లడ్డూ సైజు తగ్గుతోంది
– ‘డయల్ యువర్ ఈవో’లో భక్తుల ఫిర్యాదు
తిరుమల: టీటీడీ అందించే ఉచిత సేవల్లో సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని భక్తులు టీటీడీ ఇవోకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో పలువురు భక్తులు పలు రకాల సమస్యలను ఆలయ ఈవో సాంబశివరావు దృష్టికి తీసుకొచ్చారు. కల్యాణకట్ట, వివిధ విభాగాల సిబ్బంది డిమాండ్ చేస్తున్నారని హైదరాబాద్, విశాఖపట్నం భక్తులు గణేష్, మూర్తి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈవో సాంబశివరావు స్పందిస్తూ కట్నాన్ని రద్దు చేశామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
వృద్ధుల దర్శనాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకే మూసివేస్తున్నారని చెన్నైకు చెందిన గజేంద్రబాబు చెప్పగా వృద్దులు, వికలాంగులకు ఉదయం 10, మధ్యాహ్నం 3 గంటల దర్శన స్లాట్‌కు 750 మంది చొప్పున అనుమతిస్తున్నామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే ఉంటుందని ఈఓ చెప్పారు. శ్రీవారి లడ్డూ నాణ్యత లేదు. కనీసం నెయ్యి వాసన రావటం లేదని మరో భక్తుడు కోరగా లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యి, శనగపప్పు వినియోగిస్తున్నామని తెలిపారు.నడకదారిలో తాగునీటి కొళాయిల్లో శుభ్రత లేదు. మార్గంలోని దుకాణాల్లో అధిక ధరలు ఉన్నాయి. వేసవిలో మజ్జిగ పంపిణీ చేయండని అమరావతికి చెందిన శ్రీనివాసరావు సూచించారు. వేసవిలో గాలిగోపురం వద్ద మజ్జిగ పంపిణీ చేయిస్తున్నామని, నడకదారిలో పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని, దుకాణాల్లో ఎక్కువ ధరలకు విక్రయించకుండా తనిఖీలు చేయిస్తామని అన్నారు.