పౌష్టికాహారం పక్కదారి
ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాల్లో పేదలకు అందాల్సిన పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అందజేస్తున్న సరుకుల్లో టెండర్ల నిర్వాహకులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ఈ టెండర్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తుండడం వెనుక అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా కావడం లేదు. అమలు లక్ష్యం దెబ్బతింటోది. పేదలకు అందాల్సిన పౌష్టికాహారం అందని ద్రాక్షపండులా మిగిలిపోతోంది. పేద మహిళలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందక మృత్యువాతపడుతున్నారు. అనారోగ్య శిశువులకు జన్మనిస్తున్నారు.
ఈ సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు కోడిగుడ్లు, పాలు, బలవర్థక ఆహారం అందించడంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ పథకం అమలు క్షేత్రస్థాయిలో అధ్వానంగా ఉంది. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,774 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పౌష్టికాహారం లోపం వల్ల 8 ప్రాజెక్టుల్లో మధ్యాహ్న భోజనాన్ని అందించే అమృతహస్తం పథకం గత ఏడాది నుంచి అమలుచేస్తున్నారు. ఈ పథకం ద్వారా సుమారు పదివేల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లో 25,700 మంది గర్భిణులు, 27,300 మంది బాలింతలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, 500 గ్రాముల నూనె, వారానికి 4 కోడిగుడ్లు అందజేస్తున్నారు. 3-6 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రం మధ్యాహ్నం ఒక్కపూట అన్నం, కోడిగుడ్లు, పాలు, ఉడికించిన శనగలు అందించాల్సి ఉంది.
సరుకులు స్వాహా?:అంగన్వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ల ద్వారా సరుకులు అందజేయాలి. సరుకులను జిల్లా కేంద్రం నుంచి ప్రాజెక్టు కేంద్రానికి సరఫరా చేస్తారు. అక్కడినుంచి అంగన్వాడీ కేంద్రాలకు అందించాలి. అయితే ప్రతినెలా క్రమపద్దతి ప్రకారం సరుకుల సరఫరా జరగడం లేదు. రెండు, మూడు నెలలకు ఒకేసారి సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇక్కడే సరుకులకు కోత పడుతోంది. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై సరుకులు స్వాహా చేస్తున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టుల నుంచి అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే సరుకుల్లో కూడా కోత పడుతోంది. కొంతమంది సూపర్వైజర్లు ఈ సరుకుల్ని కొంతమేర స్వాహాచేసి కేంద్రాలకు పంపుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలోనే లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సరుకులు అందడం లేదు.
రవాణాలోనూ తప్పని తిప్పలు:
నిబంధనల ప్రకారం జిల్లాకేంద్రం నుంచి ప్రాంతీయ ప్రాజెక్టులకు సరుకులుసరఫరా కావాలి. అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలి. కానీ చాలాచోట్ల అలా జరగడం లేదు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నుంచి ఒక్కొక్క మండలంలో రెండు మూడుచోట్లకు సరఫరా చేస్తున్నారు. అక్కడినుంచి ఆ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో సరుకులు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రవాణా భారం కూడా కార్యకర్తలపై పడుతోంది.
కార్యకర్తలకు తప్పని వేధింపులు:
ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లు చాలాకాలం నుంచి పాతుకుపోయి ఉండడంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమ మాటకు ఎదురుచెప్పే కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. చాలామంది సూపర్వైజర్లు సరుకుల్లో కోత పెట్టడాన్ని ప్రశ్నించిన కార్యకర్తలకు వేధింపులు తప్పడం లేదు. పైగా అమృతహస్తం బిల్లులు, ఇంటి అద్దెలు, కట్టెల బిల్లులు, ఇతర బిల్లుల్లో పర్సంటేజీలను ముక్కుపిండి వసూలుచేస్తున్నారు. కొంతమంది సూపర్వైజర్ల వసూళ్లపర్వంపై కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ప్రయోజనం శూన్యం.
అవకతవకలు జరిగితే సహించం
సరుకుల సరఫరాలో అవకతవకలు జరిగితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవు. సిబ్బంది అవినీతికి పాల్పడినా కఠిన చర్యలుంటాయి. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే కార్యకర్తలు నేరుగా మా దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి గ్రాము సరుకు లబ్ధిదారులకు అందాలి. విజయలక్ష్మి, పీడీ