రైతుకు ‘మద్దతు’ అందని ద్రాక్షే!
- అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్న దళారులు
- కస్టమ్ మిల్లింగ్ ప్యాడీలో భారీ అవకతవకలు
- విచారణ కోసం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా
- మీడియాతో మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి
- కల్తీకల్లు మరణాలు ‘ఎక్సైజ్’ పాపమేనని ఆరోపణ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఆరుగాలం శ్రమించే రైతులకు ప్రతిసారీ అన్యాయమే జరుగుతోంది. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందని ద్రాక్షలా మారుతోంది. బినామీ పేర్లతో కొందరు వ్యాపారులు, మిల్లర్లు నేరుగా తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ..మద్దతు ధరనూ వారే కాజేస్తున్నారు. ఏటా రూ. 30 కోట్ల వరకు మింగేస్తున్నారు’’ అని ఆరోపించారు మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి.
దళారులు, వ్యాపారులకు కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారం ఉందన్నారు. శనివారం ఆయన నిజామాబాద్‌లోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు బినామీల పేరిట మిల్లర్లు రూపొందించిన తప్పుడు రికార్డులను బయటపెట్టారు. జిల్లాలో ఏటా సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోందని, ఇందులో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఐకేపీ, పీఏ సీఎస్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారన్నారు.
మిగతా ధాన్యాన్ని మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారన్నారు. వారు కొనుగోలు చేసిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా, క్వింటాలుకు రూ. 50 నుంచి రూ. 125 వరకు తక్కువ చెల్లిస్తున్నారని, ఇలా ఏటా రూ.30 కోట్ల వరకు తమ జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ పాపంలో పౌరసరఫరాల శాఖది సింహభాగం కాగా, ఇష్టారాజ్యంగా సర్టిఫై చేస్తూ రెవెన్యూ అధికారులు కొందరు పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు.
కొత్త ఎత్తుగడలతో
రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెక్కుల రూపేణ కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రకారం ధాన్యం చెల్లింపులు జరుపుతోందని మాజీ మంత్రి అన్నారు. మిల్లర్లు కొత్త ఎత్తుగడలతో దీనికీ తూట్లు పొడిచారని ఆరోపించారు. ధాన్యం అమ్మిన రైతుకు తక్కువ ధరతో నేరుగా డబ్బులు చెల్లిస్తూ నమ్మకస్తులైన బినామీల పేరిట ఓచర్, చెక్కులు రాసి ఇస్తున్నారని పేర్కొన్నారు. కస్టమ్ మిల్లింగ్ ప్యాడీ(సీఎంపీ)లో ఏటా భారీ అవకతవకలు జరుగుతున్నాయని, పౌరసరఫరాల శాఖకు చెందిన కొందరు అధికారులు ఇందులో కీలక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు.
15 రోజులలోనే 67 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీ ద్వారా చెల్లించాల్సి ఉండగా, నెలలు గడుస్తున్నా చెల్లించకుండా సర్కారు సొమ్ముతో మిల్లర్లు వ్యాపారం చేస్తున్నారన్నారు. డిఫాల్టర్లయిన మిల్లర్లతో మిలాఖత్ అవుతున్న అధికారులు తిరిగి వారికే కేటాయిస్తున్నారని, ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ఇదేంటని అడిగితే, రవాణా సౌకర్యం కల్పించాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
పౌరసరఫరాల శాఖలో పదేళ్లుగా వివిధ స్థాయిలలో ప నిచేసి ఏజీపీఓగా ఉన్న శ్రీనివాస్ ఇటీవలే బోధన్ మండలం పెంటకలాన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌పై దురుసుగా మాట్లాడటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా తాను సూచించిన మిల్లుకే ధాన్యం పంపాలని బెదిరించారని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్ల అక్రమాలపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
కల్తీ కల్లు విషయంలో..
కల్తీకల్లు మరణాలకు కల్లు మాఫియాతోపాటు ఎక్సైజ్ శాఖనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంగెం సంఘటన దురదృష్టకరమన్నారు. కల్లు మాఫియాపై ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు ఫిర్యాదు చేశామన్నారు.