజీ, మార్కెటింగ్తోపాటు 20 ఏళ్లపాటు నిర్వహణకుగాను 2003లో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక వేలం రిజర్వు ధరను రూ.92.34 కోట్లుగా బ్యాంకులు నిర్ణయిం చాయి. బిడ్డింగులో పాల్గొనేవారు రూ.9.23 కోట్లు డిపాజిట్ చేయాలి. ఈ నెల 28న వేలం జరగనుంది. దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ ఈ నెల 26.